పాలస్తీనాది స్వతంత్ర పోరాటం...

 

పాలస్తీనాది స్వతంత్ర పోరాటం

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి 

ఉగ్రవాదంతో పోల్చడం సరికాదు

బిజెపి రాబందుల పార్టీ : బి.వి.రాఘవులు

ప్రజా ప్రణాళిక అమలుకు విస్తృత ఉద్యమాలు : వి.శ్రీనివాసరావు

 

పాలస్తీనా ప్రజలది దేశం కోసం జరిగే స్వతంత్ర పోరాటమని, దాన్ని ఉగ్రవాద చర్యతో పోల్చడం సరికాదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబి, బి.వి.రాఘవులు తెలిపారు. గురువారం ఉదయం విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి వారు మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ ఏకపక్ష దాడులు జరుపుతోందని, దాన్ని అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు సమర్థించడం, రెచ్చగొట్టడం సరైంది కాదని అన్నారు. భారతదేశం తొలి నుండీ పాలస్తీనాకు సంఫీుభావంగా నిలిచిందని, ఇప్పుడు ప్రధాని ఇజ్రాయెల్‌ దాడి చేయడం సరికాదంటున్నారు తప్ప ఆపాలని కోరడం లేదని విమర్శించారు. గతంలో జర్మనీలో హిట్లర్‌ ఎలాంటి ఊచకోతకు పాల్పడ్డారో అలాంటి చర్యకు ఇప్పుడు గాజాలో ఇజ్రాయిల్‌ అలా చేస్తోందిని తెలిపారు. చరిత్రలో అక్కడ పాలస్తీనా మాత్రమే ఉందని, అనంతరం ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారని, ఇప్పుడు పాలస్తీనానే లేకుండా చేయాలని చూస్త్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుండి అక్టోబర్‌ నెలవరకూ ఇజ్రాయిల్‌ సాయుధులు 248 మంది పాలస్తీనా ప్రజలను కాల్చి చంపారని, అందులో 40 మంది పిల్లలు కూడా ఉన్నారని దీన్నెవరూ ప్రశ్నించడం లేదని అన్నారు. దాడులను భరించలేని పాలస్తీనాలోని హమాస్‌ బాంబుదాడికి దిగితే దాన్ని సాకుగా చూపి ఇప్పుడు పాలస్తీనా ప్రజలపై మారణహోమం సృష్టిస్తున్నారని అన్నారు. ఆస్పత్రులపైనా దాడులకు దిగుతున్నారని, దీన్ని ప్రపంచంలో అన్ని దేశాలూ వ్యతిరేకించాలని కోరారు. ఇజ్రాయిల్‌ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసే నాటికి ఎక్కువమంది పాలస్తీనా ప్రజలు ఉన్నారని, అధికభాగం భూమి వారి చేతిలోనే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయిల్‌ ఆక్రమణలోకి వెళ్లిందని తెలిపారు. ఉన్నకొద్దిపాటి భూమిని కూడా ఆక్రమించేస్తున్నారని అన్నారు. ఇజ్రాయిల్‌ అనుసరిస్తున్న ఫాసిస్టు పద్దతులకు ఆర్‌ఎస్‌ఎస్‌ పద్ధతులూ ఒకేలా ఉన్నాయని, అందువల్లే ఇజ్రాయిల్‌ దాడులపై మోడీ నోరెత్తడం లేదని అన్నారు. విశ్వగురువు అని చెప్పుకుంటూ ఇజ్రాయిల్‌ యుద్ధనేరాలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. పాలస్తీనాలో అమాయకులను చంపడం బాధాకరమని, స్థానికంగా జరుగుతున్న యుద్ధం ఆ ప్రాంతమంతా విస్తరించే ప్రమాదం ఉందని చెప్పడం వరకే మోడీ పరిమితం అవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అక్కడ కాల్పుల విరమణకు భారతదేశం డిమాండ్‌ చేయాలని, వైద్య సాయం అందించేలా చూడాలని ఇజ్రాయిల్‌ దురాక్రమణ నుండి పాలస్తీనాను విముక్తి చేయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా అదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబరు 7న జరిగిన ఘటన ఇజ్రాయిల్‌ దురాక్రమాలవల్లే జరిగిందని అక్కడి మీడియా కూడా ప్రస్తావించిందని తెలిపారు. అయినా అమెరికా నిస్సిగ్గుగా దాడులకు వంతపాడుతోందని విమర్శించారు.    ఇజ్రాయిల్‌ యుద్ధం ఆగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడుతుందని, ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారని, అటువంటప్పుడు యుద్ధాన్ని ఆపేదిశగా ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రచురించిన ‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ యుద్ధం’ బుక్‌లెట్‌ను వారు ఆవిష్కరించారు. 

బిజెపి రాబందుల పార్టీ

కేంద్రంలో బిజెపి పాలనలో రాబందులు రాజ్యమేలుతున్నారని, ప్రజలను పీడిరచుకుని దోచుకుతినడం, వారి అనుకూలురకు దోచిపెట్డం చేస్తున్నారని ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు వామపక్షాలను పిట్టలతో పోల్చారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ పిట్టలు సమాజానికి మేలు చేస్తాయని, రాబందులకు పీక్కుతినడం, నాశనం చేయడం తప్ప మరొకటి తెలియదని అన్నారు. ఉత్తరాఖండ్‌ సొరంగం ఘటనలో కేంద్రం ఎందుకు వేగంగా స్పందించడం లేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అందులో చిక్కుకున్న వారు సురక్షితంగా ఉండటం సంతోషమని పేర్కొన్నారు. ఇంతపెద్ద ఘటన జరిగినా ప్రభుత్వం ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదని సిపిఎం ప్రశ్నించిందన్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయని, జోషిమఠ్‌లో నేల కుంగిపోయిందని తెలిపారు. హిమాలయాలు నీటివనరులు, పర్యావరణ పరిక్షణకు ముఖ్యమని, వాటితో ఆటలాడుకుంటే కుదరదని అన్నారు. పర్యాటకం పేరుతో కాంట్రాక్టర్లకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తూ ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారని, దీన్ని నియంత్రించాలని కోరారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని తెలిపారు. సమగ్ర ధృక్పథంతో అక్కడ ప్రకృతి ధ్వంసాన్ని ఆపాలని సిపిఎం కోరుతోందన్నారు. బిజెపి ప్రభుత్వం లాభానికి ప్రాధాన్యత ఇస్తోంది తప్ప ప్రకృతిని పట్టించుకోవడం లేదని అన్నారు. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సిపిఎం ముందే హెచ్చరించిందని, గోదావరి అత్యంత సంక్లిష్టమైనదనే విషయాన్ని గుర్తు చేసిందని అన్నారు. అనేకమంది పర్యావరణ వేత్తలూ అదే అంశాన్ని స్పష్టం చేశారని, వాటిని లెక్క చేయకుండా ప్రాజెక్టుకు డిజైన్లు ఇచ్చారని విమర్శించారు. ఈ విషయంలో రాష్ట్రానికి ఎంత బాధ్యత ఉందో కేంద్రానిదీ అంతే బాధ్యతని ప్రధాని సమాధానం చెప్పాలని అన్నారు. ఐదేళ్లలో పోలవరం కడతామన్నారని, ఇంకో 30 సంవత్సరాలు గడిచినా అది పూర్తి కాని వాతావరణం కనిపిస్తోందని అన్నారు. 

ఇండియా వేదికతో పోరాటాలకు బలం 

ఇండియా వేదిక వల్ల బిజెపి వ్యతిరేకపోరాటాలకు బలం చేకూరిందని రాఘవులు తెలిపారు. అంతకు ముందు వేర్వేరుగా ఉన్న పార్టీలు ఒక వేదిక మీదకు వచ్చాయని తెలిపారు. ఆయా పార్టీల మధ్య గతంలో విబేధాలు అత్యంత తీవ్రంగా ఉన్నాయని, మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడని పార్టీలు వైరుధ్యాన్ని క్రమంగా తగ్గించుకుంటూ ఒక వేదికపైకి వచ్చాయని తెలిపారు. తెలంగాణాలో వామపక్ష పార్టీగా సిపిఐకి తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అయితే కాంగ్రెస్‌తో కలిసి సిపిఐ ముందుకు వెళుతున్న నేపథ్యంలో సిపిఎం అభ్యర్థులకు మద్దతు ఇస్తారా లేదా అనేది వారు నిర్ణయించుకోవాలని అన్నారు.  

ప్రజా ప్రణాళిక అమలుకు కృషి

రాష్ట్రంలో ప్రజారక్షణ భేరి విజయవంతమైందని, అందరితో సంప్రదించిన తరువాత ప్రజా ప్రణాళిక అమలుకు కార్యాచరణ ప్రకటిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి కరెంటు కన్నా వేగంగా వ్యాపిస్తోందని, దీనివెనుక అధికార పార్టీ పెద్దలతో కూడిన మాఫియా, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నారని అన్నారు. వైద్య కళాశాలల్లో విద్యార్థుల మధ్య ఘర్షణలు దీనిలో భాగమేనని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కాలానికి నిస్సత్తువైన యువత వస్తుందని తెలిపారు. దీనిపై తక్షణం స్పందించి  ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. చిన్న చిన్న అంశాలపై బృందాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం గంజాయి నియంత్రణపై ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో గంజాయి ఉత్పత్తి కేంద్రంగా మన రాష్ట్రమే ఉందనే ప్రచారం జరుగుతోందని అన్నారు. 

కరువు మండలాల్లో సహాక చర్యలు లేవు 

రాష్ట్రంలో కరువు మండలాలుగా ప్రకటించిన వాటిల్లోనూ ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కృష్ణా డెల్టాలోనూ పంటలు వేయలేదని, వీటిని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. కళ్లు మూసుకుని అంతా బావుందని చెబితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.  కరువు పరిశీలనకు కేంద్రం కూడా ఇంతవరకు బృందాలను పంపలేదని పేర్కొన్నారు. సిఎం మాత్రం  రాష్ట్రంలో కరువులేదు అంతా సుభిక్షంగా ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు.