ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం... సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 15 ఫిబ్రవరి, 2024.

 

ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం

సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం

ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీి హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికలలో దొంగడబ్బు, నల్లధనం విచ్చలవిడిగా ప్రవహిస్తున్నది. అధికార పార్టీలకు, పెట్టుబడిదారులు వారి ప్రయోజనాలు ప్రోత్సాహించే అభ్యర్ధుల కోసం ఈ డబ్బును వెదజల్లి ఓట్లు కొనుగోలు చేసి ప్రజా తీర్పును తలకిందులు చేస్తున్నారు. ఇదే నల్లడబ్బుతో ఓడిపోయిన పార్టీ ప్రతినిధులను కొనుగోలు చేసి ప్రభుత్వాలను సైతం తారుమారు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ తీర్పు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా కోర్టులో సిపిఐ(యం) కూడా పిటిషన్‌ దాఖలు చేసింది.

ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల ఖర్చులో పారదర్శకత ఉండాలని కోరుకున్న వారిలో సిపిఐ(యం) ముందు వరసలో ఉన్నది. ఈ తీర్పు నేపధ్యంలో ఎన్నికల బాండ్లను పూర్తిగా నిషేధించాలి. ఏ కంపెనీ అయినా, ఏ వ్యకైనా ఎవరికి ఎంత డబ్బు ఇస్తున్నాడో, ఆ పార్టీ ఎంత ఖర్చు పెడుతుందో లెక్క ఉంటేనే నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకోగలము.  అధికార పార్టీ ప్రత్యేకించి మోడీ ప్రభుత్వం ప్రత్యర్ధి పార్టీలపైకి ఇడి, ఐటి వంటి సంస్థలను ప్రయోగించి వారి దగ్గరున్న డబ్బును లాక్కొవడం, తమ పార్టీ అభ్యర్ధులు పెట్టే ఖర్చులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా వదిలేయడం జరుగుతుంది. అన్ని పార్టీలకు ఎన్నికల్లో ఖర్చు పెట్టేదానికి ఒకే విధమైన విధివిధానాలు ఉంటే ఎన్నికల సంస్కరణల్లో ఒక ముఖ్యభాగం పూర్తవుతుంది. ఆ దిశగా సుప్రీంకోర్టు కూడా చొరవ తీసుకుని నియమ నిబంధనలు రూపొందించాలి. ఎన్నికలలో ఖర్చులలో పారదర్శకత లోపించడం వల్ల శత కోటీశ్వరులు ఎంపీలు, ప్రజా ప్రతినిధులై వారికి అనుకూలమైన చట్టాలు చేసుకుంటున్నారు. ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నారు. ప్రజల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి ఈ ఎన్నికల పద్దతికి సంబంధమున్నది. ఎన్నికలలో దొంగడబ్బును అరికట్టగలిగితే ఎన్నికల వ్యవస్థను ఒక క్రమపద్దతిలోకి తీసుకురావచ్చు. ఈ తీర్పును సిపిఐ(యం) స్వాగతిస్తోంది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి