ప్రజా ప్రణాళికను, ప్రజలకు వివరిస్తాం.. 15న ప్రజారక్షణ భేరి సభను జయప్రదం చేయండి

స్వతంత్ర పునాది పెంచుకుంటాం
వైసిపి, టిడిపి, జనసేనలు బిజెపి విష కౌగిలినుండి బయటపడాలి
ప్రజా ప్రణాళికను, ప్రజలకు వివరిస్తాం
15న ప్రజారక్షణ భేరి సభను జయప్రదం చేయండి
సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విస్మరించాయని, ఈ నేపథ్యంలో సిపిఎం ప్రజా ప్రణాళికను రూపొందించిందని, దీన్ని బుధవారం విజయవాడలో జరిగే బహిరంగసభలో ప్రజలకు వివరిస్తామని, దీని ద్వారా ప్రజా పునాదిని పెంచుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విజయవాడ ఎంబివికెలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.వి.కృష్ణ, దోనేపూడి కాశీనాథ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజా పరిరక్షణ సభ సందర్భంగా రూపొందించిన క్లాత్‌ బ్యానర్లను ఆవిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఎజెండానూ ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళతామని తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతాలు నిర్వహించామని, ప్రజలు అనేక సమస్యలు వివరించారని తెలిపారు.
బిజెపి పాలనలో విలపిత భారత్‌ 
కేంద్రంలో బిజెపి మోడీ ప్రచారం కోసం వికసిత భారత్‌ పేరుతో ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులతో కేంద్ర పథకాలకు, ఆ పేరుతో మోడీకి ప్రచారం చేయిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకులుగా మారుస్తోందని విమర్శించారు. ఇప్పుడు దేశంలో వికసిత భారత్‌ లేదని, విలపిత భారత్‌ ఉందని ప్రజలు బాధల్లో ఉంటే విలాసవంతంగా ఉన్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ప్రజలు ఈ మోసాన్ని ప్రశ్నించాలని కోరారు. మోడీ పాలనలో మాటలు తప్ప చేతలు లేవని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. కృష్ణా జలాల విషయంలో తీరని ద్రోహం చేస్తున్నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్ష టిడిపి ప్రశ్నించడం లేదని విమర్శించారు. ప్రశ్నించడానికే పుట్టిందన్న జనసేన తెలంగాణాలో బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళుతోందని తెలిపారు. ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు నడుపుతోందని వివరించారు. బిజెపి, కాంగ్రెస్‌కు సమాన దూరంలో ఉంటామని చెబుతున్న టిడిపి ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. ఈ నాలుగు పార్టీలు ప్రజల ఎజెండాను పక్కనబెట్టి సొంత ఎజెండాను నడుపుతున్నాయని తెలిపారు. 
నిజంగా పనులు చేస్తే జగన్‌ ప్రచారం ఎందుకు
రాష్ట్రంలో వైసిపి ‘వైఎపి నీడ్స్‌ జగన్‌’ పేరుతో ప్రచారం చేస్తోందని, నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలే నమ్ముతారని, ఇంటింటికీ పోయి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఒక వ్యక్తి మొత్తం వ్యవస్థను తలకిందుకు చేస్తారా అని ప్రశ్నించారు. చేసిన వాగ్దానాలు అమలు చేసి చెబితే ప్రజలు నమ్ముతారని తెలిపారు. సిపిఎం యాత్ర 26 జిల్లాల్లో పర్యటించిన సమయంలో అన్నిచోట్లా జగన్‌ పాలనలో అభివృద్ధి లేదని అన్నారు. 
రోడ్లు, తాగునీరు, పనీ ఏమీలేవు
రాష్ట్రంలో రోడ్లు బాగోలేదని, తాగేందుకు మంచినీరు లేదని, ఉపాధి హామీ పని కూడా లేదని, అదే సమయంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరెంటు ఛార్జీలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, మూడు నెలల్లో బిల్లులు రెట్టింపు అవుతున్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు స్మార్ట్‌ మీటర్లు పెడతామని చెబుతున్నారని, ఇది మరింత భారమని పేర్కొన్నారు. అల్లూరు, పార్వతీపురం జిల్లాల్లో ఎక్కడా నాడునేడుగానీ, జగనన్న ఇళ్లు గానీ లేవని తెలిపారు. ఆదివాసీలకు ఇచ్చిన పట్టాలకు భూములు కూడా చూపించే దిక్కులేదని, వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. పాఠశాలలు కూలిపోయేదశలో ఉన్నాయని, ఆల్లూరి సీతారామరాజు జిల్లాలో 100 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అంబులెన్సులో పోయే రోడ్డులేదని, అదానీ కోసం రూ.500 కోట్లతో అడవిలో హైవే వేస్తున్నారని విమర్శించారు. అక్కడ జనం మాత్రం గ్రామాలకు రోడ్లు వేయాలని కోరుతున్నారని అన్నారు. గర్భిణులు జబ్బు చేస్తే ఆస్పత్రికి వెళ్లే దారిలోనే చనిపోతున్నారని అన్నారు. అల్లూరు జిల్లా డుంబ్రిగూడలో వంతెన కడితే రెండు కిలోమీటర్లలో మండల కేంద్రానికి వస్తారని రెండు కోట్లు పెట్టి వంతెన కట్టేందుకు సిద్దపడం లేదన్నారు. దీనివల్ల 30 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోందని పేర్కొన్నారు. అదానీకి భూములు ఇచ్చేందుకు కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించలేదని గిరిజనులను అమానవీయంగా భూముల నుండి గెంటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగేందుకు నీరులేక చెలమల్లో తెచ్చుకుంటున్నారని తెలిపారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కనీసం గౌరవించలేదని, అవమానించారని  అంటే దేశ ప్రజలను అవమానించడమేనని తెలిపారు. కేంద్రం ట్రైబల్‌ సబ్‌ప్లాను అమలు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో అసమానతలు లేని అభివృద్ధి పేరుతో ప్రజా ప్రణాళికలను ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. 

బూతులు తిట్టుకోవడమే వారి అజెండా
రాష్ట్రంలో పాలకులు అభివృద్ధి మానేసి బూతులు తిట్టుకుంటున్నారని, వారి బూతులతో డిక్షనరీ తయారు చేయొచ్చని అన్నారు. ప్రజల సంక్షేమం కంటే వ్యక్తిగత తిట్లకు విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇక్కడ అవినీతిపై ఫిర్యాదు చేశానని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి చెబుతున్నారని, మరి కేంద్ర హోంశాఖ, సిబిఐ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బిజెపి నాయకులకే కేంద్రం స్పందించకపోతే సామాన్యులకు ఏం చేస్తుందని మండిపడ్డారు. ఇటువంటి బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన మద్దతు ఇవ్వడం పచ్చి అవకాశవాదమని అన్నారు. ఇప్పటికైనా ఆయా పార్టీలు బిజెపిని వదిలి బయటకు రావాలని కోరారు. 
10 గంటలకు ప్రదర్శన
ప్రజారక్షణ భేరిలో ప్రదర్శనలో భాగంగా 15వ తేదీ ఉదయం 10 గంటలకు బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఫుడ్‌ జంక్షన్‌ నుండి ప్రదర్శన ప్రారంభమవుతుందని, 11 గంటలకు మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో సభ ప్రారంభమవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు తెలిపారు. సభ విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నగరంలో అన్నికూడళ్లలో తోరణాలు ఏర్పాటు చేశామని, 15వ తేదీన వచ్చేవారికోసం మంచినీరు, వాహనాల పార్కింగు స్థలాన్ని సిద్ధం చేశామని తెలిపారు. ప్రజానాట్యమండలి కళాకారులు అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌, ఎస్‌.పుణ్యవతి, సీనియర్‌ నాయకులు పి.మధు ప్రసంగిస్తారని తెలిపారు. వీరితోపాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి, సిహెచ్‌.బాబూరావు, కె.ప్రభాకరరెడ్డి, వి.వెంకటేశ్వర్లు, కె.లోకనాథం, కిల్లో సురేంద్ర ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని, దాన్ని మద్దతు దారులను ఓడించాలని , రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్బంధ విధానాలను విడనాడాలని, సిపిఎంను బలపర్చాలని, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్థిల్లాలనేది ప్రధాన డిమాండ్లని తెలిపారు