కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలి.. కళ్యాణమస్తు రూ.5 లక్షలకు పెంచాలి కరువులో చిక్కుకున్న రైతు, కూలీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలి.- సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 నవంబర్‌, 2023.

 

(సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈ రోజు (24 నవంబర్‌) పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడ (బాలోత్సవ భవనం)లో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు యం.ఏ.బేబి హాజరయ్యారు. సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలను ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. 

 

తీర్మానం - 1

కులాంతర వివాహాలకు రక్షణ కల్పించాలి 

కళ్యాణమస్తు రూ.5 లక్షలకు పెంచాలి - సిపిఐ(యం) డిమాండ్‌

కళ్యాణమస్తు, తోఫా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానా కంటితుడుపు చర్య. కులాంతర వివాహం చేసుకున్న దళిత, ఆదివాసీలకు రూ.75 వేల నుండి 1.20 లక్షలు చేసినట్లు ప్రకటించడం యువతను తప్పుదారిపట్టించడమే. వాస్తవానికి మన ఇరుగు పొరుగు రాష్ట్రాలన్నింటిలోనూ ఇది 2.5 లక్షలుగా ఉంది. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలంటే వారిపై సాగుతున్న దాడులను, అణచివేతను అరికట్టాలి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కులదురహంకార (పరువు) హత్యలు జరుగుతున్నాయి. కులం పేరుతో రాక్షసంగా మారి స్వంత బిడ్డల్నే హతమారుస్తున్నారు. వీటిని అరికట్టడానికి ప్రభుత్వ చర్యలు శూన్యం. ప్రత్యేకంగాచట్టం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. కులాంతర వివాహాలు చేసుకున్న వారికిచ్చే సహాయాన్ని ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నది. అదే విధంగా భార్య భర్తలలో ఏ ఒక్కరికి ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం కల్పించాలి. ఇంటిస్థలం ఇచ్చి పక్కా గృహం నిర్మించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 

తీర్మానం - 2

కరువులో చిక్కుకున్న రైతు, కూలీలను

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ఆదుకోవాలి.

రాష్ట్రంలో సుమారు 300 పైగా మండలాలలో తీవ్రమైన కరువు ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 103 మండలాలను మాత్రమే కరువుగా ప్రకటించింది. వర్షాభావం వల్ల ప్రస్తుత ఖరీఫ్‌లో 85.97లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా 60.22 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. సాగుభూమిలో 25.75 లక్షల (30%) ఎకరాల్లో పంటలు వేయలేదు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వర్షాలు రాకపోవడంతో రాయలసీమ, కోస్తా ప్రాంతంలోని అత్యధిక జిల్లాల్లో సాగైన పంటలు కూడా చేతికి అందలేదు. తీవ్రమైన కరువు వల్ల ఉపాధి లేక లక్షలాది మంది పేదలు వలసలుపోయారు. కౌలుదారులు తీవ్రంగా నష్టపోయారు. కరువు పరిస్థితుల పట్ల సకాలంలో స్పందించి పంటల నష్టాన్ని అంచనా వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఖరీఫ్‌ కరువు ప్రకటనకు చివరి రోజైన అక్టోబర్‌ 31న హడావుడిగా 103 మండలాలను  మాత్రమే కరువు మండలాలుగా ప్రకటన చేసింది. కాబట్టి సమగ్ర సమాచారంతో కరువు నెలకొన్న అన్ని మండలాలలను ప్రకటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

ముఖ్యమంత్రి సొంత కడప జిల్లాలో 17 మండలాలలో కరువు పరిస్థితులు ఉంటే ఒక్క మండలాన్ని కూడా  ప్రకటించలేదు. ప్రకాశం జిల్లాలో 38 మండలాలకు గానూ 30 మండలాలు తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి, అయినా ఒక్క మండలాన్ని కూడా ప్రకటించలేదు. బాపట్ల జిల్లాలో అద్దంకి, కొరిశపాడు, బల్లికురువ, సంతమావులూరు, పంగులూరు, మార్టూరు వంటి 6 మండలాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఉన్నాయి, అయినా కరువు మండలాల ప్రకటనలో చేర్చలేదు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాలకు 18 మండలాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి, కానీ ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. ఏలూరు జిల్లాలో చింతలపూడి, చాట్రాయి, వేలేరుపాడు, కుక్కనూరు వంటి 4 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు వున్నాయి.  మరొక 7 మండలాలు పాక్షికంగా కరువు వాత పడ్డాయి. అయినా కరువుగా గుర్తించలేదు. సత్యసాయి జిల్లాలో 31 మండలాలలో కరువు ఉంటే కేవలం 21 మండలాలనే ప్రకటించి 11 మండలాలను విస్మరించారు. అనంతపురం జిల్లాలో 3 మండలాలను విస్మరించారు. నెల్లూరు జిల్లాలో 38 మండలాలలో 20 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి.

కౌలురైతులకు సహాయం అందాలి

కరువు అంచనాల నిబంధనలను నవంబర్‌ 14న జీవో 5ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం రైతులకు కరువు సహాయం నామమాత్రంగా అందే అవకాశం ఉంది. ఉదా: వేరుశెనగ ఎకరా సాగుకు రూ. 35 వేలు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం మాత్రం రూ. 6800 ల కరువు సహాయం చేయనుంది. ఇతర పంటలకు చెల్లించే నష్టపరిహారం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పంటల నష్టం ఆధారంగా పరిహారం చెల్లించాలి. పంటల పెట్టుబడి కోసం బ్యాంకులు ఇస్తున్న స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఆధారంగా పరిహారం ఇవ్వాలి. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పరిహారం చెల్లించాలి. కరువు మండలాల్లో వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు 200 రోజులు కలిపించి రోజుకు రూ. 600లు వేతనం ఇవ్వాలి. కరువు ప్రాంతాలలో ఆహార ధాన్యాలు ఉచితంగా అందించాలి. రైతు బ్యాంకు అప్పులను మాఫీ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కలిపించాలి. ప్రభుత్వం విస్మరించిన అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

= = = =