
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 08 ఫిబ్రవరి, 2024.
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు ఛలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ జిల్లాల్లో నోటీసులిచ్చి అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. వైద్య, కుటుంబ ఆరోగ్య శాఖ అదికారులు చర్చలకు రావాలని పిలిచి, అనంతరం రాత్రి 7:30 గంటలకు యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మిని అరెస్టు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి అద్దం పడుతోంది. అరెస్టుచేసి ఎక్కడకు తరలించారో ఇప్పటికీ ఆచూకీ లేదు.
పోలీసుల నిర్బంధం నుండి తప్పించుకొని విజయవాడకు చేరుకున్న వందలాది మంది ఆశా కార్యకర్తలు కాలకృత్యాలు తీర్చుకుంటున్న భవనానికి తాళాలువేసి బంధించడం దారుణం. గుంటూరు నేషనల్ హైవే వడ్డేశ్వరం, మంగళగిరి వద్ద ఆందోళన చేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో మహిళా నాయకురాలు డి.రమాదేవి, ట్రేడ్‌యూనియన్ నాయకులు కె.సుబ్బరావమ్మ, ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పోచమ్మ, కోశాధికారి ఎ.కమలమ్మ ట్రేడ్‌యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజి, నాయకులు డి.వెంకటరెడ్డి, జె.వి.రాఘవులు ఉన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులు వి.ఉమామహేశ్వరరావును నిన్నటినుండే గృహనిర్బంధం విధించారు.
ఆశా వర్కర్లు కనీస వేతనం, సెలవులు, మెటర్నటీ లీవులు, రిటైర్‌మెర్ బెనిఫిట్స్, పనిభారం తగ్గించాలని తదితర కోర్కెలతో గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ప్రశాంతంగా ధర్నాకు వస్తున్న ఉద్యోగుల కోర్కెలు పరిష్కరించకుండా వారిని పోలీసులు అరెస్టుచేసి శాంతిభద్రతల సమస్యగా చేయడం సరైంది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ నాయకులను పిలిచి చర్చించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి