
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి నిన్న వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 28 సెప్టెంబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలనీ, సంస్థలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ...
అయ్యా,
జాతీయ స్ఫూర్తితో స్వదేశీ విద్యకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలనే ఆశయంతో స్వాతంత్య్ర సమరయోధులు కొంత మంది ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ మరియు అనుబంధ విద్యా సంస్థలు స్థాపించారు. దీనికి 365 ఎకరాల విలువైన భూమి, భవనాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఈ విద్యా సంస్థలు అక్రమాలు, అవినీతిమయమయ్యాయని, వీటికి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్‌గా కొనసాగుతున్న శ్రీ కోపల్లె హనుమంతరావు కేంద్ర బిందువుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇతను పోలీసు శాఖలో పనిచేస్తూ ఈ విద్యా సంస్థలకు వారసునిగా కూడా చలామణి అవుతున్నారు. సంస్థ వ్యవస్థాపకులు రూపొందించిన మెమోరాండం ఆఫ్ ఆర్టికల్స్‌లో వ్యవస్థాపక సభ్యుల కుటుంబ సభ్యులకు వారసత్వ హక్కులుండవని పేర్కొన్నప్పటికీ అక్రమంగా కొనసాగుతున్నారని తెలుస్తున్నది. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ఎ.జె. కళాశాలలో టీచింగ్ స్టాఫ్ నియామకంలో రోస్టర్ పాయింట్లు నిర్ణయించకపోవడంపై విజిలెన్స్ దర్యాప్తు జరిగింది. ఇంత వరకు రిపోర్టు వెలువడలేదు. ఎయిడెడ్ బిఈడిని అన్‌ఎయిడెడ్ బిఈడిగా మార్చారు. యుజిసి వారికి తెలియజేయకపోవడంతో వచ్చిన గ్రాంటును నిబంధనలకు విరుద్దంగా ఖర్చు చేశారు. స్టాఫ్‌కు ఇచ్చే జీతాలు ఇష్టానుసారంగా తగ్గించివేశారు. ఇంకా అనేక ఆరోపణలు వస్తున్నాయి.
పై అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఈ విద్యా సంస్థలను స్వాధీనం చేసుకొని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టి కృష్ణా జిల్లాలోని పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించడానికి కృషి చేయగలరని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org