రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి.

విలేకర్ల సమావేశం ` 19 డిసెంబర్‌, 2023 ` విజయవాడ

 

రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

అంగన్‌వాడీల సమ్మె 8వ రోజుకు చేరింది. అంగన్‌వాడీ అక్కాచెల్లెమ్మలు చేస్తున్న సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. 18వ తేదీన రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం అంగన్‌వాడీ కేంద్రాలను బలవంతంగా తెరవాలన్న రాష్ట్ర ప్రభుత్వ యత్నాలను తీవ్రంగా ఖండిరచింది. ఈ సమావేశంలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యం.ఏ.బేబి హాజరయ్యారు. తల్లులు, ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాతంత్రవాదులు ఈ పోరాటానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణివల్లే ఈరోజు రాష్ట్రంలో ఉన్న 55,605 అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. లక్ష మంది పైగా అంగన్‌వాడీ మహిళలు వీధుల్లోకి వచ్చారు. దాదాపు 32 లక్షల మంది పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలుకు ఆటా పాటా, ఆహారం, ఆరోగ్యం  దూరం చేస్తున్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం 2011 నుండి వేతనాలు పెంచలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు తదితర న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కారం చేయాలని గత 8 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వమే జటిలంచేసే చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వలన ఈ కాలంలో గ్యాస్‌, నిత్యవసర సరుకులు, కరెంటు చార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ చార్జీలు విపరీతంగా పెరిగాయి. కానీ అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు.

గత నాలుగు సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని, ఇతర  సమస్యలు పరిష్కారం చేయాలని అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చి దశలవారీగా అనేక ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదు. అనివార్యంగా డిసెంబర్‌ 12 నుండి రాష్ట్రంలో ఉన్న లక్ష మంది పైగా అంగన్‌వాడీలు తమ సెంటర్లను మూసేసి సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే అంగన్వాడీ యూనియన్ల నాయకులను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము.

అంగన్‌వాడీలు దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల పిల్లలకు సేవలు అందిస్తున్నారు. గర్భిణీ, బాలింతలకు ఆహారంతో పాటు ఆరోగ్య సలహాలు సేవలు అందిస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో పేదలు పనులకు వెళ్లడానికి కూడా పిల్లలను చూసుకునే వాళ్ళు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఒకవైపు చర్చలకు ఆహ్వానిస్తూ రెండోవైపు ప్రభుత్వ అధికారులే అంగన్‌వాడీ సెంటర్ల  తాళాలు పగలగొడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రులు లేకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ అంగన్‌వాడీలను అవమానిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తూ సమ్మె విరమించకపోతే విధులకు గైర్హాజరైనట్లుగా భావించి కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం,  బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అంగన్వాడీలకు ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారని నోరు అదుపులేకుండా మాట్లాడటం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే  అంగన్‌వాడీలు ఆందోళన చేస్తున్న టెంట్లు పీకేయడం వంటి అప్రజాస్వామ్యక చర్యలు మానుకోవాలని కోరుతున్నాం.

అక్క చెల్లెమ్మలంటూ సమస్య పరిష్కారం చేయకుండా ప్రభుత్వమే తాళాలు పగలగొట్టడం, ప్రభుత్వ జులుం ప్రదర్శించడం, అన్ని డిపార్టుమెంట్ల వాళ్ళని రంగంలోకి దించడం మిగిలిన పనులన్నీ ఆగిపోయే ప్రమాదం ఏర్పడిరది.  ఒక శాఖ ఉద్యోగులకు వ్యతిరేకంగా మరో శాఖ వారిని ఉసిగొల్పడం దారుణం. మిగిలిన ప్రజలకు అందించాల్సిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు, పోలీస్‌ యంత్రాంగం మొత్తం అంగన్‌వాడీ సెంటర్ల చుట్టూతిప్పటం వలన పరిపాలన స్తంభించే ప్రమాదం ఏర్పడిరది. అంగన్‌వాడీ సెంటర్లు తెరవద్దని మద్దతు తెలియజేసిన లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు కట్‌చేస్తాం, అమ్మఒడి, పెన్షన్‌ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించడం బాధ్యతగల ప్రభుత్వం చేయాల్సిన పనికాదు. ఇప్పటికైనా బేషజాలంకు పోకుండా ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది.