భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 మార్చి, 2024.
మాటల గారడితో దగా చేసిన మోడీ
మోడీ విమర్శలపై జగన్ స్పందించాలి
చిలకలూరిపేట సభలో ప్రధాని వ్యాఖ్యలు వట్టిమాటల జడివాన తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేదు. వికసిత ఆంధ్రప్రదేశ్ డబ్బా కొట్టడం తప్ప ఇప్పటి వరకు ఏం చేశారో, వచ్చే ఐదేళ్ళలో ఏం చేస్తారో చెప్పలేదు. రాష్ట్రంలో సమస్యల గురించిగానీ, ప్రత్యేకహోదా గురించిగానీ, విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించిగానీ ఆఖరికి చిలకలూరిపేటకు కూతవేటు దూరంలో ఉన్న అమరావతి గురించి కూడా ప్రస్తావించకపోవడం మోడీ విద్రోహాన్ని బట్టభయలు చేసింది. తెలుగులో మాట్లాడితే పొంగిపోతారని భావించారు తప్ప నిర్దిష్టమైన హామీలు ప్రకటించలేదు. జగన్ నవరత్నాలు వల్లివేసినట్లు మోడీ పథకాలను వల్లివేశారు. పదే పదే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్నారు. ఇది డబుల్ ఇంజన్ కాదు డబుల్ నాటక సర్కార్. తెలుగుదేశంతో జతకడుతూనే జగన్ ప్రభుత్వాన్ని మోస్తున్న సర్కార్ ఇది. 11 విద్యా సంస్థలు ఇచ్చానని చెప్పిన మోడీకి ప్రహరీ గోడలు కూడా పూర్తికాలేదనే విషయం తెలియదా?
దేశవ్యాపితంగా రైతులు ఆందోళన చేస్తున్న రైతుల గిట్టుబాటు ధర గురించి ప్రస్తావించలేదు. పోర్టులు, బ్లూ ఎకానమీ అంటే ఆంధ్ర వనరుల్ని అదానీకి అప్పణంగా కట్టబెట్టడమేనా? ఆయుష్మాన్ భారత్ పేరుతో 1.20 కోట్ల మందికి ఆరోగ్యం అందించామని చెప్పడం పచ్చి భూటకం. దానినే పదే పదే చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజల ఆరోగ్యం డేటాతో ఫార్మ కంపెనీలను ఉద్దరించడానికే ఆయుష్మాన్ భారత్‌ను తెచ్చారన్నది నగ్న సత్యం.
బాబూ, పవన్ మోడీని పొగడడానికే సరిపోయింది. మోడీ మరలా ప్రధాని అయితే ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో, ఏం కావాలో చెప్పలేకపోయారు. రాష్ట్రాభివృద్ధిని నాశనం చేసిన మోడీ విజనే తన విజన్ అని చెప్పడం ద్వారా చంద్రబాబుకు ప్రత్యేక విజన్ లేదని స్పష్టమైంది. ఎన్‌టిఆర్‌ను పొగిడితే చప్పట్లు కొట్టి పొంగిపోయారు. ఎన్‌టిఆర్ బాబ్రీ మసీదు కూలగొట్టడాన్ని వ్యతిరేకించారు. ఫెడరలిజాన్ని కాపాడడంకోసం నిలబడ్డారు. ఇవన్నీ మరచిపోయి లౌకికతత్వ పునాదినే పెకిలించే మోడీ సరసన చేరడం సిగ్గుచేటు. మోడీ విమర్శలన్నీ ఇండియా బ్లాకు మీదనే ఎక్కుపెట్టారు. ఈరోజు దేశవ్యాపితంగా ఇండియా బ్లాకుకు వస్తున్న ఆదరణ చూసి మోడీ తట్టుకోలేకపోతున్నారు. బిజెపి, టిడిపి జనసేన పొత్తు వినాశకరమైంది. ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంసం చేసే పొత్తు ఇది. తెలుగు ప్రజలు మోడీ చేసిన అన్యాయాన్ని మరచిపోరు, ప్రశ్నిస్తారు. బిజెపితో వినాశకరమైన పొత్తు టిడిపి శ్రేణులు ప్రశ్నించాలని కోరుతున్నాము. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వమని మోడీ చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందించాలి.
లౌకికవాదులు, ప్రజాస్వామ్య వాదులు, అభివృద్ధిని కోరుకునేవారు, వామపక్షాల్ని, ఇండియా బ్లాకుని ఓట్లు వేసి గెలిపించాలని, రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి సున్నా చుట్టి పంపించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి