ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కు సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శుల లేఖ..

గౌరవనీయులైన సంపాదకులకు, ఆంధ్రజ్యోతి,ఏపీ ఎడిషన్‌.

నమస్కారం,

ఈరోజు అనగా 19 నవంబర్‌ 2023 తేదీ ఏపీ ఎడిషన్‌లో జగన్‌మోహన్‌రెడ్డి భూపంపిణీ కార్యక్రమాన్ని విమర్శిస్తూ భూములపై బొంకులు అంటూ మీరు ప్రచురించిన మొదటి పేజీ బ్యానర్‌ ప్రత్యేక కథనంలో ఆంధ్రప్రదేశ్‌లో వినోబా భావే టైంలోనే లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్టు రాశారు. జగన్‌మోహన్‌రెడ్డి అబద్దాలను సరిదిద్దే పేరుతో మరో అబద్ధాన్ని మీరు ప్రచారంలో పెట్టడం న్యాయం కాదు. అందువల్ల ఈ క్రింది వాస్తవాలను మీ పత్రికలో ప్రచురించాలని కోరుతున్నాము.

‘‘ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ముందుకు తెచ్చిన భూపంపిణీ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు వినోబాభావే భూదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూస్వాములు దయతో భూములు ఇచ్చినట్లు ప్రకటించిన వాటిని ఎక్కడా పంచలేదు. ఇప్పటికీ భూస్వాముల ఆధీనంలోనే ఉన్నాయి. లేదా వివాదాల్లో ఉన్నాయి. ఎవరికీ చెందని ప్రభుత్వ భూములను కూడా భూదానం పేరుతో పెంచినట్లు ప్రచారం చేశారు తప్ప ఒక్క ఎకరా కూడా పేదలకు దక్కలేదు. మన రాష్ట్రంలో 1940 నుండి 15 సంవత్సరాల పాటు భూపోరాటాలు జరిగాయి. ఆ తర్వాత మరల 1960-70లో కూడా జరిగాయి. చల్లపల్లి జమీందారు సహా అనేక భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో కమ్యూనిస్టులు ముఖ్య పాత్ర వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు తదితర నాయకులు వీటికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. పేదలు ఎర్రజెండాలు నాటి ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. నూజివీడు తాలూకాలో 1960వ సంవత్సరం నుండి కమ్యూనిస్టు పార్టీ నాయకులు దాసరి నాగభూషణరావు, చలసాని జగన్నాధ రావు, బొడ్డు దేవ సుందరం ల నాయకత్వంలో బంజర భూముల ఆక్రమణ ఉద్యమాన్ని నిర్వహించి వేలాదివేకరాల బంజరు భూములను పేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ భూములకు 1969 - 70 సంవత్సరాలలో 15 వేల ఎకరాలకు ఆనాటి కలెక్టర్‌ ఆర్కే వేపా అసైన్మెంట్‌ పట్టాలను మంజూరు చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగా అనివార్యమై ఆ భూములకు తర్వాత అక్కడక్కడ పట్టాలు ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గారు నూజివీడులో ఆ భూములకు శాశ్వత పట్టాలను మంజూరు చేయటం మాత్రమే జరిగింది. వాస్తవాలు ఇవి కాగా కమ్యూనిస్టులు చేసిన పోరాటాన్ని విస్మరించి భూ పంపిణీ వినోబాభావే సాగించినట్లు చెప్పటం చరిత్రను వక్రీకరించటమే. రాష్ట్రంలో ఎక్కడ వినోబాభావే భూములు పంచారో, అవి ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో ఒక ఉదాహరణ ఇచ్చినా సంతోషిస్తాము.

ఈనాటికి అసైన్డ్‌ భూములు వేలాది ఎకరాలు పేదల చేతుల నుండి ఆన్యాక్రాంతమైనా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దురాక్రణ దారులకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా కొమ్ముకాశాయి. వాటికోసం పోరాటాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం తెచ్చిన జీవో కూడా అన్యాక్రాంతమైన భూములకు చట్టబద్ధత కల్పించడానికి తప్ప పేదలకు పెద్దగా ఉపయోగపడదు. మీరు రాసినట్లుగా జగన్‌మోహన్‌రెడ్డి తానే భూములు పంచినట్లు అబద్ధాలు చెబుతున్నారనేది వాస్తవం. అది అబద్దం అని చెబుతూ ఆంధ్రజ్యోతి మరో అబద్ధాన్ని ప్రజలపై రుద్దడం న్యాయం కాదు. చరిత్రను వక్రీకరించకుండా ప్రజలకు వాస్తవాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.’’

అభివందనములతో...

(కె.రామకృష్ణ)

రాష్ట్రకార్యదర్శి

సిపిఐ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

సిపిఐ(యం)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ