ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ సరఫరా కొనసాగించాలని కోరుతూ...

విజయవాడ,
 తేది : 02 జూలై, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,                                                         
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్‌ వాహనాల ద్వారా  రేషన్‌ సరఫరా
కొనసాగించాలని కోరుతూ...
అయ్యా!
        రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు పార్వతిపురం మన్యం జిల్లాలలోని ఏజెన్సీ
ప్రాంతాలలో ఇప్పటివరకు మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ
చేస్తున్నారు. రాష్ట్ర గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి సంధ్యారాణి గారు ఇటీవల
మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీలో రేషన్‌ డిపోల ద్వారా సరఫరా చేస్తామని
ప్రకటించడం గిరిజనులలో ఆందోళన కలిగిస్తున్నది. ప్రతి రేషన్‌ కార్డు దారు
10-15 కిలోమీటర్లు నడిచి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి తిరిగి
ఏర్పడుతుంది. పేదవారికి ఇబ్బంది కలిగించే ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించి
యధావిధిగా మొబైల్‌ వాహనాల ద్వారా సరఫరా చేయాలని మిమ్ములను కోరుతున్నాను.
        అల్లూరి సీతారామరాజు జిల్లాలో రేషన్‌ పంపిణీకి 221 మొబైల్‌ వాహనాలు
ద్వారా 671 డిపోల నుండి 2 లక్షల 90,892 కార్డుదారులకు నెలకు లక్ష 40 వేల
టన్నుల రేషన్‌ బియ్యం అందిస్తుంది. ఒక వాహనానికి ఇద్దరు చొప్పున జిల్లా
మొత్తంగా 442 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ పద్ధతి రద్దు చేస్తే వారందరూ
ఉపాధి కోల్పోతారు. మొబైల్‌ వాహనాలు ఒకటి ఆరు లక్షల ఖరీదు చేసి కొన్నారు.
90% సబ్సిడీతో 2026 వరకు మొబైల్‌ వాహనాలు నడుపుటకు గత ప్రభుత్వం
అగ్రిమెంటు చేసింది. వాహనాలకు సబ్సిడీ ప్రభుత్వం భరిస్తోంది. రద్దు చేస్తే
వాహనాలు కట్టాల్సిన రుణం కట్టలేక వాహనదారుల పరిస్థితి అగోమ్యగోచరంగా
మారుతుంది. కాబట్టి వాహనదారులు నిరుద్యోగం పాలు కాకుండా ఆదుకోవాలని, ఈ
విధానం యధావిధిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని మీకు విజ్ఞప్తి
చేస్తున్నాను.

అభివందనములతో...
        (వి.శ్రీనివాసరావు)
                                                                        రాష్ట్ర కార్యదర్శి