భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 07 నవంబర్, 2023.
సత్యసాయి జిల్లాలో అసత్యాలా?
రైతు భరోసా బటన్ నొక్కుతూ ఈరోజు పుట్టపర్తిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఉపన్యాసం అసత్యాలతో, అతిశయోక్తులతో కూడి ఉన్నదని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఏలూరు జిల్లా చింతలపూడిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన పేరుతో ఎనిమిది మంది సిపిఎం నాయకుల్ని అక్రమంగా ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ప్రతిపక్షాలనందరినీ అరెస్టుచేసి అధికారపార్టీ వ్యవహారంలాగా ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించటం అధికార దుర్వినియోగమే అవుతుందని, ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం చేసుకోవడం అక్రమమన్నారు. బ్యాంకులకు దాదాపు వెయ్యికోట్లు డిఫాల్టు అయిన ఎమ్మెల్యేను పక్కన పెట్టుకొని అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
కరువుపై కళ్ళూ, చెవులూ మూసుకున్న ముఖ్యమంత్రి
ఒకవైపు పుట్టపర్తి తో సహా రాష్ట్రం అత్యధిక భాగం కరువు కాటకాలతో తల్లడిల్లుతుంటే రాష్ట్రంలో కరువు లేదు సుభిక్షంగా ఉందని చెప్పటం రోమ్ చక్రవర్తి తరహాలో ఉందన్నారు. ప్రభుత్వమే 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. పుట్టపర్తి చుట్టు పక్కల మండలాలు, పక్కనే ఉన్న అనంతపురం జిల్లాలో అత్యధిక మండలాలు కరువుతో అల్లాడుతున్నాయి. పంటలు ఎండిపోయాయి. తాగటానికి నీరు లేదు. 28 లక్షల ఎకరాల్లో ఈ సంవత్సరం పంట వేయలేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. కానీ ముఖ్యమంత్రికి ఇవేమీ కనిపించడం లేదు. వినిపించడం లేదని వ్యాఖ్యానించారు. రైతులకు తానేదో చాలా పెద్ద సహాయం చేస్తున్నట్టు 13,500 అకౌంట్‌లో వేసి పండగ చేసుకోమనటం గర్హనీయమన్నారు. ఈరోజు ప్రతిరైతు ఎకరాకు 25వేల నుండి 50వేల వరకు పంట నష్టపోయారు. కృష్ణా గోదావరి డెల్టాలోని ఖరీఫ్ పంట ఎండిపోయి ధాన్యం దిగుబడి తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రబీకి ఏం చేయాలో రైతులకు తోచటం లేదు. విత్తనం నుండి అమ్మకం వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందన్న ముఖ్యమంత్రి ఈ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయ్యాయి అన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. గిట్టుబాటు ధరలు లేక సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. పక్కనే ఉన్న కేరళలో ధాన్యం రైతుకి క్వింటాలుకు 800 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నరేటు కూడా అమలు కావడం లేదని విమర్శించారు. మిల్లు యజమానులు రైతులనుంచి అదనంగా కలెక్ట్ చేస్తున్న విషయం తెలిసి కూడా ప్రభుత్వం మిన్నకుండి పోతున్నది. ఈ సంవత్సరం కరువు వచ్చి పంటలు ఎండిపోయి వేలకోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగింది. ఈ వాస్తవాన్ని విస్మరించి తానేదో ఘనంగా రైతులను ఉద్దరిస్తున్నానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా కరువు మండలాల్లో సహాయ కార్యక్రమాల్ని ప్రకటించి ప్రతి ఎకరాకు 25 వేలు చొప్పున పరిహారం అందించాలని, బీమా, ఇన్పుట్ సబ్సిడీ అమలు చేయాలని కోరారు.
కౌలు రైతులకు అన్యాయం
ప్రత్యేకించి కౌలు రైతులకు ఎలాంటి సహాయం అందడం లేదు. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలు రైతులు ఉండగా లక్షన్నర మందికే రుణాలు ఇచ్చారు. అందులో సగం బినామీ రుణాలు. కౌలు రైతుల పేరుతో భూ యజమానులే అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కనీసం మాటమాత్రంగా కూడా ఈ సభలో ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం కౌలు రైతుల పట్ల ముఖ్యమంత్రి వివక్షతకు అద్దం పడుతున్నదన్నారు. యజమానులకు అనుకూలంగా చట్టాన్ని సవరించిన ముఖ్యమంత్రి కి కౌలు రైతులకు జరుగుతున్న అన్యాయం తెలియదనుకోలేము. తక్షణం కౌలు రైతులకు ఈ- క్రాప్ చేసి అందరికీ భరోసా సహా కరువు సహాయం అందేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాలకు బోనస్ ఎక్కడ?
పాలకు నాలుగు రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు అమూల్‌ద్వారా కొనిపిస్తున్నా ఎక్కడా రైతుకు గిట్టుబాటు కావడంలేదు. సహకార డైైరీలను, సంఘాలను నిర్వీర్యం చేసింది. రైతుల ఆస్తుల్ని అమూల్‌కు అప్పజెప్పి ఉద్దరిస్తానని చెప్పడం అన్యాయమన్నారు.
విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు
పగటిపూట 9 గంటలు కరెంటు ఇస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి, ఆందోళనతో రైతులు రోడ్డుకెక్కిన విషయం ఆయనకు వినపడలేదా అని అన్నారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి