(ప్రచురణార్థం: సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
విజయవాడ,
తేది : 19 ఆగష్టు, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : పోలవరం ప్రాజెక్టు - కొన్ని ముఖ్యమైన అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ...
అయ్యా!
పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలోని ఫైళ్ళు దహనం అయ్యాయన్న వార్త దిగ్బ్రాంతి కల్గించింది. ఆ ఫైళ్ళు భూ నిర్వాసితుల పరిహారం చెల్లింపులకు సంబంధించినవని, చెల్లింపులలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకే ఫైళ్ళను కాల్చివేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది మరింత ఆందోళన కల్గించే విషయం. ఈ సందర్భంగా మూడు ముఖ్య విషయాలని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
మొదటిది, పోలవరం ప్రాజెక్టు వలన ప్రత్యక్షంగా తమకు ఏమాత్రం ప్రయోజనం లేకపోయినా కొంప, గోడు, భూములు సర్వస్వాన్ని త్యాగంజేసిన గిరిజన నిర్వాసితులకు ఎవరికన్నా ఎక్కువగా పరిహారం ఇచ్చి, పునరావాసం కల్పించడం ప్రభుత్వ ధర్మం. కాని ఇప్పటి వరకు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. నిర్వాసితుల సమస్యల పరిష్కరించకుండానే 2026 నాటికి ప్రాజెక్టు పూర్తిజేస్తామని ప్రకటించారు. దీనర్థం వారిని నీట ముంచైనా మేం ముందుకు పోతామని చెప్పడమే.
ఇప్పటివరకు జరిగిన అత్తెసరు నష్టపరిహారం చెల్లింపుల్లో కూడా భారీగా అక్రమాలు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్వాసితులకు సంబంధించిన అన్ని వివరాలతో ఒక వివరణ పత్రాన్ని విడుదలజేయాలని దానిపై శాసనసభలో ప్రత్యేకంగా చర్చించాలని కోరుతున్నాను. ప్రతి ‘సోమవారం’ పోలవరం అన్న నినాదంతో, ఈ ప్రాజెక్టుకు మీరు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని, 30 సార్లకు పైగా ప్రాజెక్టుని సందర్శించారని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు అంటే సిమెంటు, ఇసుక, కంకర, కాంట్రాక్టర్లే కాదుÑ దానికి సర్వం త్యాగంజేసిన వేలాది గిరిజన కుటుంబాలు కూడా. వారి బాధలు తెలుసుకునేందుకు వారిని మీరెప్పుడూ సందర్శించలేదు.
రెండవది, క్రొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం త్వరగా పూర్తిజేయడానికి వీలుగా పాత కాంట్రాక్టరుకే అప్పగిస్తున్నారని కూడా మీడియాలో వచ్చింది. గోదావరి నదిమీద నిర్మాణమయ్యే అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్టును పటిష్టంగా నిర్మించడం ముఖ్యం. ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాల్సిన పనులను త్వరగా పూర్తి చేయాలనే పేరుతో రాజకీయ అవసరాలకోసం తొందరజేస్తే, కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం నిపుణుల సలహాలను పెడచెవిన పెడితే ఇప్పటికి జరిగిన అనర్థాలు, ఆలస్యాలు, నష్టాలకన్నా ఇంకా ఎక్కువ జరిగే ప్రమాదం వుంది. ప్రభుత్వం విడుదలజేసిన శ్వేతపత్రంలో గతంలో జరిగిన తప్పిదాల వలన వేలకోట్లు నష్టం జరిగిందని వెల్లడిరచారు. ఆ నష్టాలకు బాధ్యులెవరు, జరిగిన నష్టాలను రాబట్టుకునేందుకు చర్యలేమిటి అనే విషయాలపై ఇప్పటివరకు ప్రభుత్వం నిశ్శబ్దంగా వుండడంలో మర్మమేమిటో బోధపడడం లేదు. అందువలన, వాస్తవాలను వెలికితీసేందుకు, భవిష్యత్తులో నష్టాలు, తప్పిదాలు జరగకుండా అవసరమైన చర్యలను సూచించేందుకు ఒక ఉన్నతస్థాయి స్వతంత్ర విచారణ కమిటీని నియమించాలని కోరుతున్నాను.
చివరగా, ప్రభుత్వం విస్మరిస్తున్న ఒక ముఖ్యమైన సాంకేతిక విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. గోదావరిలో ప్రవహించే నీటిలో భారీ మొత్తంలో కోయిదా ` పోలవరం మధ్య మాయమైపోతున్నట్లు , దీన్ని నిరోధించకపోతే ప్రాజెక్టు పూర్తిజేసినా రిజర్వాయర్ నీరు కొన్ని రోజుల్లోనే ఇంకిపోతాయని నీటి నిపుణులు గతంలో హెచ్చరించారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిశోధన జేసిన భౌగోళిక నిపుణులు, ఉపరితలంలో ఎక్కడా లీకు కావడం లేదని, నదీగర్భంలో లీకు జరుగుతుందేమో పరిశీలించాలని నివేదించారు. ఈ అంశంపై ప్రభుత్వాలు ఇప్పటివరకూ అవసరమైన చర్యలు తీసుకోలేదు. తీసుకుంటే నిర్ధారణలేమిటో బయటపెట్టలేదు. లీకేజీ నిజమయితే, క్రొత్త డయాఫ్రం వాల్ వలన ప్రయోజనం ఏమి వుండదు. ఈ విషయాలను కీర్తిశేషులు ప్రోఫెసర్ శివాజీరావుగారు, విశ్రాంత నీటి పారుదల శాఖ ఇంజనీరైన శ్రీసుబ్బారాయుడుగారు ప్రభుత్వం దృష్టికి గతంలోనే తెచ్చారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టంజేయాలని కోరుతున్నాను.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో వేలాది గిరిజన కుటుంబాల భవిష్యత్తు ముడిపడి వుంది. అలాగే లక్షలాది దిగువ ప్రాంత ప్రజల పంటల రక్షణ సమస్య ఇమిడి వుంది. అందువలన ప్రాజెక్టు, ప్రజల క్షేమం కోసం నేను ప్రతిపాదించిన సూచనలపై సానుకూలంగా స్పందిస్తారని, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాను.
అభివందనములతో...
(బి.వి.రాఘవులు)
సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో సభ్యుల