
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 జూలై, 2024.
రెండు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి
రాష్ట్ర విభజన తరువాత గత పది సంవత్సరాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఉభయ రాష్ట్రాల సమస్యలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరపడం ముదావహం అని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అపోహలకు అవకాశం లేకుండా చర్చలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన కోరారు.
ఉభయ రాష్ట్రాలను అభివృద్ధి చేయడంలో విభజన హామీలను నెరవేర్చటంలో మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పింది. కనీసం రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో ఉన్న అంశాలను పరిష్కారం చేయకుండా నాన్చుతూ వచ్చింది. దీనిపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం హర్షనీయమన్నారు. పెండిరగ్‌లో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కరించుకోవటానికి అధికారుల స్థాయిలో కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల సమస్యలను కేంద్రం చేతిలో పెట్టకుండా పరస్పర అవగాహనతో ఉభయులూ కూర్చొని చర్చించుకునే ప్రక్రియను కొనసాగించాలని సిపిఐ(యం) కోరుకుంటున్నదని అన్నారు.
ప్రత్యేకహోదాను వదులుకోవడం రాష్ట్రానికి నష్టం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢల్లీిలో ప్రధానిని, ఇతర మంత్రులను కలిసిన తర్వాత హిందూ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సమస్యకు అంత ప్రాధాన్యత లేదని చెప్పటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండిరచారు. రాష్ట్ర ఆర్థిక సమస్యలను ప్రత్యేక హోదాతో ముడిపెట్టడం ఆక్షేపణీయమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల హక్కు. ఇది రాష్ట్ర అభివృద్ధితో ముడిపడిన అంశం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కేంద్రం నుంచి నిధులు సాధించటం దీనితో సంబంధం లేని విషయం. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా మన బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయటానికి ప్రత్యేక హోదాతో ముడి పెట్టడం సరైనది కాదన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రాజీ వైఖరిని ప్రదర్శించడం న్యాయం కాదు. ఇప్పటికైనా విభజన హామీలు, ఆర్థిక మద్దతుతో పాటు ప్రత్యేక హోదా కోసం సాధనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి