
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 ఆగష్టు, 2024.
తెలుగుదేశం, జనసేన, బిజెపి, పార్టీ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించే ప్రక్రియను విరమించుకొని, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి కోరుతున్నది.
ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు మధ్య ఉండాల్సిన విభజన రేఖను చెరిపివేసే విధంగా రాష్ట్రంలోని అధికార కూటమి నాయకులు వ్యవహరించడం తగదు. ప్రజాసమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం, అధికార పదవులు నిర్వహించేవారి బాధ్యత. సమస్యలు పరిష్కరించమని కోరుతూ ఏ రాజకీయ అభిప్రాయాలు లేనివారు, అనేక రాజకీయ అభిప్రాయాలు కలిగిన ప్రజలు అర్జీలు, ఫిర్యాదులు అందజేయడం జరుగుతోంది. ప్రజాసమస్యల నివేదనకు ప్రభుత్వ కార్యాలయాలే తగిన వేదికలు. కనుక ప్రజల అర్జీలు, ఫిర్యాదులను ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయం లేదా నిర్దేశిత ప్రభుత్వ కార్యాలయాలు లేదా వారి క్యాంపు కార్యాలయాల్లో స్వీకరించాలి. అంతే తప్ప పార్టీ కార్యాలయాలను అందుకు కార్యస్ధానంగా ఎంచుకోవడం సబబు కాదు.
ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తరువాత విభేదాలు మరిచి అందరూ సమిష్టిగా అభివృద్దికి తోడ్పడాలని ఉపన్యాసాలు చెప్పే కూటమి నాయకులు అధికారానికి వచ్చాక తమ పార్టీ కార్యాలయాలను ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించడం తగదు. ప్రభుత్వం ప్రజలందరికీ చెందినదిగా వ్యవహరించాలి. అలాగే అధికారంలో ఉన్నవారు ప్రజలందరి బాగోగులు చూడాలి. రాజకీయ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పార్టీతో పాలనను, ఫిర్యాదుల పరిష్కారాన్ని కలగాపులగం చేయడం తగదు.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org