
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 22 ఏప్రిల్, 2024.
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై వైసిపి మోసపూరిత మౌనాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. బిజెపి కుట్రకు పరోక్షంగా మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తున్నది. విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని టిడిపి, వైసిపి తమ మానిఫెస్టోలో చేర్చాలి.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మోడీ ప్రభుత్వం అమ్మేస్తుంటే చంద్రబాబు, జగన్‌లు విశాఖ ఎన్నికల ప్రచారంలో ఎందుకు మాట్లాడడం లేదు ? మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు? విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై టిడిపి,వైసిపి పార్టీల వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు, భరోసా అంటూ ఊదరగొట్టారు గానీ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ పై ప్రస్తావనే చేయలేదు. ఎన్నో త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలని చంద్రబాబుకు లేకపోవడం గర్హనీయం. లోకేష్ కూడా విశాఖ వరకు పాదయాత్ర చేసి కనీసం స్టీలుప్లాంట్ కార్మికుల నిరసన దీక్షను కూడా సందర్శించకపోగా ఉద్దేశపూర్వకంగా దాటేయడం అవకాశవాదం.
ఉక్కు కర్మాగారం అమ్మేస్తుంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్, చంద్రబాబులు స్పందించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి విధానాలకు వంతపాడుతున్నారు. మరోవైపు గాజువాక టిడిపి, వైసిపి అసెంబ్లీ అభ్యర్థులు ఓట్ల కోసం స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుతాం అంటూ ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమే. స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఖనిజం అందకుండా మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రశ్నించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి