నవంబర్‌ 1 నుండి 7 వరకు ప్రజా హోరు... 8వ తేదీన ప్రజా సమస్యలపై ధర్నాలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 అక్టోబర్‌, 2024.
నవంబర్‌ 1 నుండి 7 వరకు ప్రజా హోరు
8వ తేదీన ప్రజా సమస్యలపై ధర్నాలు
        అధిక ధరలు, నిరుద్యోగం, మహిళలు, పిల్లలు, దళితులపై అత్యాచారాలు, జమిలి
ఎన్నికలు, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్‌ 1 నుండి 7 వరకు
రాష్ట్రవ్యాపితంగా ప్రజా హోరు పేరుతో ఇంటింటా ప్రచార కార్యక్రమం
నిర్వహించాలని 8వ తేదీ జిల్లా కలెక్టరేట్లు, మండల కార్యాలయాల వద్ద ధర్నాలు
చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అక్టోబర్‌ 10,11 తేదీలలో
యం.ఏ.గఫూర్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశ నిర్ణయాలను
రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.
బాబూరావు నేడు విలేకర్ల సమావేశంలో వివరించారు.
        గత మాసం రోజుల్లోనే ధరలు సామాన్యులకు అందుబాటులో లేనివిధంగా
ఆకాశాన్నంటాయి. దసరా పండుగ రోజు సరుకుల కొనుగోళ్ళలోనూ ధరల ప్రభావం
కనిపించింది. రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను సరసమైన ధరలకు
అందించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేసింది.
        రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు వస్తాయని
ఎదురుచూస్తున్న యువత నిరాశకు గురవుతున్నది. డిఎస్సీ వాయిదా పడిరది.
ఏపిపిఎస్‌సికి చైర్‌పర్సన్‌ కూడా లేరు. కోచింగ్‌లు తీసుకున్న యూత్‌
అయోమయంలో ఉన్నారు. వెంటనే రిక్రూట్‌మెంట్‌ ప్రారంభించి ఉద్యోగాలు
కల్పించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేసింది.  మెడికల్‌ కాలేజీలను పిపిపి
పేరుతో ప్రయివేటుపరం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని
ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది.
        రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఆచూకి కనపడని ఆడపిల్లల సంఖ్య పెరుగుతున్నది. గత ప్రభుత్వానికి భిన్నమైన
పాలన అందిస్తామన్న కూటమి వాగ్దానాలు అమలులోకి రాలేదు. అవినీతి విచ్చలవిడిగా
సాగుతున్నది. ఇసుక, మద్యం మాఫియాలు చెలరేగిపోతున్నాయి. ఫెడరల్‌ స్ఫూర్తికి
భిన్నంగా  జమిలి ఎన్నికల పేరుతో ప్రజాస్వామ్యం గొంతు నులిమే కేంద్ర
ప్రయత్నాలను తెలుగుదేశం బలపర్చడం గర్హనీయం. వక్ఫ్‌ ఆస్తులపై పెత్తనం కోసం
కేంద్రం తెచ్చిన చట్ట సవరణలను కూడా తెలుగుదేశం బలపర్చింది. కేంద్ర ప్రభుత్వ
రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం
మద్దతునివ్వడాన్ని ఖండిస్తున్నాము.
        విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమంటూనే ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో నడుస్తున్న
రెండేళ్ళలో 20 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని సిపిఐ(యం)
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ట్రూఅప్‌ ఛార్జీల పద్దతిని రద్దు చేయాలని
డిమాండ్‌ చేస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో మోపబడిన ఈ ట్రూఅప్‌ చార్జీలను
ఉపసంహరించుకుంటూ రెగ్యులేటరీ కమిషన్‌కు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని
డిమాండ్‌ చేస్తున్నాము. దీనికి వ్యతిరేకంగా ఈనెల 18వ తేదీన అన్ని విద్యుత్‌
కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ
పిలుపునిచ్చింది.
        విశాఖ ఉక్కు పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వ నాన్పుడు వైఖరి
రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. తక్షణం కార్మిక సంఘాలను పిలిచి
చర్చించి కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర
ప్రభుత్వాన్ని కోరింది.
        రాష్ట్రంలో వరద సహాయం పట్ల సిపిఐ(యం) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికీ
పెద్ద సంఖ్యలో వరద బాధితులకు సహాయం అందలేదు. అందింది కూడా అరకొర మాత్రమే.
ఎన్యుమరేషన్‌లో అవకతవకలు జరిగాయి. కౌలురైతులకు తీరని అన్యాయం జరిగింది.
వెంటనే సమగ్ర సర్వే చేసి అందరికీ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని
సిపిఐ(యం) డిమాండ్‌ చేసింది. కేంద్రం నుండి ఇంత వరకు ఎలాంటి సహాయం
అందకపోవడం దుర్మార్గం. చేయని కేంద్ర సహాయాన్ని భూతద్దంలో చూపెట్టి
ముఖ్యమంత్రిగారు మభ్యపెట్టడం అన్యాయం. రాష్ట్రం పట్ల కేంద్ర వివక్షతాపూరిత
వైఖరిని ఖండిరచాలని ప్రజలకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేసింది.

(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org