నిరుద్యోగం, నిర్వాసితం, భూసమస్యపై 9న ఆదివాసీ జనరక్షణ దీక్ష

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విలేకర్ల సమావేశం 

7 మార్చి, 2024 - విజయవాడ

 

 

నిరుద్యోగం, నిర్వాసితం, భూసమస్యపై

9న ఆదివాసీ జనరక్షణ దీక్ష

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న మోడీకి జగన్‌, చంద్రబాబు,పవన్‌ మద్దతు

కాళేశ్వరం కంటే పెద్దకుంభకోణం పోలవరం

 

గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలు ఎదుర్కోంటున్న నిరుద్యోగం, నిర్వాసితం, భూసమస్యపై సిసిఎం ఆధ్వర్యాన ఈనెల 9వ తేదీన ఆదివాసీ జనరక్షణ దీక్ష చేపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివాసీలకు అన్యాయం చేస్తూ అడవులు, సహజవనరులను కొల్లగొట్టి ఆదానీకి కట్టబెడుతున్న మోడీకి రాష్ట్రంలో జగన్‌, చంద్రబాబు, పవన్‌ మద్దతు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఏజన్సీలో గిరిజనులు అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని అన్నారు. దీంతో వారిలో అభద్రతాభావం, అశాంతి పెరుగుతోందని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని  అన్నారు. పైగా నక్సలైట్ల పేరుతో గిరిజన ప్రాంతాల్లో అరాచకం సృష్టిస్తూ నమ్ముకున్న భూముల నుండి వారిని తరిమేస్తూ సహజనవరులను అదానీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని, వారి హక్కులు కాపాడాలని కోరుతూ 9వ తేదీన సిపిఎం ఆధ్వర్యాన విజయవాడలోనూ, 8,9 తేదీల్లో ఏజెన్సీలోని అన్ని ఐటిడిఏ కేంద్రాల వద్ద ఆదివాసీ జనరక్షణ దీక్షలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 

మరీ ముఖ్యంగా అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో అదివాసీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వారికి పునరావాసం కల్పించకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని పేర్కొన్నారు. 70 శాతం ప్రాజెక్టు పూర్తయిందని చెబుతున్నా ఆచరణలో 22 శాతానికి మించి పనులు జరగలేదని అన్నారు. ఈ ప్రాజెక్టులో వాల్స్‌ దెబ్బతిన్నాయని, విచారణ జరిపిస్తే కాళేశ్వరం కంటే పెద్ద కుంభకోణం అవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పటిష్టత నేపథ్యంలో దిగువ ప్రాంత ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. పోలవరం కింద 1.06 లక్షల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా 22 వేల కుటుంబాలకు మాత్రమే కల్పించాలని,  న్యాయం చేయాలని సిపిఎం ఆధ్వర్యాన ఆందోళన చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చర్చించి అదనంగా 36 వేల కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని హామీనిచ్చిందని ఇంతవరకు చేయలేదని తెలిపారు. కాంటూరు లెక్కల్లో తప్పులున్నాయని, ఈ ప్రాజెక్టు పునరావాసంలో ఎక్కువమంది ఆదివాసీలే నష్టపోతున్నారని పేర్కొన్నారు.  

ఆదివాసీలకు ప్రత్యేక డిఎస్‌సి నిర్వహించాలి

ఆదివాసీ ప్రాంతంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డిఎస్‌సి నిర్వహించాలని శ్రీనివాసరావు కోరారు. అక్కడున్న ఖాళీలకు భర్తీచేస్తామని ప్రకటించిన పోస్టులకు ఏ మాత్రమూ పొంతన లేదని అన్నారు. 534 పోస్టులకుగానూ 38 పోస్టులు మాత్రమే ఆదివాసీలకు నోటిఫికేషన్‌ ఇచ్చారని అన్నారు. రంపచోడవరం పరిధిలో 11 మండలాలకుగాను మూగ్గురికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పోస్టులు వారికే కేటాయించాలని డిమాండు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఆదివాసీ డిఎస్‌సి నిర్వహించాలని డిమాండు చేశారు. 

10న ఏజెన్సీ బంద్‌కు మద్దతు

సమస్యలు పరిష్కరించాలని, హక్కులు కాపాడాలని కోరుతూ 10వ తేదీన గిరిజన ప్రాంతాల్లో బంద్‌ నిర్వహిస్తున్నారని, దీనికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ బంద్‌ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకమైనదని అన్నారు. 

పోడు చట్టానికి తూట్లు

పోడు భూములపై హక్కుల విషయంలో అప్పట్లో సిపిఎం ఒత్తిడితో యుపిఏ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిందని, దీని ప్రకారం 2006కు ముందు పోడు చేసుకుంటున్న వారికి వారి భూములపై హక్కులు కల్పించాలని, కానీ ఇంతవరకు ప్రభుత్వం అమలు చేయకపోగా కార్పొరేట్‌ కంపెనీల కోసం చట్టాల్లో సవరణలు తీసుకొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అరకు కాపీ, జీడికి మద్దతు ధర

గిరిజనులు పండించే అరకు కాఫీకి ఎంతో డిమాండు ఉందని, కానీ ప్రభుత్వాలు వారికి మార్కెటింగ్‌ కల్పించకపోవడంతోపాటు దళారుల పాలు చేసే విధంగా  వ్యవహరిస్తున్నాయని అన్నారు. దీనివల్ల గిట్టుబాటు ధర రావడం లేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అరకుకాఫీకి ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు.  అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో పండిరచే జీడిపప్పుకు గిరాకీ ఉన్నా పండిరచే రైతులు మాత్రం నష్టపోతున్నారని, వారికీ న్యాయం చేయాలని సిపిఎం డిమాండు చేస్తోందని అన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ 9న ఆదివాసీ జనరక్షణ దీక్ష చేపడుతున్నామని తెలిపారు.