జమ్ము కాశ్మీర్‌ బిల్లులను వైఎస్‌ఆర్సిపి పార్లమెంట్లో బలపరచినందుకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు 

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ 

ప్రచురణార్ధం/ప్రసారార్ధం : విజయవాడ,

తేది : 12 డిసెంబర్‌, 2023.

 

      రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర నిరంకుశత్వాన్ని రుద్దుతున్న జమ్ము కాశ్మీర్‌ బిల్లులను వైఎస్‌ఆర్సిపి పార్లమెంట్లో బలపరచటాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ అప్రజాస్వామిక బిల్లులను బలపరచడమే కాకుండా మొత్తం కాశ్మీర్‌ చరిత్రనే వక్రీకరించి ఆర్‌ఎస్‌ఎస్‌ వాదనను పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి వినిపించారు. బిజెపి ముస్లిం వ్యతిరేకతను గుడ్డిగా విజయసాయిరెడ్డి కూడా తలకెక్కించుకున్నట్లు కనిపిస్తోంది. ఇది దేశ చరిత్రను, స్వాతంత్ర ఉద్యమాన్ని పక్కదారి పట్టించటమే. జమ్మూ కాశ్మీర్‌ బిల్ల్లులో అసెంబ్లీలో నామినేషన్‌ పద్ధతి ద్వారా కేంద్రమే ఎమ్మెల్యేలను నియమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రజా తీర్పులను అపహాస్యం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలను తమ గుప్పెట్లో పెట్టుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు రాష్ట్రాల అసెంబ్లీలకు శాసనసభ్యులను నామినేషన్‌ చేయటం రాష్ట్ర ప్రభుత్వాల హక్కుగా ఉంది. దాన్ని ఈ చట్టం ద్వారా కేంద్రానికి బదలాయించుకుంది. ఇది మొత్తం ప్రజాస్వామ్య విలువలను, ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీసే చర్య. దీన్ని పార్లమెంట్లో విజయసాయిరెడ్డి వెనకేసుకురావడం హానికరం. జమ్ము కాశ్మీర్‌ శరణార్థుల గురించి మాట్లాడే సమయంలో రాజా హరిసింగ్‌ను ఆయన కొనియాడటం చరిత్రను వక్రీకరించటమే. రాజ హరిసింగ్‌ తొలుత స్వతంత్ర కాశ్మీర్‌ను ప్రకటించుకున్నాడు. ఆయన మూలంగానే ఆక్రమిత  కాశ్మీరు (పీఓకే) పాకిస్తాన్‌కు వెళ్లిపోయింది. ఆ తర్వాత మాత్రమే కాశ్మీర్‌ భారతదేశంలో విలీనం అయింది. షేక్‌ అబ్దుల్లా ప్రజలను కూడగట్టి జమ్ము కాశ్మీర్‌ భారతదేశంలో విలీనంలో ముఖ్యపాత్ర పోషించాడు. పాకిస్తాన్‌లో కలవకుండా భారత దేశంలో కలిసినందుకు వారి ప్రత్యేక హక్కులను కొన్ని గుర్తిస్తూ 370 ఆర్టికల్‌ రాజ్యాంగంలో చేర్చబడిరది. ఈ వాస్తవాలు ఏమీ విజయసాయిరెడ్డి గుర్తించకపోవడం అన్యాయం. పైగా పురాతన చరిత్రలో జరిగిన ఘోరాలు పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ వక్రీకరించిన చరిత్రను విజయసాయిరెడ్డి వల్లె వేయడం వైఎస్సార్‌సిపి స్వభావాన్ని ప్రశ్నిస్తున్నది. ఇప్పటికైనా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పార్లమెంటులో గట్టిగా నిలబడాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు కృషి చేయాలని బిజెపికి వంత పాడటం మానుకొని ప్రజల తరఫున నిలబడాలని కోరుతున్నాము.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి