రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి, దానితో పొత్తు కలిసే టిడిపి జనసేన కూటమిని, నిరంకుశ వైసీపీని ఓడించాలని సిపిఎం, సిపిఐ పిలుపు

(ఈరోజు (09 ఫిబ్రవరి) సిపిఐ(యం), సిపిఐ ఉమ్మడి ప్రెస్‌కాన్ఫరెన్సు జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం పంపుతున్నాము.  -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి, 

దానితో పొత్తు కలిసే టిడిపి జనసేన కూటమిని, 

నిరంకుశ వైసీపీని ఓడించాలని సిపిఎం, సిపిఐ పిలుపు

వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించాలని విజ్ఞప్తి

20న విజయవాడలో రాష్ట్ర సదస్సు

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో  పొత్తు పెట్టుకుంటున్న జనసేన తెలుగుదేశం కూటమిని, రాష్ట్రంలో నిరంకుశ వైసీపీని ఓడిరచాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి. శ్రీనివాసరావు, కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అయిన రెండు పార్టీల ప్రతినిధులు ఆ మేరకు ఉమ్మడి అవగాహనకు వచ్చారు. రాష్ట్రంలో వామపక్ష, లౌకిక పార్టీలను బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ 20వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఈ రోజు బాలోత్సవ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు, రామకృష్ణ చెప్పారు.

బిజెపితో పొత్తు పెట్టుకోవడం అంటే రాష్ట్రాన్ని సుడిగుండంలోకి నెట్టటమేనని, టిడిపికి మరణ శాసనమని వారు చెప్పారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీల అమలు జరపకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగ నమ్ముతూ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బ కొట్టిన బిజెపితో ఎలా కలుస్తున్నారో చెప్పాలని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు.  2019లో ఎన్డీఏ నుంచి  ఏ కారణం చేత బయటికి వచ్చారో, ఇప్పుడు ఆ సమస్యలు ఏమయ్యాయో తెలుగు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని తెలుగుదేశం జనసేన పార్టీలను కోరారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బిజెపితో కలిసి నాశనం అయ్యాయని, రాష్ట్ర హక్కులు హరించి నిరంకుశత్వాన్ని దేశంపై రుద్దుతున్నదని,

మతోన్మాదాన్ని ఇప్పుడు ఎజెండాగా చేపట్టి రాష్ట్రాన్ని దేశాన్ని బలహీన పరుస్తుందనీ, మతాల విభజన తెచ్చి మైనార్టీలను అభద్రతాభావం లోకి నెట్టిందని, మెజారిటీ మతస్తులైన హిందువులలో కుల విభజన తెచ్చి సనాతన కుల వ్యవస్థని పునరుద్ధరించాలని చూస్తున్నదని ఇటువంటి పార్టీతో కలిసి మీరు మైనార్టీలకు ఏమి చెబుతారని నిలదీశారు. కేవలం తమ స్వార్ధ రాజకీయ ఎజెండా కోసం, పదవుల కోసం, అధికారం కోసం తప్ప రాష్ట్ర ప్రజల  ప్రయోజనాలను పణంగా పెట్టి తెలుగుదేశం జనసేనలు తప్పు చేస్తున్నాయని, ఇలాంటి పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడిరచి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢల్లీిలో అమిత్‌ షా తో చంద్రబాబు సమావేశమై చర్చిస్తుండగానే రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మోడీ నుండి సమన్లు అందుకుని పరుగులు తీశారని ఒక చేత్తో వైసిపిని మరో చేత్తో తెలుగు దేశాన్ని వాళ్ళు ఆడిస్తూ రాష్ట్రాన్ని వినాశపుటంచలకు నేడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడు పార్టీలు బిజెపి పల్లకి మోస్తూ రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. నిరంకుశ పద్ధతుల్లో ప్రజలను అణిచివేస్తూ రాష్ట్రంలో వైసిపి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం బిజెపి కొమ్ముకాస్తున్నదని, ప్రజల తీర్పుకు భిన్నంగా ఈ పార్టీలు  ప్రజాభిస్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫిబ్రవరి 20 విజయవాడలో రాష్ట్ర సదస్సు

బిజెపి- టిడిపి- జనసేన కూటమిని ఈ ఎన్నికల్లో ఓడిరచాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ (ఎం), సిపిఐ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20 తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు, ఆ సదస్సుకు బిజెపి కి మద్దతు నిచ్చే వైసీపీ టిడిపి జనసేన మినహా మిగతా లౌకిక పార్టీలను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో రాజకీయ పార్టీలతో పాటు ప్రముఖ ప్రజాస్వామిక లౌకికవాదులు కూడా పాల్గొంటారని తెలిపారు.

ఫిబ్రవరి 16 దేశవ్యాప్త కార్మిక రైతుల ఆందోళనకు మద్దతు

ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరగనున్న కార్మిక కర్షక ఆందోళనను బలపరచాలని విజ్ఞప్తి చేశారు  విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం, రైతుల గిట్టుబాటు ధరల కోసం, రుణ విముక్తి కోసం, కార్మికుల కనీస వేతనాల కోసం, బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన సాగుతున్నది. రాష్ట్ర ప్రజలంతా దీన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, డి.రమాదేవి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెల్లి విల్సన్‌, అక్కినేని వనజ పాల్గొన్నారు.

= = = =