
(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు (25 సెప్టెంబర్) విలేకర్ల సమావేశం విజయవాడ (బాలోత్సవ భవన్)లో జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
మతం పేరుతో వైషమ్యాలు రెచ్చగొట్టొద్దు
సామరస్యాన్ని కాపాడేందుకు ఫ్రభుత్వం చొరవ తీసుకోవాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
సిట్‌ను స్వాగతిస్తున్నాం, నిజాలు తేల్చాలి
మత ఘర్షణల్లో బిజెపికి తోడ్పడిన ఏ పార్టీ బతకలేదు
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో కొంతమంది ప్రజల మధ్య మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారిని అడ్డుకుని సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. బుధవారం విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డూల కల్తీ విషయంలో, పాత వివాదాలు, అంశాల నేపథ్యంలో అక్రమాలను వెలికితీసేందుకు సిట్‌ను నియమించడాన్ని రాష్ట్ర కమిటీ తరుపున ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలో కొనుగోళ్లు, యాత్రికులకు పాసులు జారీ చేయడం, ఉద్యోగాలు ఇవ్వడం వంటి అంశాలలో అవినీతి పాతుకుపోయి ఉందని పేర్కొన్నారు. సిట్ నిష్పక్షపాతంగా వ్యవహరించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. భక్తులు కోరుకుంటున్నట్లుగా తిరుమలలో సామరస్య వాతావరణం వచ్చేట్లుగా చర్యలకు సిఫారసు చేయాలని కోరారు. సిట్‌లో ఎవరుండాలి, అనే అంశం జోలికి తాము వెళ్లడం లేదని, నియమించిన అధికారి నిజాయితీగా విచారణ చేసి నిజాలు బయటపెట్టాలని కోరారు. తిరుమలలో అవినీతి నిర్మూలనపై చర్చ కాకుండా కొందరు మతం పేరుతో కలుషితమైన వాతావరణం సృష్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ అవినీతి నిర్మూలనకు, భక్తులకు విశ్వాసం కలిగించేలా కాకుండా వివిధ మతాల మధ్య వైషమ్యాలు, ఉద్రిక్తతలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది సమ్మతం కాదని పేర్కొన్నారు. మతాల మధ్య అపోహలు సృష్టించేలా అధికారంలో ఉన్నవారే మాట్లాడితే అది ఆర్‌ఎస్‌ఎస్, సంఫ్‌ుపరివార్ వంటి మతోన్మాద శక్తులు విస్తరించడానికి తప్ప దేనికీ ఉపయోగపడదని అన్నారు. రాష్ట్రంలో లౌకికవ్యవస్థను, విధానాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అయితే లడ్డూ విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు తీసుకున్న వైఖరి బిజెపి, లాంటి శక్తులు లౌకిక విధానాలను కలుషితం చేసేందుకు తోడ్పడేదిగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రాల అనుభవం తీసుకున్నా మత ఘర్షణల విషయంలో బిజెపికి తోడ్పడిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా లాభపడలేదని వివరించారు. ప్రాంతీయ పార్టీల తోడ్పాటు బిజెపికి అనుకూలంగా రాజకీయాలను మార్చాయని తెలిపారు. మహరాష్ట్రలో శివసేన, తమిళనాడులో అన్నాడిఎంకె అనుభవాలు కళ్లకు కబనడుతున్నాయని, లౌకికి పార్టీగా ఉన్న తెలుగుదేశం బిజెపి మాయలోపడి మతం పేరుతో ఉద్రిక్తతలు సృష్టించడానికి తోడ్పడడం ఆత్మహత్యాసదృశ్యం అవుతుందని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి వాస్తవాలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించకుండా ప్రధానికే విన్నపాలు చేయడం పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా అవుతుందన్నారు. యూనియన్ హెల్త్ మినిస్ట్రీతోపాటు కొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు విచారణ చేస్తామంటూ పోటీలుపడి రంగంలోకి దిగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో రాజకీయంగా బలపడాలని బిజెపి శక్తులు ప్రయత్నిస్తుంటే దానికి టిడిపి, జనసేన, వైసిపి తీసుకుంటున్న వైఖరులు తోడ్పడుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం, ఆయా పార్టీలు రాష్ట్రంలో లౌకిక రాజ్యాంగాన్ని రక్షించేలా, మతసామరస్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫెడరల్ వ్యవస్థ మన దేశానికి ఆయువుపట్టని, అన్నింటిపైనా కేంద్రానికి పెత్తనం వదిలిపెట్టడమంటే ఫెడరల్ వ్యవస్థకు గొడ్డలిపెట్టని అన్నారు. ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటే ఏ ప్రాంతీయ పార్టీకీ మనుగడ ఉండదని అన్నారు. మత వైషమ్యాలకు ఆస్కారం ఇవ్వకుండా వెంటనే తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని సమగ్ర రీతిలో విచారణ చేయాలని కోరారు.
అధికారులెవరినీ సర్టిఫై చేయలేం
అధికారంలో ఉన్నటువంటి ఐఎఎస్, ఐపిఎస్‌లు అటూ ఇటూ చీలిపోయి ఆయా పార్టీలకు కొమ్ముకాస్తున్న నేపథ్యంలో అధికారులు ఇచ్చే నివేదిక వాస్తవాల ఆధారంగా ఇచ్చారా లేదా అనేది ఆ నివేదిక చూసిన తరువాతనే చెప్పగలమని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ముందే ఎవరినీ సర్టిఫై చేయలేమని అన్నారు. సిపిఎం వ్యక్తులకు సర్టిఫికెట్ ఇవ్వదలచుకోవడం లేదని, సిట్‌కు విచారణ పూర్తయి నివేదిక వచ్చేంతవరకు అన్ని పార్టీలూ సంయమనం పాటించి విచారణకు తోడ్పడాలని కోరారు. ఉద్రిక్తతలు పెంచేలా మాట్లాడడం తగదని హెచ్చరించారు.
= = = =
100 రోజుల్లో కేంద్రం రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
అమరావతికి అప్పుకిందే రూ.15 వేల కోట్లు
ఉక్కుఫ్యాక్టరీని కాపాడేందుకు రూట్‌మ్యాప్ ప్రకటించాలి
ఎమ్మెల్యేలు మారారు తప్ప ఇసుక ధర మారలా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నేటి రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష చేసినట్లు పేర్కొన్నారు. అమరావతికి సహాయం చేస్తున్నట్లుగా బడ్జెట్‌లో గొప్పలు చెప్పిన కేంద్రం ఇప్పుడు ప్రపంచ బ్యాంకును పంపించి అప్పు తీసుకోమంటున్నారని, మధ్యవర్తులుగా ఉండి అప్పు ఇప్పిస్తామంటున్నారని తెలిపారు. ఆ అప్పు తీర్చే బాధ్యత రాష్రానిదే అంటున్నారని వివరించారు. ఈ భారం ప్రజలపైనే పడుతుందని చెప్పారు. ఇందులో కేంద్రం చేస్తున్న సహాయం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రజలపై భారం పడకుండా కేంద్రమే సహాయం చేయాలని ఆయన కోరారు. టిడిపి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రమే బాధ్యత తీసుకుని అప్పు కూడా వారే తిరిగి చెల్లించేలా ఒప్పించాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించినా దానికి సంబంధించి ఎటువంటి కదలికాలేదని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పైసా కేటాయించలేదని, ఒక కమిషన్‌గానీ, పర్యటన గానీ, నివేదికగానీ లేదని విమర్శించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టడం తప్ప చర్యలు లేవని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా కేంద్రం మోసపూరిత వైఖరిని అవలంబిస్తోందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుఆనయుడు ప్రకటించారని, దానికి అనుగుణంగా రూట్ మాప్ రూపొందించాలని డిమాండు చేశారు. దానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వారు నిరంతరం ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడేందుకు పనిచేయాలని డిమాండు చేశారు. అలా చేయకుండా రాష్ట్రప్రభుత్వమూ కేంద్రానికి తాళం వేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. నేను మారాను అని చంద్రబాబుగారు, మేము మార్చి చూపిస్తాం అని మంత్రులందరూ చెబుతున్నా ఆచరణలో ప్రజలకు ఆశించినంతగా కనబడడం లేదని అన్నారు. ఉచిత ఇసుక ఇస్తామన్నా రకరకాల పేర్లతో గత ప్రభుత్వ హయాం కన్నా ధర పెరిగిందని పేర్కొన్నారు. అక్కడక్కడా స్థానిక ఎమ్మెల్యేలు, వారి అనుచరుల ఆధిపత్య పోరు పెరిగిపోతోందన్నారు. మద్యం మీద దందా, ట్రాన్స్‌ఫర్లకోసం, అధికారుల అపాయింట్‌మెంట్లకోసం ముడుపులు వంటి విషయాల్లో ఏమీ మార్పులేదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మార్పు చూపాలంటే అవినీతిని నిరోధించాలని తెలిపారు. సూపర్‌సిక్స్ అమలుకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, పెన్షన్ తప్ప ఇతర వాగ్ధానాలు ఏమీ అమలు కాలేదని, వాటిని అమలు చేయాలని కోరారు. ఇసుక ధరల వల్ల ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా అవస్థపడుతున్నారు. వారి ఉపాధి దెబ్బతింటోందని చెప్పారు. గతంలోలాగా కంపెనీ ఆధిపత్యం లేకుండా ఉచిత ఇసుక అందించాలని కోరుతూ అక్టోబరు 4న సిపిఎం రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఆందోళనలను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు.
వరద సాయం సరిపడినంతగా లేదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం సరిపడినంతగా లేదని, ప్రకటించిన సహాయం కూడా సక్రమంగా అందడం లేదని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం ఇస్తామని ప్రకటించినా జీవో ఇవ్వలేదని తెలిపారు. దీంతో అధికారులు జిఓ ఉంటేనే అమలు చేస్తామని కౌలు రైతులను నమోదు చేయడం లేదని పేర్కొన్నారు. యజమానులకే ఇస్తున్నారని అన్నారు. కౌలు రైతులకు వరద సహాయం అందేలా స్పష్టమైన మార్గదర్శకాలిచ్చి అమలు చేయాలని రాష్టప్రభుత్వాన్ని కోరారు.
సేవలందించిన సిపిఎం, ప్రజా సంఘాల కార్యకర్తలు
వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పడవలు ఇవ్వకపోయినా నీళ్లలో చివరి మూలకు కూడా వెళ్లి పార్టీ వాలంటీర్లు సహాయం అందించారని తెలిపారు. పార్టీ నిర్వహించిన భోజనశాలకు మంచి పేరు వచ్చిందని, అధికారులు సైతం వాటిల్లోనే భోజనాలు చేశారని తెలిపారు. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న యువత, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలను అభినందించారు. విజయవాడ వన్ టౌన్‌లో సహాయం నిస్పక్షపాతంగా అందించడం లేదని ప్రజలు నిరసన వ్యక్తం చేశారని, ప్రభుత్వం అటువంటివి జరుగకుండా చూసుకోవాలని తెలిపారు. పేదవారికి అడ్రస్ మ్యాప్ ఉండదని, టెక్నాలజీపైనే పూర్తిగా ఆధారపడకుండా నేరుగా వరద ప్రాంతాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ఎక్కడెక్కడ పేదవారు ఉన్నారో వారికి వరద సాయం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతే తప్ప టెక్నాలజీపైనే పూర్తిగా ఆధారపడతామనడం సమంజసం కాదని సూచించారు.
= = =