కేంద్ర వక్ఫ్‌ చట్టానికి ప్రతిపాదించిన రాజ్యాంగ వ్యతిరేక సవరణలను తిరస్కరించాలని, వక్ఫ్‌ ఆస్తులను రక్షించాలని కోరుతూ

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 13 అక్టోబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,                                                         
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

విషయం:  కేంద్ర వక్ఫ్‌ చట్టానికి ప్రతిపాదించిన రాజ్యాంగ వ్యతిరేక సవరణలను
తిరస్కరించాలని, వక్ఫ్‌ ఆస్తులను రక్షించాలని కోరుతూ...
అయ్యా,
        భారతదేశంలో మైనారిటీ తరగతుల ప్రజలు తమ విశ్వాసాలను, భాషా, లిపి,
సంస్కృతిని కాపాడుకునేందుకు భారత రాజ్యాంగం ప్రత్యేకంగా రాయితీలను
కల్పించింది. ముస్లిం ప్రజల్లో ధనవంతులు, సంపన్నులు తమ సంపదలో కొంత
భాగాన్ని వక్ఫ్‌ పేరిట అంకితం చేసి ఈ ఆస్తుల ద్వారా ధార్మిక,
విద్యాభివృద్ధి తదితర ప్రయోజనాలను ముస్లింలకు అందించడానికి స్వాతంత్య్రం
కంటే పూర్వం నుండి ఈ ఆస్తులను వక్ఫ్‌ చేయడం జరుగుతున్నది. వక్ఫ్‌గా నమోదు
కాబడిన ఈ ఆస్తుల అభివృద్ధి నిర్వహణ కొరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం
ప్రజల భాగస్వామ్యంతో వక్ఫ్‌ బోర్డును ఏర్పాటు చేసి నిర్వహించడమనేది
చట్టపరంగా ఇంత వరకు జరుగుతూ వచ్చింది.
        బ్రిటిష్‌ హయాంలో కూడా వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ ప్రత్యేకంగా ముస్లిం
పెద్దలచేత చేయబడిరది. స్వాతంత్య్రానంతరం 1954లో ఒక సమగ్రమైన చట్టాన్ని
(వక్ఫ్‌ యాక్టు) రూపొందించారు. దాని స్థానంలో  1995లో వక్ఫ్‌ ఆస్తులకు
మరింత రక్షణ కల్పించడం లక్ష్యంగా మరో చట్టం చేశారు. ఈ చట్టానికి 119
సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో
బిల్లును ప్రవేశపెట్టింది. ఈ సవరణలలో అత్యధికం వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు
కాకుండా వాటి భక్షణకు ఉపయోగపడేలా ఉన్నాయి. వక్ఫ్‌ ఆస్తుల స్వభావాన్ని
పూర్తిగా మార్చివేయడం, వక్ఫ్‌ బోర్డు నిర్వహణను ప్రభుత్వం తమ గుప్పెట్లో
పెట్టుకోవడానికే ఈ సవరణలు చేయబడ్డాయనే ఆందోళన ముస్లిం మైనారిటీలలో
ఏర్పడిరది. ప్రతిపక్షాల ఒత్తిడి ఫలితంగా ఈ బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ
కమిటీకి రెఫర్‌ చేశారు. వివిధ తరగతుల ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆ తరువాత
తుది నిర్ణయం తీసుకుంటామని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ తరపున ప్రకటన
వచ్చింది. అయితే 28.09.2024వ తేదీన హైదరాబాద్‌లో జాయింట్‌ పార్లమెంటరీ
కమిటీ ప్రజాభిప్రాయ సేకరణను గమనిస్తే తూతూమంత్రంగా అభ్యంతరాలను స్వీకరించి
సవరణలన్నింటినీ బలపర్చేలా తీర్మానించాలని జెపిసిలోని అధ్యక్షులు మరియు
మెజారిటీ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. నవంబర్‌లో జరిగే పార్లమెంటు
సమావేశంలో ఈ బిల్లును ఆమోదించాలని భావిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
        ఈ సవరణల ద్వారా వక్ఫ్‌ బై యూజర్‌ అన్న భావనను తొలగిస్తూ రిజిష్టర్‌
కాబడిన ఆస్తులను మాత్రమే వక్ఫ్‌ ఆస్తులుగా పరిగణిస్తామని
ప్రతిపాదిస్తున్నారు. దీనవల్ల అనుభవం ద్వారా అనేక తరాలుగా ముస్లింలవిగా
పరిగణింపబడుతున్న ఖబరస్తాన్‌లు, మసీదులు, దర్గాలు అన్నీ ఇప్పుడు వివాదంలోకి
వస్తాయి. అనేక తరాల ఈ ఆస్తులకు డాక్యుమెంట్లు ఎవరి వద్ద ఉండవు. దీనిని
ఉపయోగించుకుని హిందూత్వ మతోన్మాద శక్తులు వివాదాలు సృష్టించేందుకు ఈ బిల్లు
ఉపయోగపడుతుంది. ఒక్క బాబ్రీ మసీదు వివాదంతోనే దేశం తీవ్రంగా నష్టపోయింది.
ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో వందల బాబ్రీ మసీదు లాంటి వివాదాలు సృష్టించడానికి
ఈ సవరణలు ఉపయోగపడతాయి. మత విద్వేశాలు పెంచడం, ప్రజల్ని విభజించడం లక్ష్యంగా
ఈ సవరణలున్నాయని మేం భావిస్తున్నాము.
        ప్రస్తుత ప్రతిపాదిత సవరణలు వక్ఫ్‌ సంస్థలు చేస్తున్న సామాజిక
కార్యక్రమాలన్నింటిపై ఆంక్షలు విధిస్తాయి.   ఈ సవరణలు అమలులోకి వస్తే అనేక
వందల సంవత్సరాలుగా ఉన్న వక్ఫ్‌ ఆస్తులు కూడా మరలా ప్రభుత్వం పరిశీలనకు
వస్తాయి. ఈ ఆస్తులకు సంబంధించిన ఏ వివాదమైనా కలెక్టర్‌ నిర్ణయమే తుది
నిర్ణయంగా ప్రతిపాదిత సవరణలు చెబుతున్నాయి. వక్ఫ్‌ సర్వే కమీషనర్‌
వ్యవస్థను, వక్ఫ్‌ ట్రిబ్యునల్స్‌ను అధిగమించే అధికారం కలెక్టర్లకు
ఇవ్వబడుతున్నది. న్యాయస్థానం ద్వారానే వివాదాలు పరిష్కారం కావాలి. అయితే
ప్రస్తుత సవరణలు ఆస్తులను కొల్లగొట్టడానికే తోడ్పడతాయి.
        వక్ఫ్‌ బోర్డుల ఏర్పాటులో, నిర్వహణలో కూడా రాజకీయ జోక్యానికి పూర్తిగా
అవకాశం కల్పించి వక్ఫ్‌ బోర్డులలో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండాలని,
అధికారులను కూడా ముస్లిమేతరులను  నియమించేలా సవరణ చేయబోతున్నారు. ఈ సవరణలు
వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణకు ఆటంకం కల్గించే పద్దతిలో ఉన్నాయి. దేశవ్యాపితంగా
ముస్లిం ప్రజానీకం, సంస్థలు, లౌకికవాదులు, ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నారు.
        కావున ఒక సెక్యులర్‌ పార్టీ నాయకుడిగా మీరు ఒక మతానికి చెందిన ప్రజలకు
వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా తలపెట్టిన ఈ సవరణలను నిరాకరించవలసిందిగా
కోరుతున్నాను. ఈ బిల్లును ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి చేయవలసిందిగా
కోరుతున్నాను. ఆందోళనతో ఉన్న ముస్లిం ప్రజానీకానికి మీ చర్య ఎంతో
ఉపశమనాన్ని కల్గిస్తుందని అందుకు పూనుకోవాలని కోరుతున్నాను.
అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org