
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 ఆగష్టు, 2024.
విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ నిలిపివేయాలి
రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు, నివాస గృహలకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల
బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ
డిమాండ్ చేస్తున్నది.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాదేశాలకు లొంగి రాష్ట్రంలోని నివాస గృహాలకు
విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు
పెట్టాలని గత వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది. అదానీ మరియు షిరిడి సాయి
తదితర కంపెనీలకు కాంట్రాక్టులను కట్టబెట్టింది. ఇందులో పెద్ద ఎత్తున
అవినీతి చోటు చేసుకున్నది. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా ఈ మీటర్లను
వ్యతిరేకించింది. హైకోర్టులో పిటీషన్లు వేశారు. నేడు తెలుగుదేశం కూటమి
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాలను రద్దు చేయకపోగా
స్మార్ట్ మీటర్ల ప్రక్రియను కొనసాగిస్తున్నది. విజయవాడతో సహా పలు
ప్రాంతాల్లో అదానీ సంస్థకు చెందిన మీటర్లను తెచ్చి విద్యుత్
కార్యాలయాల్లో భద్రపరుస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు, ప్రభుత్వ
కార్యాలయాలలోను మీటర్లు బిగిస్తున్నారు .తదుపరి నివాస గృహాలకు మీటర్లు
బిగించే ప్రక్రియకు సిద్ధమవుతున్నారు.
మొదటి దశలో వ్యవసాయం పంపు సెట్లకు మీటర్ల పేరుతో క్రమంగా ఉచిత
విద్యుత్తుకు ఎసరుపెట్టే ప్రమాదం ఉంది. నివాస గృహాలకు మీటర్లతో ప్రీపెయిడ్
పద్ధతి మరియు విద్యుత్ వాడే సమయాన్నిబట్టి అదనపు చార్జీలు, మీటర్ల ఖర్చును
వినియోగదారులపై వేయటం తదితర రూపాల్లో భారం పడుతుంది. వేలాదికోట్ల రూపాయల
ప్రజాధనం మీటర్ల పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు. తెలుగుదేశం కూటమి
ప్రభుత్వం మాట తప్పి కేంద్ర ప్రభుత్వాదేశాలకు లొంగిపోయింది. గతంలో
వ్యతిరేకించిన మీటర్లనే కొనసాగించడం వాగ్దాన భంగమే అవుతుంది. బడా
కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతోనే కేంద్రం ఈ
స్మార్ట్ మీటర్లను రుద్దుతోంది.
వ్యవసాయ పంపు సెట్లకు, నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని
సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఆదాని, షిర్డీ సాయి తదితర కంపెనీలతో చేసుకున్న
ఒప్పందాలను రద్దు చేయాలని, బిగించిన మీటర్లను తొలగించాలని సిపిఐ(యం)
విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి