![](https://cpimap.org/sites/default/files/WhatsApp%20Image%202024-02-05%20at%2016.41.15.jpeg)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 05 ఫిబ్రవరి, 2024.
(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు, రేపు (5,6 ఫిబ్రవరి) విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రచురణార్థం పంపుతున్నాము.
- జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
తీర్మానం
ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై
ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయాలి
నూటికి 97 శాతం హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కార్మికులు, ఉద్యోగులకిచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదు. ఇప్పటికైనా ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలు అమల్లోకి తెచ్చేందుకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం ప్రకటన చేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్రంలోని 3 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తానని హామీ ఇచ్చింది. కానీ అమలు చేయలేదు. విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలైన డైరెక్ట్ పేమెంట్, రెగ్యులరైజేషన్ అమలు చెయ్యలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అందర్ని రెగ్యులరైజ్ చేయాలని, సమానపనికి సమాన వేతనం అమలుచేయాలని సి.పి.ఐ.(యం) పార్టీ డిమాండ్ చేస్తున్నది. వారంలో సిపిఎస్‌ను రద్దు చేసి ఓపిఎస్‌ను ఇస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయకపోగా తద్వారా జిపిఎస్ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పటికైనా ఒపిఎస్‌ను పునరుద్దరించి ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10,177 మందిని మాత్రమే రెగ్యులర్ చెయ్యటానికి ఉత్తర్వులు ఇచ్చింది. కాని ఆ ఉత్తర్వులు ఇంకా అమలు కాలేదు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ మరియు గ్రామ పంచాయితీ వంటి స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, టిటిడి, ప్రభుత్వ సొసైటీలు, ప్రభుత్వ పథకాలలోని కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, డైలీవేజ్, కంటింజెంట్, మినిమం టైంస్కేల్ సమగ్రశిక్ష, నేషనల్ హెల్త్‌మిషన్, ఉపాధి హామి, వెలుగు తదితర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం అమలు చెయ్యకపోగా కనీసం మినిమం టైంస్కేల్ ను కూడా అమలు చెయ్యలేదు. నెల నెలా కనీసం వేతనాలను కూడా రెగ్యులర్‌గా చెల్లించడం లేదు. కనీసం హెచ్‌ఆర్ పాలసీని కూడా రూపొందించలేకపోయింది.
రాష్ట్రంలోని 70 షెడ్యూల్డ్ పరిశ్రమలలోని 50 లక్షల మంది కార్మికులకు ఒక్కరంగంలో కూడా కనీస వేతనాలు సవరణ జరగలేదు. చట్ట వ్యతిరేకంగా దారిమళ్ళించిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను వెంటనే బోర్డుకు చెల్లించాలి, సంక్షేమ పథకాలు అమలు కోనసాగించాలి. నిలుపుదల చేసిన కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను కొనసాగిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి. రాష్ట్రంలోని హమాలీలు, ట్రాన్స్‌పోర్టు తదితర అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటుచేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
= = = =