భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 23 ఆగష్టు, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: ఫార్మా కంపెనీలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై సమగ్ర విచారణ జరపాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ...
అయ్యా,
అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని ఎషన్సియ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దది. 17 మంది మరణించడం, 36 మంది క్షతగాత్రులుగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. మీరు కూడా పర్యటించి బాధితులను పరామర్శించి, ప్రమాదం జరిగిన కంపెనీలో కూడా పరిశీలించారు.
ఈ ప్రమాదం జరిగిన 24 గం॥ల లోపే పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ ఫార్మా కంపెనీలో మరో ప్రమాదం జరిగింది. పొల్యూషన్ డిపార్డుమెంట్, ఫ్యాక్టరీ ఇన్స్‌స్పెక్టర్లు, ఫైర్ డిపార్డుమెంట్ల స్పందనే కరువయ్యింది. ఉమ్మడి విశాఖలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.
అనకాపల్లి జిల్లాలో పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి మండలాల్లో ఫార్మా పరిశ్రమలు స్పెషల్ ఎకనామిక్ జోన్స్‌లో ఇతర పరిశ్రమలు వున్నాయి. ప్రమాదకరమైన 138 ఫార్మా పరిశ్రమలు వున్నాయి. వీటిలో 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఎస్‌ఇజెడ్‌లలో మరో 20 వేల మంది కార్మికులు వున్నారు. పరిశ్రమల్లో ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్లు సేప్టీ ఆడిట్ రెగ్యులర్‌గా నిర్వహించకపోవడం వలన తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు, ఉద్యోగులు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్ ప్రాధమిక విచారణలో ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని నిర్ధారణ చేశారు.
గత 5 ఏళ్లలో రాష్ట్రంలో సుమారు 119కు పైగా ప్రమాదాలు జరిగి, సుమారు 150 మంది మరణించినట్లు, వందలాది మంది క్షతగాత్రులయినట్లు నిన్న మీరే స్వయంగా ప్రకటించారు. ప్రమాదాల బారిన పడినవారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బ్రాండిక్స్ లాంటి పరిశ్రమలో విషవాయువులు లీకైన ఘటనలో 500 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకుని ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తే యాజమాన్యం ఆప్పీలుకు వెళ్లి కార్మికులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టింది.
గత 80 రోజుల్లో అనకాపల్లి జిల్లాలోనే 4 ప్రమాదాలు జరిగాయి. భారీగా ప్రాణనష్టం జరిగింది. రాష్ట్రంలోనే అనేక ప్రైవేటు పరిశ్రమల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కార్మికుల ప్రాణాలకు కనీసం విలువ లేకుండా పోయింది. జి.వో.నెం. 62 తేది.28`03`2019 వలన ఎస్‌ఇజెడ్‌లు తనిఖీలు లేకుండా పూర్తిగా మినహాయించబడ్డాయి. కావున ఈ జివోని తక్షణమే ఉపసంహరించాలి. స్వయంగా భద్రత పాటిస్తున్నట్లు యజమానులు హామీ ఇస్తే తనిఖీలు అక్కరలేదనే క్లాజు కూడా పూర్తిగా ఎత్తివేయాలి. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ పేరుతో తనిఖీలు లేకపోవడమే ఈ ప్రమాదాలకు మూలకారణం. కావున సేఫ్టీ ఆడిట్ రెగ్యులర్‌గా నిర్వహించాలి.
60వేల మంది కార్మికులు పనిచేస్తున్న అచ్యుతాపురం, పరవాడ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేక ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులను విశాఖపట్నం, అనకాపల్లి ల్లోని ఆసుపత్రులకు తరలించేలోపే కార్మికులు మరణిస్తున్నారు. కార్మికులు, యాజమాన్యాల నుండి ఇఎస్‌ఐకి కోట్లాది రూపాయాల నిధులు జమ అవుతున్నాయి. కాని ఇఎస్‌ఐ ఆసుపత్రి ఈ ప్రాంతంలో లేదు. కావున అచ్యుతాపురం కేంద్రంగా 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బర్న్ వార్డుతో ఏర్పాటు చేయాలి. అత్యవసర పరిస్థితులకు ఎన్‌డిఆర్‌ఎఫ్ కేంద్రాన్ని, అగ్నిమాపక వాహనాలను అదనంగా ఏర్పాటు చేయాలి. గతంలో జరిగిన ప్రమాదాలపై వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికలను బట్టబయలు చేసి దీనిలోని లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు ఈ క్రింది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1) పారిశ్రామిక ప్రమాదాల నివారణకు నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని, అలాగే ఈ కమిటీలో నిపుణులతో పాటు కార్మిక సంఘాల నాయకులకు కూడా స్థానం కల్పించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతున్నాము.
2) రాష్ట్ర వ్యాపితంగా ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు నిర్ణీత సమయాల్లో పరిశ్రమలను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
3) పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలకు యాజమాన్యాలు భాద్యులుగా చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి.
4) అచ్యుతాపురం తదితర సెజ్‌లలో వంద పడకల ఆసుపత్రులను ఈఎస్‌ఐ వారి ద్వారా నిర్మింపచేసి, వారే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
5) రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే వలస కార్మికులందర్ని రిజిస్టర్ చేసి వారి వివరాలన్నీ ఎంఆర్‌ఓలు సంక్షిప్తం చేయాలి.
6) కార్మిక శాఖ అధికారులు పని గంటల అమలుపై అన్ని పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాలి.
7) ప్రమాదకరమైన పరిస్థితులున్న అన్ని పరిశ్రమల్లో పర్మినెంట్ కార్మికులను మాత్రమే నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
8) ఎసెన్షియా కంపెనీ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం వేసే కమిటీలో కార్మిక ప్రతినిధిని కూడా చేర్చాలి. అప్పుడే వాస్తవాలు వెలికివస్తాయి.
9) ప్రతి ఆరు నెలలకొకసారి ఫార్మా కంపెనీల్లో సేప్టీ ఆడిట్ నిర్వహించాలి.
10) హెల్మెట్, షూష్, ఫైర్ కోట్స్, ఫేస్‌షీల్డ్, హార్ట్ టోపీలు, గ్లౌజులు, ఇయర్ ప్లగ్‌లు, రెస్పిరేటర్లు, ఫాల్ ప్రొటక్షన్ ఎక్విమెంట్ తదితర భద్రతా పరికరాలు ఇవ్వాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి