ధరల పెరుగుదలపై తీర్మానం

సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం నిన్న, ఈరోజు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరిగాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, ఎం.ఎ.బేబి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము.

- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

11 అక్టోబరు, 2024.

 

:: తీర్మానం ::

పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల భారాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలి. ప్రజాపంపిణీ ద్వారా 16 రకాల సరకులు అందించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేస్తున్నది.

ఈ కాలంలో అతివృష్టి, అనావృష్టి మరియు ప్రభుత్వం సకాలంలో సరైన చర్యలు చేపట్టకపోవటం వల్ల నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజల జీవన విధానంపై భారీ ప్రభావం పడిరది. ఒకపక్క నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక ఉపాధి అవకాశాలు తగ్గడం వీటన్నిటి కారణంగా ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోయింది. ఈ నేపధ్యంలో ధరల ప్రభావం ప్రజలను కోలుకోలేని దెబ్బతీసింది.

రాష్ట్రంలో ఆహార ధాన్యాలు  సమృద్దిగా ఉన్నప్పటికీ బియ్యం ధరలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేనంతగా కిలో రూ.80/` లు దాటాయి. గత ఏడాదితో పోల్చితే  సుమారు 40% పెరిగాయి. కందిపప్పు 100% పెరిగింది. రూ.95/` నుండి రూ.180/` లకు పెరిగింది. సాధారణ పేదలు ఉపయోగించే పామాయిల్‌ ధరలు, వంటనూనెలు 30%, 40% వరకు పెరిగాయి. టమోట రూ.80/`లు దాటింది. ఉల్లిపాయాలు రూ.60/` దాటింది. చివరకు ఆకు కూరలు ధరలు కూడా 10 నుండి 20లకు పెరిగాయి. పేద ప్రజల ఆదాయం మొత్తం ఆహార ధాన్యాలకే ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటి పర్యవసానంగా భారం పేద ప్రజల విద్య, వైద్యంపై కూడా పడుతుంది.

గత ఎన్నికల ముందు బిజెపి ప్రభుత్వం ధరలు అదుపు చేస్తామని, ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని ఇచ్చిన హామికి విరుద్ధంగా గత బడ్జెట్‌లో ఆహార భద్రతకు భారీగా నిధులు తగ్గించింది. ఈ కారణంగా ఎఫ్‌సిఐ (ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పాత్రను తగ్గించింది. ఒకపక్క గోదాముల్లో ధాన్యం ముక్కిపోతున్నా పేదలకివ్వడానికి బిజెపి ప్రభుత్వం అంగీకరించడం లేదు. పేదలెవ్వరూ ఆకలితో నిద్ర పోకూడదు అన్న సుప్రీం కోర్టు తీర్పును కూడా ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయడం లేదు. బహిరంగ మార్కెట్‌ను ప్రైవేటు వ్యక్తులకు స్వేచ్ఛ నివ్వడం వల్ల కృత్రిమ కొరతను సృష్టించి భారీగా ధరల పెంపుకు పరోక్షంగానే కేంద్ర ప్రభుత్వం కారణం అవుతుంది. ఒక పక్క బహిరంగ మార్కెట్‌ను కార్పొరేట్‌లకు కట్టబెడుతూ ప్రజలను నమ్మించడానికి ఈ ఏడాది చివరి వరకూ ఉచితంగా బియ్యం అందిస్తామని కపట నాటకం ఆడుతోంది. దీనిని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడి బియ్యం ఆపేసి, కేవలం రేషన్‌ కార్డుకు 20 కిలోలు ఇస్తున్నారు. ఇందులో కూడా బియ్యం మినహా పప్పు, నూనె, పంచదార మొ॥ ఇవ్వడం లేదు. అదే కేరళ రాష్ట్రంలో నేటికీ ప్రజాపంపిణీ ద్వారా ఆహార ధాన్యాలు అందించడంలో దేశంలోనే ఆదర్శంగా ఉంది.

గతంలో ధరలను అదుపు చేయడానికి బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ధరల స్ధీరీకరణ నిధిని ఏర్పాటు చేసేది. నేడు తెలుగుదేశం ప్రభుత్వం అటువంటి కృషి చేయడంలేదు. ప్రజాపంపిణీ  ద్వారా కందిపప్పు, నూనె, పంచదార, తృణధాన్యాలు ఇవ్వడం ఆపేసింది.

ఈ నేపద్యంలో దారిద్య్రం, నిరుద్యోగం, పేదరికం నేటికీ 70% ఉన్న మనలాంటి దేశంలో ఆహార ధాన్యాలు ఉచితంగా అందించడం ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలి. ధరలస్థీరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలి. ప్రజాపంపిణీ ద్వారా అన్ని రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) డిమాండ్‌ చేస్తుంది.

====