
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 21 ఆగష్టు, 2024.
అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా ప్రమాదంపై విచారణ జరిపి
కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ ప్రైమ్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర దిబ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నది. మరణించిన ఒక్కొక్క కార్మికుని కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులైన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నది.
అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని ఎసెన్షియా ఫార్మాలో ఈ రోజు మధ్యాహ్నాం జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందగా ఇంకా కొంత మంది శిథిలాల క్రింద ఉన్నట్టు తెలుస్తున్నది. సుమారు 22 మందికి పైగా కార్మికులు క్షతగాత్రులయ్యారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా వుందని తెలుస్తుంది. ఫార్మా పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు కమిటీల పేరుతో హడావుడి చేస్తున్నారు. కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఉన్న లోపాలపై కార్మిక, తదితర శాఖలు నిరంతరం తనిఖీలు చేయడంలేదు. ఈ నెల రోజుల్లోనే మూడు ప్రమాదాలు సంభవించినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీస్ ఆప్ ఇన్‌స్పెక్టర్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
గతంలో కూడా పరవాడ, అచ్యుతాపురం సెజ్‌ల్లో జరిగిన ప్రమాదాలపై అధికార యంత్రాంగంతో కమిటీలు వేసి విచారణ నిర్వహించారు. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు బహిర్గతం చేసి కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని వుంటే నేడు ఇలాంటి ప్రమాదాలు సంభవించేవికాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదాలకు కారణమైన కంపెనీపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించేటట్లు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి