దిన దిన గండంగా వున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి పై తక్షణమే దృష్టి కేంద్రీకరించాలని కోరుతూ...

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 29 ఆగష్టు, 2024.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

 

విషయం: దిన దిన గండంగా వున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి పై తక్షణమే దృష్టి కేంద్రీకరించాలని కోరుతూ...

 

అయ్యా, 

రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌. ఈ స్టీల్‌ ప్లాంట్‌ పై ఆధారపడి ప్రత్యక్షంగా ముప్ఫైవేల మంది పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోరాట ఫలితంగా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. కేంద్ర ఫ్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి సామర్థ్యంతో పనిచేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. 

ముడి సరుకు, వర్కింగ్‌ క్యాపిటల్‌ లేక విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తుతం కేవలం 45 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నది. రోజుకు 21 వేల టన్నుల ఉత్పత్తి జరగవలసి ఉండగా ప్రస్తుతం కేవలం రోజుకు 10వేల టన్నులు ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. దీనివలన రోజురోజుకీ నష్టాలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి తగ్గింపు వలన యంత్రాలు దెబ్బతింటున్నాయి. వీటిని పునరుద్ధరించడం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తుత ఎదుర్కొంటున్న సమస్యకు సొంత గనులు లేకపోవడం ఓ కారణమని స్టీల్‌ మంత్రి గౌరవ హెచ్‌ఎ కుమారస్వామి గారు పేర్కొన్న విషయం మీకు విదితమే. కాబట్టి విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ ఇబ్బందులకు ప్రధాన కారణమైనటువంటి సొంత గనులు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి సామర్థ్యంతో నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని కేంద్రం తక్షణమే అందించే విధంగా చర్యలు చేపట్టాలి. ఈలోగా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి సామర్థ్యంతో నిరంతరాయంగా నడిపేందుకు అవసరమైన కోల్‌ మరియు ఐరన్‌ ఓర్ను ప్రభుత్వ సంస్థలైన సెయిల్‌ మరియు ఎన్‌ఎండిసి నుంచి సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలి. సెయిల్‌ విలీనంచేసే చర్యలు వేగవంతం చెయ్యాలి. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నిర్వహణకు అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ అనుమతి ఇచ్చే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో కనీసం 45 రోజులకు సరిపడా ముడి సరుకులు నిల్వ ఉండాలి. దిన దిన గండం లాగా నడుస్తున్నది. ఏ రోజుకు ఆ రోజు ముడి సరుకులు సమకూర్చుకోవాలని పరిస్థితి ఏర్పడుతున్నది. ముడిసరుకు సమకూర్చుకోలేకపోతే ఉత్పత్తి నిలిపివేసే పరిస్థితి వస్తున్నది. కావున రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించి పోలవరం, అమరావతికి ప్రాజెక్టులకు స్టీల్‌ తీసుకోవచ్చు. 

గత ఆరు నెలలుగా ప్లాంటు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. ప్రతి నెల వాయిదాలు పద్ధతిలో జీతాలు చెల్లిస్తున్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు 4 నెలలుగా జీతాలు చెల్లించని పరిస్థితి ఉంది. అంతేకాక నెలలో సగం రోజులు మాత్రమే పని కల్పిస్తామంటూ చెప్పడం అత్యంత బాధాకరం. ఉద్యోగుల జీతాల ద్వారా కట్‌ చేసిన పిఎఫ్‌, ట్రిఫ్ట్‌ డబ్బులను కూడా ఆ ట్రస్ట్‌కు జమ చేయకుండా యాజమాన్యం వాడుకుంటున్నది. గత ఆరు నెలలుగా వారి బకాయిలు 400 కోట్లు పేరుకు పోయాయి. స్టీల్‌ ప్లాంట్‌ లో చనిపోయిన వారి కుటుంబాలకు అందించే డబ్బును సైతం సకాలంలో అందించటం లేదు. ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పరిస్థితులు మరింత దిగజారి పోకముందే మీరు జోక్యం చేసుకొని ఈ పరిస్థితులు అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నాము.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి