రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపికి అంటకాగుతున్న టిడిపి, జనసేన కూటమి, వైసిపి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

ప్రజల ఎజెండా కోసం సిపిఎం పోరాటం

ఎన్నికల ప్రణాళిక విడుదల 

రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న మతోన్మాద బిజెపి 

టిడిపి, జనసేన, వైసిపి 14 అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలి

సిఏఏ పట్ల వారి వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి

ప్రజలవైపో కార్పొరేట్ల వైపో తేల్చుకోవాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

 

ప్రజల ఎజెండా కోసం సిపిఎం పోరాడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. సిపిఎం రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ప్రణాళికను మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, జె.జయరాం, కె.హరికిషోర్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపికి అంటకాగుతున్న వైసిపి, టిడిపి, జనసేన కూటమికి 14 ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ప్రజల సమస్యలను ఏజెండా చేయడానికి సిద్ధంగా లేవని, ప్రజల మధ్య ఉద్రేకాలు రెచ్చగొట్టి రాళ్లేసుకునే సంస్కృతిని తీసుకొచ్చి కాలం గడుపుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపైనా, బిజెపి అనుసరిస్తున్న విధానాలపైనా టిడిపి, జనసేన, వైసిపి వాటి వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండు చేశారు. ఈ పార్టీలన్నీ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయని మండిపడ్డారు. సిఏఏపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, బిజెపిపితో పొత్తులో ఉన్న టిడిపి, జనసేన దాన్ని వ్యతిరేకిస్తాయా, బలపరుస్తాయా రానున్న పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తాయా లేదా ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. వైసిపి కూడా సిఏఏకు మద్దతు ఇస్తోందని వారి వైఖరి ఏమిటో కూడా చెప్పాలని తెలిపారు. కేంద్రంలో జమ్మూకాశ్మీర్‌ హక్కులను కాలరాస్తోందని, ఇండియా బ్లాక్‌ పార్టీలు జమ్మూకాశ్మీర్‌ హక్కులను కాపాడుతామని చెబుతున్నాయని ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్‌ పార్టీలను బలపరచాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లానును రద్దుచేశారని, కనీస మద్దతు ధరల చట్టాన్ని నీరుగార్చారని, కార్మిక హక్కులను కాలరాశారని, గిరిజన ప్రాంత ప్రజల హక్కులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇన్ని దుర్మార్గాలు చేస్తున్న బిజెపికి టిడిపి, జనసేన, వైసిపి ఎందుకు అంటకాగుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ప్రశ్నించిన నాయకులపై ఈడి, సిబిఐ, ఐటి విభాగాలతో దాడులు చేయిస్తున్నాయని విమర్శించారు. పుల్వామా ఘటన వాస్తవాలను వెల్లడిరచిన సత్యపాల్‌ మాలిక్‌పై ఈడి కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపి వెంట తిరుగుతున్న టిడిపి, వైసిపి, జనసేనను ఎందుకు గెలిపించాలో సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న సిపిఎస్‌ రద్దుపై రాష్ట్రంలో మూడు పార్టీల వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నారని, షరతులు విధించి ఆస్తిపన్ను పెంచుతున్నారని, విద్యుత్‌ భారాలు మోపుతున్నారని వీటిపై బిజెపి, టిడిపి, జనసేన వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. 

 

రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపికి అంటకాగుతున్న 

టిడిపి, జనసేన కూటమి, వైసిపి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

 

1. సిఎఎ పట్ల మీ వైఖరి ఏమిటి?

2. 370 ఆర్టికల్‌ రద్దును సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?

3. బిజెపి రాజ్యాంగ పీఠికను సవరిస్తే బలపరుస్తారా? వ్యతిరేకిస్తారా?

4. ఉపా చట్టాన్ని రద్దు చేస్తారా?  కొనసాగిస్తారా?

5. ప్రతిపక్షాలపై బిజెపి దాడుల్ని (ఐటి, ఇడి, సిబిఐ) బలపరుస్తారా? వ్యతిరేకిస్తారా?

6. ఎన్నికల బాండ్ల రద్దును సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?

7. బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వనంటుంది. పై పార్టీలు బలపరుస్తాయా? పోరాడి సాధిస్తాయా?

8. కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను బిజెపి ఎత్తివేసింది. పై పార్టీలు దాన్ని పునరుద్దరిస్తాయా? సమర్ధిస్తాయా?

9. రాజ్యాంగ వ్యవస్థలైన ఎన్నికల కమీషన్‌, న్యాయవ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుతారా? బిజెపికి తాళం వేస్తారా? అప్రజాస్వామిక గవర్నర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తారా? బలపరుస్తారా?

10. సిపిఎస్‌ను వ్యతిరేకించి, ఓపిఎస్‌ పునరుద్దరణకు మద్దతిస్తారా?

11. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి పార్లమెంటులో నిలబడతారా?

12. కార్మిక కోడ్‌లను వ్యతిరేకిస్తారా? బలపరుస్తారా?

13. రైతులకు గిట్టుబాటు ధరలు, రుణ విమోచన చట్టాలు, పట్టణ ఉపాధి హామి చట్టాల కోసం పార్లమెంటులో పోరాడతారా? లేక బిజెపికి లొంగిపోయి  రైతులకు అన్యాయం చేస్తారా?

14. అటవీ హక్కుల సంరక్షణ చట్ట సవరణ వ్యతిరేకిస్తారా? బలపరుస్తారా? జివో 3 పునరుద్దరణ పట్ల మీ వైఖరి ఏమిటి? ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్‌ 5 ప్రకారం 1/70 అమలు చేస్తారా? లేదా?

 

హౌస్‌ అరెస్టులపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గుడివాడ పర్యటన సందర్భంగా సిపిఎం నాయకులు ఆర్‌సిపి రెడ్డి, బి.వి.శ్రీనివాసరావు, బసవా అరుణలను హౌస్‌ అరెస్టు చేశారని దీనిపై ఎన్నికల కమిషన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా హౌస్‌ అరెస్టు చేయడం ఏ రకంగా సమంజసమని ప్రశ్నించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లో ఉన్న సమయంలో ఎటువంటి నోటీసూ ఇవ్వకుండా ఉదయం ఆరుగంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకూ నిర్బంధించడం ఎంతవరకు సమంజమని వారు ప్రశ్నించారు. పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ చట్ట విరద్దంగా ప్రవర్తించడం సమంజసం కాదని అన్నారు.