గవర్నర్‌ ప్రసంగం ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లింది

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 22 జూలై, 2024.

 

గవర్నర్‌ ప్రసంగం ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లింది

గవర్నర్‌ ప్రసంగం గత ప్రభుత్వ వైఫల్యాలకే పరిమితమైంది తప్ప ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తారో ఎటువంటి ప్రస్తావన లేదు. కొత్త ప్రభుత్వానికి భారీ మెజారిటీ సమకూర్చి ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల ఆకాంక్షలపై నీళ్ళు చల్లేదిగా ఈ ప్రసంగం వుందని సిపిఐ(యం) భావిస్తున్నది.

విభజనతో తీవ్రంగా రాష్ట్రం నష్టపోయిందన్న గవర్నర్‌ ప్రసంగం ఆలోటును పూడ్చడానికి అవసరమైన ప్రత్యేకహోదా ప్రస్తావన గానీ, విభజనహామీల అమలు ప్రసక్తిగానీ లేకపోడం అన్యాయం. 

ప్రభుత్వరంగంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటీకరించేదానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించిగానీ, దానిని కాపాడుకునేదానికి నిర్దిష్టమైన హామీగానీ ఏమీ లేకపోవడం దురదృష్టకరం. 

అలాగే పోలవరం ప్రాజెక్టు గత తమ పరిపాలనలోనే 72శాతం పూర్తయిందని చెప్పడం తప్ప నిర్వాసితుల ప్రస్తావనే లేకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ప్రభుత్వ ఖజానా ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని చెపుతూ దీనిపై చర్చించాలని కోరారు. రానున్న రోజుల్లో ప్రజలపై అదనపు భారాలను మోపడానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించేదిగా వుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి బాధ్యతను తీసుకుంటానన్న ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి గారికి ఏమి హామీ ఇచ్చారో కూడా ఇందులో పేర్కొనలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వున్న గవర్నర్‌గారు కేంద్ర సహాయం ఎలా వుంటుందో ప్రస్తావించలేదు. ప్రజలపై భారాలు మోపకుండా కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు అన్ని పక్షాలను కలుపుకొని కేంద్రంతో పోరాడాలని సిపిఐ(యం) కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి