కార్పొరేట్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు సహాయపడే ప్రజల భూములు లాక్కొనే భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 07 ఫిబ్రవరి, 2024.

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు (5,6 ఫిబ్రవరి) విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి  హాజరయ్యారు. సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం పంపుతున్నాము. -జె. జయరాం, ఆఫీసు కార్యదర్శి)

తీర్మానం

భూ యాజమాన్య హక్కుల చట్టం 

(ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌)27/2023)

కార్పొరేట్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు సహాయపడే

ప్రజల భూములు లాక్కొనే భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలి.

మన రాష్ట్ర ప్రభుత్వం ది.31.10.2023 నుండి ‘‘భూమి యాజమాన్య హక్కుల చట్టాన్ని’’ అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. 5గురు అధికారులతో రాష్ట్ర ల్యాండ్‌ అధారిటీని ఏర్పాటు చేసింది.

పరిశ్రమలకు భూమి సేకరణను సులభతరం చేయడం, భూవివాదాలను పరిష్కరించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం. క్రింది స్థాయి కోర్టులకు వెళ్ళకుండా నిరోధించడం, భూయాజమాన్య పత్రాలు లేనివారి భూములను కార్పొరేట్‌ లాండ్‌ ఆథారిటీకి బదలాయించడం ఈ చట్టం ద్వారా చేస్తారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ సలహా ప్రకారం నీతిఅయోగ్‌ తయారు చేసిన యోడల్‌ యాక్ట్‌ ఆధారంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని హడావుడిగా సిద్ధం చేసింది. సమగ్ర భూసర్వే సమస్యలు అనేకం పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇంతలో ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్త్తిన రుద్దింది.

రాష్ట్ర స్థాయిలో కార్పొరేట్‌ ల్యాండ్‌ అధారిటీని ఏర్పాటు చేయడం, న్యాయవ్యవప్థకు సంబంధం లేకుండా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం ఈ చట్టం ప్రత్యేకత.

విదేశీ పెట్టుబడికి ఎలాంటి అడ్డంకులు లేకుండా రైతులతో పనిలేకుండా ఎంత బాగా ఏర్పాట్లు చేస్తే ఈజ్‌ఆఫ్‌డూయింగ్‌ బిజినెస్‌లో అంతమంచి ప్రపంచ ర్యాంకు వస్తుంది. ప్రజల ఆస్తులను సులభంగా కాజేయవచ్చు. దీనికోసం తాపత్రయమే ఈ చట్టం తీసుకురావడంలో హడావుడి కనిపిస్తుంది.

కోర్టు కేసులు 66% భూసంబంధమైనవని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాలు నచ్చక భూ యాజమానులు కోర్టులకు వెళ్తున్నారు. లోకల్‌ కోర్టులకు వెళ్ళకుండా చేసి భూవివాదాలకు సరైన పరిష్కారాలు చూపని అధికారులనే ఈ బాధ్యతలలో నియమించే అవకాశం ఈ చట్టం కల్పించుతున్నది. జిల్లా అప్పిలేట్‌ అధికారుల తీర్పులపై హైకోర్టులకు వెళ్ళవలసి వస్తుంది. ఇది సామాన్యులకు సాధ్యం అయ్యేదికాదు.

ఎంతో కాలంపైగా చెట్టుపుట్ట చదును చేసుకున్న వాళ్ళు వివిధ సేవలందిస్తూ ఎలాంటి భూ యాజమాన్య కాగితాలు లేనివాళ్ళు ఆ భూముల నుండి గెంటి వేయబడతారు. గ్రామీణ, పట్టణ భూయజమాన్యలందరూ వారి భూ ఆధారాలను సమర్పించమంటున్నది. దీనితో వారి ఎజెండా ప్రారంభమవుతుంది.

కొత్త వివాదాలను సృష్టిస్తూ, పేద ప్రజలను ఆ భూములనుండి తరిమివేస్తూ, న్యాయం కోసం స్థానిక కోర్టులకు వెళ్ళకుండా చేసే ఈ ప్రజావ్యతిరేక ‘‘భూహక్కుల చట్టాన్ని’’ రద్దు చేయాలి. దీనికోసం రైతులు, పట్టణ ప్రజలు, లాయర్లు చేస్తున్న ఆందోళనకు సిపిఎం మద్దతు తెలుపుతున్నది.

= = = =