
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 09 మార్చి, 2024.
మత్స్యకారుల న్యాయమైన డిమాండ్స్‌ను పరిష్కారం చేయాలి
లైపెజ్ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి.
కాకినాడ జిల్లాలో లైపెజ్ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీలు సముద్రంలోకి వేసే వ్యర్థ పదార్ధాల పైప్ లైన్ వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతున్నందున ఆ ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. మత్స్యకారుల న్యాయమైన కోర్కెలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నది. కొనపాపపేట మత్స్యకారులు నిర్వహిస్తున్న ఆందోళనకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది.
కాకినాడ జిల్లా, యూ. కొత్తపల్లి మండలం, కొనపాపపేట మత్స్యకార గ్రామస్తులు కొన్ని నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. మత్స్యకారులు పలు దఫాలుగా నిర్వహించిన ఆందోళనవల్ల అధికారులు రెండు సార్లు చర్చలకి పిలిచి ఏమీ తేల్చలేదు. స్థానిక వైసీపి ఎమ్మెల్యే నష్ట పరిహారం ఇప్పిస్తానని మత్స్యకారులకు వాగ్దానం చేసి, మాట మార్చాడు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో మత్స్య కారులు తమ బోట్లకు తామే నిప్పు పెట్టుకుని నిరసన తెలిపారు.
నిన్న చర్చలని ప్రకటించిన అధికారులు మరోసారి వాయిదా వేసి మత్స్యకారులను పదే పదే మోసగించడం పరిపాటిగా మారింది. కాకినాడ జిల్లాలో రిలయన్స్, ఓఎన్‌జిసి సంస్థలు వేసిన పైప్ లైన్‌ల వల్ల మత్స్య కారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డెక్కన్ కంపెనీ వదిలే వ్యర్ధాలు వల్ల చేపలు వాసన వచ్చి ధరలు రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. కాబట్టి మత్స్య కారులు డిమాండ్ చేస్తున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్, పొల్యూషన్ బోర్డు అధికారులు, మత్స్య శాఖ అధికారులు, లైపెజ్ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీల పర్యావరణ అనుమతులు రద్దు చేయాలి.వ్యర్ధాలు నేరుగా సముద్రంలోకి వదల కుండా పైపు లైన్ పనులు నిలిపి వేయాలి.
మత్స్యకారులతో చర్చించి వారి న్యాయ మైన డిమాండ్ పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి