
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 అక్టోబర్, 2024.
గుళ్ళపల్లి జోత్స్న మృతికి సంతాపం
మహిళా, సామాజిక సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న శ్రీమతి గుళ్ళపల్లి జోత్స్న గారు ఈరోజు తెల్లవారుజామున రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నది. జోత్స్న భర్త ఎపి బార్‌కౌన్సిల్ సభ్యులు, ఆలిండియా లాయర్స్ యూనియన్ అఖిలభారత వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు అదే బస్సులో ఉండి గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఇదే ప్రమాదంలో మరో 10 మంది గాయపడ్డారు. వారందరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము.
జోత్స్నగారు విద్యార్థి దశ నుండి చురుగ్గా ఉద్యమాల్లో పనిచేశారు. మహిళా సంఘంలో విజయవాడ నగరంలో అనేకం సంవత్సరాలకు పైగా పనిచేశారు. అప్పుడు జరిగిన సారా ఉద్యమం, మహిళలపై వేదింపులకు వ్యతిరేకంగా మహిళలను సమీకరించడంలో కృషి చేశారు. మహిళా న్యాయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళలెదుర్కొంటున్న న్యాయమైన సమస్యలకు సహకారం అందించేవారు. అనంతరం అమరావతి బాలోత్సవం ప్రారంభం నుండి ఇప్పటి వరకు పిల్లల పండుగ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తరుణీతరంగాలు ద్వారా మహిళా ఫెస్ట్‌ల నిర్వహణలో ఆ తరువాత సేఫ్ (స్టెప్ ఎ హెడ్ ఫర్ ఈక్వాలిటీ) సంస్థ ఏర్పాటు చేసి మహిళలు ఎదుర్కొంటున్న లింగ సమానత్వం కోసం అనేక కాలేజీల్లో విద్యార్థులను చైతన్యపర్చడంలో ముందున్నారు. యం.బి.విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన దసరా సాంస్కృతిక ఉత్సవాల్లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశ నుండి నేటి వరకు నిరంతరం సమాజ సమస్యల పట్ల స్పందించడం ఆయా తరగతులను సమీకరించడంలో కీలకపాత్ర పోషిస్తున్న జోత్స్న మృతి తీరని లోటు. ఆమె మృతిపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపాన్ని తెలియజేస్తున్నది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి