కేంద్ర ఎన్నికల కమీషన్‌ అధికారులకు, కొత్తగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయుట గురించి...

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 09 జనవరి, 2024.

కేంద్ర ఎన్నికల కమీషన్‌ అధికారులకు,

విషయం : కొత్తగా పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయుట గురించి...

ఆర్యా!

(1) పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కురుపాం మండలం ఎగులవాడ పంచాయతీలో రజ్జలి పోలింగ్‌ స్టేషన్‌ ఉన్నది. ఈ పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు వేయడానికి ఇప్పలగుడి, కొర్రండా గూడ, సెంట్రల్‌ గూడ, బొత్తిలి గ్రామాల ప్రజలు 30 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉన్నది. ఇక్కడ 200 మంది ఓట్లు వేసే ప్రజలు ఉన్నారు. మధ్యలో కొండ ఉండడం వలన ఇంతదూరం వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. అందుకని ప్రతి ఎన్నికలలోనూ కేవలం 10 శాతం మందిమాత్రమే ఓట్లు వేస్తున్నారు. మిగిలిన 90% మంది ఓట్లు వేయలేకపోతున్నారు. కాబట్టి పై నాలుగు గ్రామాలకు బొత్తిలిలో కొత్త పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తే ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది.  (దీనిపై మా పార్టీ జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్‌కి తేది. 23.09.2023వ తేదీన మెమోరాండం ఇచ్చి ఉన్నారు. స్థానిక  ఎంఆర్‌వో మా ప్రతిపాదన తిరస్కరించారు. మెమోరాండం కాపీ జతపరుస్తున్నాము) కాబట్టి బొత్తిలిలో పోలింగ్‌  స్టేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.

(2) ఎ) అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండలంలో పెద్ద అంజోడ, చిన్న అంజోడ, సంతినగర్‌, శిమిలిగూడ, తోకవలస గ్రామాల్లోని ప్రజలు సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి కోరై  గ్రామంలో ఓటు వేస్తున్నారు. ఇక్కడ పోలింగ్‌శాతం తక్కువ. కాబట్టి పెద్ద అంజోడ గ్రామంలో కొత్తగా పోలింగ్‌ బూత్‌  పెట్టినట్లయితే పోలింగ్‌ శాతం పెరుగుతుంది. కాబట్టి పెద్ద అంజోడ గ్రామంలో పోలింగ్‌ బూత్‌ పెట్టాలని కోరుతున్నాము.

(బి) డుంబ్రిగూడ మండలం గసబా పంచాయతీలో కంగారుసోల, జోడిగూడ, కూడ, గారెడెలి గ్రామాలకు సుమారు 300 ఓట్లకుపైగా ఓటర్లు ఉన్నారు. వీరు 10 కిలోమీటర్ల దూరంలోగల నోగెలి బూత్‌లో వచ్చి ఓట్లు వేస్తున్నారు. కావున కంగారుసోల గ్రామంలో కొత్తగా పోలింగ్‌ బూత్‌ పెట్టినట్లయితే పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది.  కావున కంగారు సోలలో కొత్తగా పోలింగ్‌ బూత్‌ పెట్టాల్సిందిగా కోరుతున్నాము.

(సి) ముంచంగిపుట్టు మండలంలో రంగబయలు గ్రామ పంచాయతీలో గోబోర్‌పడ, జొడిగొమ్మ, కోసంపట్టు, బుద్దపనస,  నువగోడ, జరెల్‌పోదర్‌ గ్రామాలకు సుమారు 500కు పైగా ఓటర్లు ఉన్నారు. వీరు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి లంగవపోదర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేస్తారు. రంగబయలులో రెండు పోలింగ్‌ బూత్‌లు కొత్తగా ఏర్పాటు చేయడం ద్వారా పోలింగ్‌ శాతం పెరుగుతుంది. లేని పక్షంలో ఈ గ్రామాల ప్రజలకు వాహన, భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తే పోలింగ్‌ శాతం పెరుగుతుంది. కాబట్టి ఎలక్షన్‌ కమిషన్‌ పరిశీలన చేసి తగు పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము.

(డి) అరకువేలి మండలం సుంకరమెట్ట పంచాయతీ కె.బెడ్డగూడ, లింబగూడ, దోబురంగిని గ్రామాలలో సుమారు 300లకు పైగా ఓటర్లు ఉన్నారు. వారందరూ ఏడు కిలోమీటర్ల దూరమైన సుంకరమెట్ట బూత్‌లోకి వెళ్ళి ఓట్లు వేస్తున్నారు. వారందరికీ దగ్గరైన బెడ్డగూడ గ్రామంలో బూత్‌ ఏర్పాటు చేసినట్లయితే ఓట్లు శాతం పెరిగే అవకాశం ఉన్నది.

(ఇ) అరకువేలి మండలం బొండంబూత్‌లోని సుమారు 50 మంది ఓటర్లు 3 కిలోమీటర్ల దూరమైన ఆర్‌కె నగర్‌  బూత్‌లోకి వెళ్ళి ఓట్లు వేస్తున్నారు. వారికి దగ్గరైన బొండం బూత్‌లో ఓట్లు వేసే విధంగా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాము.

 

(వై.వెంకటేశ్వరరావు)

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

 

(కిల్లో సురేంద్ర)

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

 

(జె.జయరాం)

రాష్ట్ర కమిటీ సభ్యులు