(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 05 నవంబర్, 2023.
శ్రీయుత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 516ఇ) - బాధిత ఆదివాసీలకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ...
అయ్యా!
విజయనగరం నుండి రాజమండ్రి వరకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 156ఇ) నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, జికెవీధి, కొయ్యూరు మరియు రాజవోమ్మంగి 11 మండలాల్లో రహదారి నిర్మాణ పనులను గుత్తేదారులు ప్రారంభించి 30% పనులు పూర్తి చేశారు.
ముఖ్యంగా జిరాయితీ పట్టా భూమి, అటవీ పోడు భూములు కలిపి సుమారు 50 ఎకరాలు రహదారికి ఇరువైపులా ధ్వంసం చేశారు. ఆదివాసీలకు అటవీ పోడు భూములే ప్రధానమైన జీవనాధారం. కాఫీ తోటలు, వరి, రాజ్‌మా చిక్కుడు, పసుపు పంట సుమారు 1500 మంది సాగుచేస్తున్నారు. 2005 సంవత్సరాని కన్నా ముందు అటవీ ప్రాంతంలో జీవిస్తున్న, సాగుచేస్తున్న ఆదివాసీలకు వ్యక్తిగత, ఉమ్మడి అటవీ యాజమాన్యపు హక్కును కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. 10 ఎకరాలకు తక్కువ లేకుండా వ్యక్తిగత అటవీహక్కు పత్రాలు జారీచేయవలసిన అధికారులు హక్కు పత్రాలు లేవని మాయమాటలు చెప్పి బలవంతంగా లాక్కొన్నారు. త్రాగునీరు పైపు మరియు గ్రామ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశారు.
జి.కెవీధి మండలం, పెదవలస పంచాయితీ (4), సంకడ పంచాయితీ (6), రింతాడ పంచాయితీ (4) గ్రామాల్లో వున్న స్థానిక ఆదివాసులు జాతీయ రహదారి నిర్మాణంలో సాగు భూమి కోల్పోయిన వారికి నేటికి నష్టపరిహారం చెల్లించలేదని సిపిఐ(యం) ప్రజారక్షణ భేరి బృందానికి వినపత్రాలు సమర్పించారు.
5వ షెడ్యూల్డ్ ఏరియాలో భూసేకరించేందుకు కనీసం ఆదివాసీ గ్రామసభ (పీసా) అభిప్రాయం, ఆమోదం కూడా తీసుకోలేదు. అటవీహక్కుల కమిటీ (ఎఫ్‌ఆర్‌సి) తీర్మానం కూడా లేకుండా వందలాది ఎకరాల కాఫీ తోటలు, పచ్చన చెట్లను కూడా తొలగిస్తున్నారు. కనీసం రహదారి నిర్మాణ బాధితుల జాబితా వివరాలను కూడా పంచాయితీ, సచివాలయం కేంద్రంలో ప్రదర్శించలేదు.
అమాయకమైన ఆదివాసీలపై ఎన్‌హెచ్516ఇ ఆధికారుల దౌర్జన్యాలపై, నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి. బాధితులకు అటవీహక్కుల చట్టం ప్రకారంగా పోడు వ్యవసాయానికి భూమి కేటాయించాలి. తక్షణమే గ్రామసభ నిర్వహించి బాధితుల జాబితాను ప్రకటించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని మంజూరు చేయాలి. మీరు జోక్యం చేసుకొని బాధిత ఆదివాసీలకు న్యాయం జరిగేట్లు చూడాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి