విలేకర్ల సమావేశం - 16 జూన్‌, 2024 ` విజయవాడ

విలేకర్ల సమావేశం - 16 జూన్‌, 2024 ` విజయవాడ
(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న (జూన్‌ 15వ తేదీన) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి లు హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని మీడియాకు విడుదల చేస్తున్నాము)
రాజకీయ తీర్మానం
తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీతో రాష్ట్రంలో అధికారానికి వచ్చింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాటిలో ఐదు హామీలపై ముఖ్యమంత్రి తొలి సంతకాలు చేసి అమలుకు సిద్ధపడడాన్ని సిపిఎం స్వాగతిస్తున్నది. టిడిపి ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరుతున్నది. ప్రత్యేకించి ఏజెన్సీలో జివో 3 పునరుద్దరించి స్పెషల్‌ డిఎస్సీ నిర్వహించాలని గిరిజన యువత ఎదురు చూస్తున్నది. స్మార్ట్‌మీటర్ల రద్దు చేస్తారని, ఉపాధి కల్పిస్తారని, ధరల భారాలను తగ్గిస్తారని, అదనపు భారాలు వేయబోరని, అవినీతి లేని పాలన అందిస్తుందని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఆశతో వున్నారు. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల నుండి నేర్చుకొని ప్రజానుకూల పాలన అందించడంద్వారా ప్రజల ఆశలు నెరవేర్చాలని సిపిఐ(యం) కోరుతున్నది.
బిజెపి నాయకత్వంలోని కేంద్ర ఎన్‌డిఎ ప్రభుత్వం విభజన చట్టం హామీలు అమలు చేయకుండా గత పది సంవత్సరాలు కాలయాపన చేసింది. ప్రత్యేకహోదాను తిరస్కరించి ద్రోహం చేసింది. ప్రస్తుతం ఎన్‌డిఎ లో టీడీపీ, జనసేన పార్టీలు చేరడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా వుంది. ఇప్పటికైనా అమరావతిలో రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పూర్తిస్థాయి పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులు,  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ లాంటి హామీల అమలు కోసం ఈ ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాము. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలి. అన్ని పార్టీలను కలుపుకుపోయి  కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిలబెట్టాలని కోరుతున్నాము. రాజధాని సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమరావతిపై ప్రత్యేక చట్టం చేసి అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నాము. రాష్ట్ర హక్కులకోసం లౌకికవాద రాజ్యాంగ సంస్థల పరిరక్షణ కోసం తెలుగుదేశం నిలబడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు సరికదా జనంపై విపరీతమైన భారాలు మోపింది. అవినీతిలో కూరుకు పోయింది. కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రకృతి వనరులను, ప్రజల ఆస్తులను దోచుకోవడానికి అరాచకాలకు పాల్పడ్డారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ లాంటి దుర్మార్గమైన చట్టాలు ప్రజలపై రుద్దింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, నిరుద్యోగులు, వివిధ తరగతులవారి నిరసనలను, ప్రజా ఉద్యమాలను నిరంకుశంగా అణిచివేసే చర్యలకు పాల్పడిరది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అన్ని వినాశకర బిల్లులను బలపరచింది. వీటన్నింటి వల్ల తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఎన్నికల్లో వైసీపీని దారుణంగా ఓడిరచారు. ఓటమికి కారణాలపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలపై అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదు. ఇప్పటికీ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరినే ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. బిజెపిపట్ల వైసిపి సానుకూల వైఖరిని సిపిఐ(యం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కేంద్రంతో రాజీపడే వైఖరిని ఇప్పటికైనా విడనాడి లౌకికశక్తుల పక్షాన నిలబడాలని కోరుతున్నాం.  
కేంద్రంలో మతోన్మాద బిజెపికి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. మోడీ నాయకత్వంలో మూడవసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిరది. గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి బిజెపి సొంత మెజారిటీ తెచ్చుకోలేకపోయింది. ప్రజలు బిజెపి విధానాలను, పద్దతులను తిరస్కరించారు. తెలుగుదేశం, జేడీయు తదితర మిత్ర పక్షాలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత పది సంవత్సరాలలో రైతు, కార్మిక, ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతులను అణచివేయడం, రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి దేశం పై నిరంకుశత్వాన్ని రుద్దింది. కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టింది. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలవాలనుకున్న బిజెపి ఆశలు విఫలమయ్యాయి. బిజెపి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి  తెలుగుదేశం తోడ్పడిరది. బలహీనపడ్డ బిజెపికి ఊపిరిపోసింది. కేంద్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్న టిడిపిపై కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన విద్యుక్త ధర్మం వుంది. ఈ బాధ్యతను నెరవేర్చటానికి తెలుగుదేశం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నాము.
రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం గతం కంటె పెరిగింది. కేంద్రంలో అధికారంలో వుండడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం ద్వారా దాని మతతత్వ రాజకీయాలను విస్తరించుకోవడానికి భూమిక ఏర్పడిరది. లౌకికవాదాన్ని బలహీనం చేయడానికి, రిజర్వేషన్లు రద్దు చేయడానికి అది ప్రయత్నిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టీడీపీ, బీజేపీ లు భాగస్వాములుగా ఉన్న స్థితిలో రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడటానికి, రాజ్యాంగ వ్యవస్థలను ప్రత్యేకించి లౌకికవాదాన్ని, రిజర్వేషన్లను రక్షించేందుకు, మైనార్టీలకు రక్షణ కల్పించేందుకు తెలుగుదేశం గట్టి సంకల్పంతో వ్యవహరించాలని కోరుతున్నాము. మత ఉద్రిక్తతలు, ఘర్షణలు పెంచే ఎలాంటి ప్రయత్నాలను సహించకుండా రాష్ట్రంలో సామరస్య వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
గత ప్రభుత్వ హయాంలో న్యాయమైన తమ కోర్కెల సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, స్కీం వర్కర్స్‌, మున్సిపల్‌, ఆర్టీసీ కార్మికులు, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, సామాజిక తరగతులు అనేక ఉద్యమాలు చేపట్టారు. ఉద్యమించిన వివిధ ప్రజా సంఘాల, ప్రతిపక్షాల కార్యకర్తలపై నిర్బంధంతో పాటు అక్రమ కేసులు బనాయించింది. ఇలాంటి నిరంకుశ పోకడలకు ఈ ప్రభుత్వం స్వస్తి చెప్పి అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. ప్రజాసమస్యలపై సంబంధిత సంఘాలతో చర్చించి సామరస్యంగా పరిష్కరించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
ఈ ఎన్నికల్లో రెండు బలమైన శిబిరాల మధ్య జరిగిన హోరా హోరీ పోరులో వామపక్షాలు, సిపిఐ(ఎం), ఇండియా బ్లాక్‌ పార్టీలు ఎదురీదాయి. అయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో అరకు పార్లమెంటు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపికి వ్యతిరేకంగా, ఆదివాసీ సమస్యలపై సిపిఐ(ఎం) చేసిన కృషి ఫలితంగా గతంకన్నా ఎక్కువ ఓట్లు వేసి ఆదరించారు. వారికి సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నది. రాష్ట్రంలో సిపిఎం, వామపక్షాలు, ఇండియా బ్లాక్‌ పార్టీలకు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రజానుకూల నిర్ణయాలను సిపిఐ(ఎం) బలపరుస్తుంది. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని  ఒత్తిడి చేస్తుంది. మన రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంపై పోరాడేందుకు మద్దతు ఇస్తుంది. ప్రజల తరపున, శ్రామిక ప్రజలపక్షాన గతంలో వలె నికరంగా నిలబడి పోరాడుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నాము. బిజెపి మతోన్మాదానికి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాతంత్ర వాదులతో కలిసి కృషి చేస్తుంది. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలుకోసం రాష్ట్ర ప్రజలను, ప్రజాసంఘాలను కలుపుకుని ఐక్య ఉద్యమాలను నిర్మించేందుకు పనిచేస్తుంది. సామాజిక న్యాయం, సంక్షేమం, లౌకికతత్వం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషిని కొనసాగిస్తుంది. ఈ ప్రయత్నాలకు ప్రజలు అండదండలివ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
= = = =