విలేకర్ల సమావేశం - 25 సెప్టెంబర్‌, 2024

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విలేకర్ల సమావేశం - 25 సెప్టెంబర్‌, 2024 - విజయవాడ (బాలోత్సవ భవనం)

సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈనెల 23,24 తేదీల్లో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.విరాఘవులు పాల్గొని జాతీయ, అంతర్జాతీయ  పరిణామాలు వివరించారు. రాష్ట్రంలో పరిణామాలపై ఎం.ఎ గఫూర్‌ ప్రవేశ పెట్టిన నివేదికను రాష్ట్ర కమిటి ఆమోదించింది.

తిరుపతి లడ్డుల తయారీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ నియమించడానికి ఆహ్వానిస్తున్నాం. తిరుపతి తిరుమల దేవస్థానంలో అనేక సంవత్సరాలుగా ఉన్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలన్నీటిని వెలికి తీసి వాటిని నిరోధించేందుకు సూచనలు చేయాలని కోరుతున్నాము. సిట్‌ నివేదిక వచ్చేంతవరకు అన్ని రాజకీయ పార్టీలు సమయమనం పాటించాలి. తదనంతరం తీసుకునే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుచున్నాము. కానీ ఈసమస్యను ఆసరా చేసుకుని ఇప్పటికే వాతావరణన్ని కొన్ని శక్తులు కలుషితం చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే దీనికి మతం రంగు పులిమి సామాజిక వాతావరణాన్ని అపవిత్రం చేస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ గారు తీసుకున్న వైఖరి ఇలాంటి శక్తులకు ఊతమిచ్చేదిగా ఉంది. ఇతర మతాలపై వివిధ రకాల వ్యాఖ్యలు చేయటం రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఏర్పడటానికి, మతసామరశ్యం దెబ్బ తినడానికి తోడ్పడుతుంది. ప్రభుత్వ ఉన్నత స్థానంలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ వైఖరి ప్రజల మధ్య ఐక్యత, సామరస్యం కాపాడే విధంగా ఉండాలి. దానికి భిన్నంగా ఆయన చేసే వ్యాఖ్యలు నష్టంచేస్తాయి. లౌకిక పార్టీగా ఉన్న తెలుగుదేశం వైఖరి ఆత్మహత్యాసదృశ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్న పార్టీలు పోటీలు పడి మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించటాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడటానికి బదులుగా మోడీకి విన్నపాలు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమే. ఈ పార్టీల వైఖరి రాష్ట్రంలో మతోన్మాదులు బలపడడానికి తోడ్పడుతుంది.

కేంద్రంలో మోడీ వంద రోజులు పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పై భరోసా లేదు. రాజధానికి నేరుగా నిధులివ్వకుండా అప్పు చేయించడం ప్రజలపై అదనపు భారం వేయడమే. వెనుకబడిన ప్రాంతాలకు పైసా విదల్చలేదు. పైగా ధరలు విపరీతంగా పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ప్రజలకు సంబంధించినంత వరకు పెద్దగా మార్పు కనిపించడం లేదు. గత ప్రభుత్వం బాటలోనే పరిపాలన యధావిధిగా సాగుతున్నది. అవినీతి ఆగలేదు. ట్రాన్స్‌ఫర్లు, పోస్టులకు భారీ ముడుపులు చేతులు మారుతున్నాయి. ఇసుక, మద్యం దందా కొనసాగుతున్నాయి. పోలీసు వైఖరిలోనూ మార్పు లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా ఇప్పటికైనా వాటిని నెరవేర్చి ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి తగిన విధంగా సానుకూలమైన మార్పులు చేసి చూపెట్టాలని కోరుతున్నాము. రాష్ట్రంలో లౌకిక విధానాలు పటిష్టం చేయడానికి, ఫెడరల్‌ హక్కులు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

కౌలు రైతులకే పరిహారం

వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి, ప్రత్యేకించి కౌలు రైతులకే పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ(యం) కోరుతున్నది. 

యువజన, విద్యార్ధి వలంటీర్లకు అభినందనలు

విజయవాడ, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లా వరదల్లో ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి నిలువులోతు నీళ్లలో సైతం దిగి వందలాది మంది వలంటీర్లు సహకారం అందించారు. పార్టీ భోజన శాలలు ఏర్పాటు చేసింది. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలు, వలంటీర్లందరినీ సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభినందించింది.

ఇసుకపై అక్టోబర్‌ 4న అందోళన

ఉచిత ఇసుక వాగ్ధానాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 4న రాష్ట్ర వ్యాపిత ఆందోళనలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది.

= = = =