
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
తేది : 31 జనవరి, 2024.
విజయవాడ,
శ్రీయుత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : వి.వో.ఏ, ఆర్.పి.ల కోర్కెలు పరిష్కరించాలని కోరుతూ...
అయ్యా!
గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్‌లోను, పట్టణాలలో మెప్మాలలో, మహిళా సాధికారత సంస్థ గ్రామ, పట్టణ స్థాయిలో వి.వో.ఏ., ఆర్.పి.లతో రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ళ తరబడి పనిచేయించుకుంటున్నది. ఉద్యోగ భద్రత కల్పిస్తామని మీరు హామీనిచ్చారు. కానీ మూడు సంవత్సరాలు దాటినవారి స్థానంలో కొత్తవారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వి.వో.ఏ.లను, ఆర్.పి.లను వీధులపాలు చేస్తుంది. వెంటనే ఈ సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరుతున్నాను. కాలపరిమితిని రద్దు చేయాలని, హెచ్.ఆర్.పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్స్యూరెన్సు పథకం అమలు చేయాలని, వి.వో.ఏ.ల మెర్జ్ ఆపాలని తదితర కోర్కెలతో ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు. వి.వో.ఏ.ల, ఆర్.పి.ల సంఘాల నాయకులను పిలిచి చర్చించి వారి కోర్కెలు పరిష్కరించాలని కోరుతున్నాను.
లక్షలాది మంది పేద మహిళలను కూడగట్టి, పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను నిరంతరం శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. 18 రకాల మొబైల్ యాప్స్ ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వర్క్‌తో పనిభారం తీవ్రమైంది. మొబైల్స్, నెట్ బ్యాలెన్సు ఇవ్వకపోవడంతో సొంత డబ్బులే ఖర్చు చేస్తున్నారు. డ్వాక్రా సభ్యులతో మహిళా మార్టుల్లో సరుకుల కొనుగోళ్ళకు టార్గెట్స్ పెట్టడం వలన వి.వో.ఏ.లతో బలవంతపు అమ్మకాలు చేయిస్తున్నారు. ఆర్.పి.లకు వేతన గ్యారెంటీ కూడా లేదు. ఫెర్‌ఫార్మన్స్ పేరుతో కొద్ది అమౌంట్ చేతిలో పెడుతున్నారు. ఇన్ని బాధ్యతలు నెరవేర్చుతున్నా వి.వో.ఏ., ఆర్.పి.ల సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని, పరిష్కరించడం లేదు. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. కరెంటు ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి కుటుంబ జీవనం భారంగా మారింది.
ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు :
(1) కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి.
(2) హెచ్.ఆర్.పాలసీ అమలు చేయాలి.
(3) 10 లక్షల గ్రూప్ ఇన్స్యూరెన్సు సౌకర్యం కల్పించాలి.
(4) వి.వో.ఏ.ల మెర్జ్ ఆపాలి, అన్ని రకాల బకాయిలు చెల్లించాలి.
(5) 15 సంఘాలలోపు ఉన్న వి.వో.ఏ.లకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలి.
(6) వి.వో.ల మెర్జ్ వలన ఉపాధి కోల్పోయిన వి.వో.ఏ.లకు నష్టపరిహారం ఇవ్వాలి. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ సమాఖ్యల వి.వో.ఏ.లకు వేతనాలు ఇవ్వాలి.
(7) బ్యాంకు అక్కౌంట్ సరిగ్గా లేవన్న పేరుతో రెండున్నరవేల మందికి చాలా కాలంగా జీతాలు వేయలేదు. ఆ బకాయిలు చెల్లించాలి.
(8) పొదుపు సంఘాలకు రూ.5 లక్షలకు వడ్డీ రాయితీ ఇవ్వాలి.
(9) రూ.20 లక్షల వరకు సున్నా వడ్డీ వర్తింపజేయాలి.
(10) డ్వాక్రా సభ్యులతో బలవంతపు కొనుగోళ్ళు చేయించరాదు.
మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పై సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి