బిజెపితో మూడు ప్రాంతీయ పార్టీల మ్యాచ్‌ ఫిక్సింగ్‌

బిజెపితో మూడు ప్రాంతీయ పార్టీల మ్యాచ్‌ ఫిక్సింగ్‌

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

కరువుపై సిఎం ప్రకటన హాస్యాస్పదం

15న ప్రజారక్షణ భేరిని జయప్రదం చేయాలి

వైసిపి సాధికారత నేతి బీరకాయ 

దళితులు, గిరిజనుల భూములు లాక్కుంటూ సామాజిక సంహరిస్తోంది.

తెలంగాణా ఎన్నికల్లో టిడిపి వైఖరి స్పష్టం చేయాలి.

 

రాష్ట్రంలో వైసిపి, జనసేన, టిడిపి, బిజెపి కలిసి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని, విచిత్ర రాజకీయ పరిస్థితి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు పార్టీల మధ్య మాయ నడుస్తోందని అన్నారు. వైసిపి, బిజెపి నేతలు రాష్ట్రంలో తిట్టుకుంటున్నారని, కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైసిపి పరస్పరం సహకరించుకుంటున్నాయని, మద్దతు ఇచ్చుకుంటున్నాయి. ఇదేమీ రాజకీయమని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ మూడోసారి మోడీ ప్రధాని కావాలని, అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, అదే బిజెపి ఇక్కడ వైసిపి ప్రభుత్వాన్ని నడిపిస్తోందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో వైసిపితో పోరాడుతున్నామని చెబుతున్న జనసేన కేంద్రంలో బిజెపితో కలిసి పనిచేస్తోందని, ఇక్కడ తెలుగుదేశంతో కలిసి రాజకీయ ప్రచారం చేస్తోందని, తెలుగుదేశం కూడా జనసేనతో కలిసి నడుస్తామని చెబుతోందని అన్నారు. తెలంగాణాలో తెలుగుదేశం పోటీచేయడం లేదని చెబుతుంటే దానితో ఎపిలో కలిసి పనిచేస్తున్న జనసేన అక్కడ బిజెపితో ఎన్నికల్లోకి వెళ్లిందని, ఎన్‌డిఏ కూటమిలోనూ ఉందని, ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు బిజెపి పట్ల వారి వైఖరి ఏమిటో చెప్పాలన్నారు. తెలంగాణా ఎన్నికల్లో టిడిపి వైఖరి స్పష్టం చేయాలని కోరారు. మహిళలు, దళితులు, మైనార్టీలు, ఆదివాసీలను అణచివేస్తున్న బిజెపికి మద్దతు ఇవ్వడం ద్వారా వారికి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అన్ని సందర్భాల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న బిజెపితో కలిస్తే ప్రజలకు న్యాయం చేయలేరని అన్నారు. 

మరోవైపు రాష్ట్రంలో సాధికారత పేరుతో వైసిపి చేస్తున్న యాత్ర నేతిబీరకాయ లాంటిదని, అందులో నెయ్యి ఎంత ఉంటుందో వీరి యాత్రలోనూ అంతే సాధికారత ఉంటుందని విమర్శించారు. ఏజెన్సీలో పోడు భూములపై గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చారని, అక్కడ నుండి కూడా వెళ్లగొడుతున్నారని తెలిపారు. అటవీశాఖ అధికారులు గిరిజనులపై దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం చూస్తు ఊరుకుందని విమర్శించారు. ఈ భూములను పంప్డ్‌ స్టోరేజీ పేరుతో విద్యుత్‌ ఉత్పత్తికి అదానీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గ్రామసభలు జరపకుండా అంగుళం కూడా ఇవ్వబోమని గిరిజనులు తెగేసి చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములు ఉంటే వాటిపై పోరాడుతున్న దళితులకు పట్టాలు ఇవ్వకుండా సాధికారత ఎక్కడని ప్రశ్నించారు. పేదలకు భూ పంపకం, కనీస వేతనం, ఉపాధి కల్పన ఉంటేనే సాధికారత అన్నారు. ఆర్థిక సాధికారత కల్పించకుండా కార్పొరేషన్‌ పదవులు ఇస్తే వారు కార్లలో తిరగడం తప్ప ప్రజలకు జరిగే న్యాయం ఏమిటో చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ వైసిపి వాళ్లు సామాజిక సాధికార యాత్ర పేరుతో  హడావుడి చేస్తూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలను ఉద్దరిస్తామని చెబుతున్నారని కానీ కార్యక్రమంలోగానీ, చేసిన పనుల్లో సామాజిక న్యాయం లేదని విమర్శించారు. ఇప్పటికీ గ్రామాల్లో దళితులకు శ్మశానవాటికలు లేవని తెలిపారు. 1235 జిఓను అమలు చేయకుండా సామాజిక సాధికారత గురించి మట్లాడటం హాస్యాస్పదం అన్నారు. భూమిలేక పేదలు ఎక్కువ మంది కూలీ పనులు వెళిపోతున్నారని, అటువంటి వారందరిలో ఎక్కువమంది దళిత, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని, వారికి భూమిపై హక్కు కావాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకుండా, ఉపాధి లేకుండా సాధికారత ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికీ హమాలీలు, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనంతో బతుకుతున్నారని, కనీస వేతనాలు అప్‌డేట్‌ చేయలేదని రూల్స్‌ ఫ్రేం చేయలేదని మండిపడ్డారు. ట్రైబల్‌ప్లాను, దళిత సబ్‌ప్లాను అమలు చేయలేదని, దళితులు, గిరిజనులకు ప్రత్యేకంగా ఏమి చేశారో చెప్పాలనీ ప్రశ్నించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు మళ్లించారని, చట్ట ప్రకారం దళిత, గిరిజన ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేయకుండా, అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైసిపి ఫ్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో సామాజిక సంహారం జరుగుతోంది తప్ప సాధికారత లేదని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మహిళలు, వివిధ రూపాల్లో వెనుకనబడి సామాజిక తరగతులను కేంద్రం అడ్డగోలుగా అచణివేస్తుంటే వైసిపి ప్రభుత్వం కేంద్రానికి ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు.

ప్రజల ఎజెండాను హైజాక్‌ చేస్తున్నారు

ప్రజా సమస్యలు పట్టించుకోక పోగా అసలు ఏజెండాను పక్కదారి పట్టించి ప్రజల అజెండాను హైజాక్‌ చేస్తున్నారని, దాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజా ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలు నిర్వహించేందుకే ప్రజా రక్షణ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీన్ని విజయవంతం చేయాలని కోరారు. 

యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయ చర్యలు చేపట్టాలి

రాష్ట్ర వ్యాప్తంగా 300 మండలాల్లో కరువు ఉందని, మంచినీరు లేదని, ఉపాధి లేదని అన్నారు. చాలాచోట్ల ఇప్పటికే పనులు నిలిపేశారని పేర్కొన్నారు. ఇంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ప్రజలు అలమటిస్తుంటే కరువేలేదని సిఎం ప్రకటన చేయడం హాస్యాస్పదం అన్నారు. వర్షాభావంతోపాటు కృష్ణాడెల్టాలోనూ పంటలు ఎండిపోతున్నాయని, నదుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయని తెలిపారు. విజయవాడ సమీపంలో ఉన్న పెనమలూరు మండలంలోనే పంటలు ఎండిపోతున్నాయని, అవనిగడ్డ లాంటి మండలాల్లో పరిస్థితి చెప్పలనవి లేకుండా ఉందని తెలిపారు. ఇంత ఉన్నా దీనిపై పరిశీలనకు కేంద్ర బృందం రాలేదని తెలిపారు. కరువు గుర్తింపు, సహాయక చర్యలకు సంబంధించి మాన్యువల్‌ మార్చాలని అన్నారు. పంటలు ఎండిపోయినా, కరువు, ఉపాధి, మంచినీరు లేకపోయినా కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. అక్టోబరులో పంట ఎండి పోయిందని, రబీకి నీరు లేదని అన్నారు. 28 లక్షల ఎకరాల్లో పంటలు పండలేదని తెలిపారు. కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా కళ్లుమూసుకుని అంతా సుభిక్షంగా ఉందని జపం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. 

 

రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారక్షణ భేరి యాత్రలు నిర్వహించాము. 26 జిల్లాల్లో 250 మండలాల్లో  120 నియోజకవర్గాల్లో 3500 కిలోమీటర్లు ప్రయాణించి 150కిపైగా సభలు నిర్వహించామని తెలిపారు. లక్షమందికిపైగా ప్రజలు పాల్గన్నారని తెలిపారు. ఈ సభలు అన్నిట్లోనూ ప్రజలు వివిధ తరహా భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక సామాజిక పరిస్థితులున్న ప్రాంతాల్లో పర్యటించామని తెలిపారు. బిజెపిపై యువతలో తీవ్ర ఆగ్రహం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర అసంతృప్తి ఉందని, ఇది ఏ రూపం తీసుకుంటుందనే చూడాలని తెలిపారు. ప్రజలపై అనేక భారాలు పడ్డాయని, కరెంటు ఛార్జీల భారాన్ని ప్రజలు ప్రతిచోట నిరశిస్తున్నారని తెలిపారు. తమ భేరీ సాగుతున్న అనేకచోట్ల శ్మశాన వాటికలు కూడా లేవని తెలిపారు.