నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న అంగన్‌వాడీలకు అభినందనలు..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 జనవరి, 2024.

 

నిర్భంధాన్ని ఎదిరించి కోర్కెలు సాధించుకున్న 

అంగన్‌వాడీలకు అభినందనలు

అంగన్‌వాడీ ఉద్యోగులు గత 42 రోజులుగా మొక్కవోని పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని, కుయుక్తులను సైతం ఎదుర్కొని సమ్మెను జయప్రదం చేసి, తమ కోర్కెలు సాధించుకున్నందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేస్తున్నది. సమ్మెకు సంఫీుభావం ప్రకటించిన సంఘాలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నది. ప్రభుత్వం జీతాలు పెంచడానికి అంగీకరించి అంగన్‌వాడీ సంఘాలతో ఒప్పందం చేయడం హర్షణీయం. అంగీకరించిన అంశాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నది. ఎటువంటి కక్షసాధింపులకు పాల్పడకుండా ఉద్యోగుల హక్కులను గౌరవించాలని కోరుతున్నాం.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు జరపమని గత 42 రోజులుగా సమ్మె చేసిన కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక విధాలుగా అంగన్‌వాడీలు నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించిన రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలయ్యింది. లబ్దిదారులు, ప్రజలు ప్రభుత్వ చర్యలను నిరసించి ఉద్యోగులకు అండగా నిలబడ్డారు. ఎస్మాను ధిక్కరించి నిలబడ్డారు. కలెక్టర్లు నోటీసులిచ్చినా అంగన్‌వాడీలు బెదరలేదు. తిరిగి సమాధానమిచ్చారు.  ఉద్యోగాలు పీకివేస్తామని, కొత్త రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటామని నోటీసులిచ్చి, భయపెట్టి, బెదిరించినా లొంగలేదు.విజయవాడ ధర్నాచౌక్‌ శిబిరంలో మహిళలని చూడకుండా అర్థరాత్రి చీకటిలో, మగపోలీసులతో నానా భీభత్సం సృష్టించి అరెస్టులు చేసి, 200 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళి నడిరోడ్డుపై వదిలివేశారు. చివరకు యూనియన్‌ లేకుండా చేయాలని రకరకాల కుయుక్తులు పన్నారు.

ఇన్నిరకాల నిర్బంధాలను, రాష్ట్ర ప్రభుత్వ కుయుక్తులను సంఘం అండతో ఉమ్మడిగా ఉద్యోగులంతా ఒక్కటై ఎదిరించడం అభినందనీయం. కార్మికుల ఐక్యత, ఇతర సంఘాల, రంగాల కార్మికుల సంఫీుబావం, ప్రజల మద్దతు అవసరమని అంగన్‌వాడీ సమ్మె తెలియజేస్తున్నది. సమ్మెకు మద్దతు తెలియజేసిన ప్రజానీకానికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి