
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 అక్టోబర్, 2024.
కేంద్ర సహాయంపై సిపిఐ(ఎం) అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిధులిచ్చి తోడ్పడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒట్టి మాటలతో కాలక్షేపం చేయడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ ఆసంతృప్తి వ్యక్తం చేసింది. నిన్న ఢల్లీిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రధానిని కలిసిన సందర్భంలో ఆయన స్పందన పట్ల హర్షం వ్యక్తం చేయటం, అభినందించటం వాస్తవానికి విరుద్ధంగా ఉంది.
పోలవరం నిర్మాణానికి నెల రోజుల క్రితమే 500 కోట్లు ఒకసారి 2500 కోట్లు మరోసారి ఇచ్చినట్లు ప్రకటించిన కేంద్రం ఇప్పుడు 2800 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పటం లెక్కల గారడి మాత్రమే. నిజానికి వచ్చింది ఒక్కసారే. అది కూడా దేనికి ఎంత వచ్చిందో ఇంతవరకు స్పష్టం చేయలేదు. నిర్వాసితులకు పరిహారం గురించి ప్రస్తావన లేకపోవడం దారుణం.
రైల్వే జోన్ పై యిప్పటికీ పలుసార్లు ప్రారంభిస్తున్నట్లు కేంద్రం చెప్పినా ఇంతవరకు అమలు జరగలేదు. ఇప్పుడు మరలా డిసెంబర్ అని చెప్పటం మభ్యపెట్టటానికే.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ప్రధాని నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి హామీ పొందకపోవడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పోరాటం చేయటం మినహా రాష్ట్ర ప్రజల ముందు మరో మార్గం లేని పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కుపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి పట్టుబట్టి పెట్టుబడి, స్వంత గనులు సాధించాలని కోరుతున్నాను.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి