వాహనాల ఫిట్‌నెస్‌ ప్రక్రియ ప్రయివేటీకరణను, వాహనదారులపై భారాలను వ్యతిరేకించండి.. ఫిబ్రవరి 16 రైతు సంఘాలు, కార్మిక సంఘాల దేశావ్యాపిత నిరసనోద్యమానికి సీపీఐఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : 

విజయవాడ,

తేది : 06 ఫిబ్రవరి, 2024.

 

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు నిన్న, ఈరోజు (5,6 ఫిబ్రవరి) విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు  వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి  హాజరయ్యారు. సమావేశం ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం పంపుతున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

తీర్మానం -1

వాహనాల ఫిట్‌నెస్‌ ప్రక్రియ ప్రయివేటీకరణను, 

వాహనదారులపై భారాలను వ్యతిరేకించండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని రవాణా శాఖ ద్వారా వాహనదారులపై భారీగా భారాలు వేస్తున్నారు. ఫిట్నెస్‌( బ్రేక్‌) సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను జిల్లాల వారీగా బడా కంపెనీలకు కట్టపెట్టేందుకు టెండర్లు పిలవడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోవడం శోచనీయం. ఫిట్నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేయటానికి చెల్లించాల్సిన ఫీజులను భారీగా పెంచుతూ ఆదేశాలు ఇవ్వటం గర్హనీయం. ఈ పెంపుదల వలన వాహనదారులపై వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుంది. ఇప్పటికే మోటార్‌ వాహనాల పన్ను, గ్రీన్‌ టాక్స్‌, టోల్‌ టాక్స్‌, భారీ పెనాల్టీలతో రవాణా రంగాన్ని, వాహనదారులను దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు ఫిట్నెస్‌ పేరుతో 700, 900 రూపాయలు ఉన్న ఫీజులను 12 వేల నుండి 15 వేల రూపాయల వరకు పెంచడం దారుణం. రాష్ట్రంలోని ఒక కోటి 46 లక్షల వాహనదారులందరిపై ప్రతి సంవత్సరం ఈ భారం పడుతుంది. ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలు ,స్వంత కార్లు,ఇతర రవాణా యేతర వాహనాలకు ఫిట్నెస్‌ సర్టిఫికెట్లు అవసరం లేదు. కానీ తాజాగా ద్విచక్ర వాహనాలతో సహా అన్ని వాహనాలను ఫిట్నెస్‌ సర్టిఫికెట్ల పరిధిలోకి తీసుకురావడం శోచనీయం. ద్విచక్ర వాహనాలకు 800 నుండి 1900 వరకు, ఆటోలు,త్విచక్ర వాహనాలకు 1200 నుండి 5300 రూపాయలు వరకు, కార్లు ఇతర లైట్‌ వాహనాలపై 1800 నుండి 9300, మధ్య స్థాయి వాహనాలపై  1800 నుండి 12000,భారీ వాహనాలపై 1800 నుండి 15000 రూ’’ భారం వేస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం వలన ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే కాకుండా మరిన్ని రెట్లు అధికంగా వసూలు చేసే ప్రమాదం ఉంది. ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్ల పేరుతో ప్రైవేట్‌ సంస్థలకు ఫిట్నెస్‌ సర్టిఫికెట్ల ప్రక్రియ మొత్తాన్ని కట్టబెడుతున్నారు.

వైసీపీ పార్టీ పెద్దలు, ప్రజా ప్రతినిధులు ఈ టెండర్లను దక్కించుకొని, కోట్లాది రూపాయలు సంపాదించటానికి పావులు కదుపుతున్నారు. బినామీ పేర్లతో టెండర్లు దాఖలు చేశారు, నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతల బినామీలకే టెండర్లు కట్టబెట్టాలని ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. రాబోయే కాలంలో జిల్లాల వారీగా భారీగా ఫీజులు దండుకునే ప్రమాదం ఉంది. రవాణా శాఖలో అవినీతిని అరికట్టాల్సిన ప్రభుత్వం, అవినీతికి చట్టబద్ధత కల్పిస్తున్నది, అవినీతిని వ్యవస్థీకృతం చేస్తున్నది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను డీలర్లకే కట్టబెట్టడం వల్ల 400 రూపాయలు ఉన్న రిజిస్ట్రేషన్‌ ఫీజులు మూడు వేల నుండి 5వేల రూపాయలు వరకు పెరిగాయి, నియంత్రణ లేకుండా పోయింది. ఫిట్నెస్‌ సర్టిఫికెట్ల జారీ ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టడం వలన గుడ్డిగా డబ్బు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేసే ప్రమాదం పొంచి ఉన్నది. దీనితో మరింత ప్రమాదాలు పెరుగుతాయి. రవాణా శాఖ పూర్తిగా నిర్వీర్యం మవుతుంది జవాబుదారీతనం లేకుండా పోతుంది. ప్రైవేట్‌ సంస్థల దోపిడీకి అడ్డు అదుపు ఉండదు. రవాణా రంగం ఇప్పటికే కుదేలయ్యింది, కేంద్ర ప్రభుత్వం మోటార్‌ వాహన చట్ట సవరణ ద్వారా భారీగా పెనాల్టీలు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం అని పేరు చెబుతూ’’ వాహన శత్రు ‘‘ప్రభుత్వం లాగా వ్యవహరిస్తున్నది. తమిళనాడు, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలు ఫిట్నెస్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్‌ సంస్థలకు అప్పజెప్పటానికి అంగీకరించలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి పూర్తిగా లొంగిపోయి, వాహనదారులను బలి తీసుకుంటున్నది. ఈ టెండర్ల ప్రక్రియను  రద్దు చేయాలి, పాత రేట్లకే ప్రభుత్వమే రవాణా శాఖ ఫిట్నెస్‌ సర్టిఫికెట్లు జారీచేయాలి.

ద్విచక్ర, నాన్‌ ట్రాన్స్పోర్ట్‌ వాహనాలను ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ పరిధిలోకి తీసుకురాకుండా నివారించాలి, గతంలో ఉన్న పద్ధతే కొనసాగించాలి. టెండర్లు రద్దు, భారీగా పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. వాహనదారులందరూ ఉద్యమంలో కలిసి రావాలి.

 

తీర్మానం -2

ఫిబ్రవరి 16 రైతు సంఘాలు, కార్మిక సంఘాల 

దేశావ్యాపిత నిరసనోద్యమానికి 

సీపీఐఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16వ తేది దేశావ్యాపిత నిరసనోద్యమానికి రైతు, కార్మిక సంఘాల సంయుక్త వేదికలు ఇచ్చిన పిలుపును సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

2020-21వ సంవత్సరంలో డిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోడీ మద్దతు ధరల చట్టాన్ని తీసుకువస్తామని, విద్యుత్‌ సవరణ బిల్లు రైతుసంఘాలతో చర్చించిన తరువాత పార్లమెంటులో  ప్రవేశ పెడతామని ఇచ్చిన హామీ అమలు చేయాలని, కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26,000/` నిర్ణయించి అమలు చేయాలని, మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశావ్యాపిత నిరసనోద్యమానికి సంయుక్త కిసాన్‌ మోర్చా (రైతుసంఘాల ఐక్యవేదిక), టియు (కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక) పిలుపు ఇచ్చాయి.

ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఉపాధి హామి చట్టాన్ని  బలోపేతం చేయాలని, కనీస వేతనం రూ.600 ఇస్తూ, 200 రోజులు పని కల్పించాలి. పట్టణ పేదలకు అమలు చేయాలి. రైతులు, కౌలు రైతుల రుణాలు మాఫీ చేయాలని, సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో వ్యవసాయ రంగానికి కేటాయించిన నిధులలో లక్ష కోట్లు ఖర్చు చేయకుండా ఖాజానాకు తిరిగి జమ చేసుకుంది.

రైతులు పండిరచిన పంటలకు మద్దతు ధరలు అమలు చేయకపోవటంతో, రైతాంగం అప్పుల ఊబిలో కూరుకొనిపోయింది. లక్షమందికి పైగా రైతులు ఆత్మహత్యలకు బలి అయ్యారు. కార్పొరేట్‌ కంపెనీలకు 15 లక్షల కోట్ల రూపాయలు రాయితీలుగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేసేందుకు నిరాకరిస్తున్నది.

ఈ పరిస్థితులల్లో ఫిబ్రవరి 16న దేశావ్యాపితంగా నిరసనోద్యమానికి రైతు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపును సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా బలపరిచింది. రాష్ట్ర ప్రజలందరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని, సంఫీుభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

= = = =