భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 04 నవంబర్, 2023.
చిత్తశుద్ధి ఉంటే కులగణనకు చట్టబద్దత కల్పించాలి
తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
కుల గణన చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అయితే దీనికి చట్టబద్ధత కల్పించాలి. లేకుంటే కేవలం బీసీలను మోసం చేయడానికి ఎన్నికల జిమ్మిక్కులుగా భావించాల్సి ఉంటుంది. అలాగే కులగణనను ఆర్థిక సామాజిక సర్వే రూపంలో వాలంటీర్లు చేత డేటా సేకరించబోతున్నట్టుగా చెప్పడాన్ని బట్టి చూస్తుంటే ఇది కుల అసమానతలు తగ్గించే చర్యగాకాక తక్షణ ఎన్నికల రాజకీయ ప్రయోజనాలకోసం బిసిలను మభ్య పెట్టడానికి చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. జాతీయస్థాయిలో జనగణనతో పాటు కులగణనచేస్తే అది సమగ్రంగాను, వివాదాలకు అతీతంగా ఉంటుంది. అందువల్ల వెంటనే కేంద్ర ప్రభుత్వం జనగణన, కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము. కులగణనకు బిజెపి వ్యతిరేకంగా ఉందన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి. దీనిపై తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరుతున్నాము.
పేదల ఆధీనంలో ఉన్న భూములకు ఇళ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇవ్వాలి
ఈ నెల 15న భూపంపిణీ చేపట్టబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికెలాంటి సన్నాహాలు చేయకుండా కేవలం పేద ప్రజల కంటి తుడుపుకోసం ఈ ప్రకటన చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు పంపిణీకి అందుబాటులో ఉన్నాయి. కానీ పేదలు అర్జీలు పెట్టుకొని పదేపదే రెవిన్యూ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. పైగా అనేక చోట్ల పేదలపై దౌర్జన్యం చేసి కేసులు పెట్టి బలవంతంగా ఖాళీలు చేయిస్తున్నది. పోడు భూముల నుండి గిరిజనుల్ని బలవంతంగా గెంటేస్తున్నది. ఖాళీ భూములను రియల్ ఎస్టేట్‌పరం చేస్తున్నది. పరిశ్రమల పేరుతో రైతుల నుండి బలవంతంగా తీసుకున్న ఖాళీ భూములను, అన్యాక్రాంతమైన భూములను సంబంధిత రైతులకు తిరిగి స్వాధీనం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది.
సమగ్ర భూపంపిణీకి ఈ క్రింది చర్యలు తీసుకోవాలనీ సిపిఎం డిమాండ్ చేస్తున్నది.
(1) పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ, అటవీ భూములన్నిటికీ తక్షణం పట్టాలు ఇవ్వాలి.
(2) అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి పేదలకు స్వాధీనం చేయాలి.
(3) పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ రైతులందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలి.
(4) అనేక పట్టణాల్లో దాదాపు రెండు లక్షలమందికి పైగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. వారందరికీ పట్టాలు ఇవ్వాలి.
(6) పరిశ్రమలు పెట్టకుండా కార్పొరేట్ల ఆధీనంలో ఉన్న భూములను వెంటనే స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలి.
(7) కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలు సమీక్షకై ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలి.
కరువును ఎదుర్కోటానికి తక్షణం పదివేల కోట్లు కేటాయించాలి
రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ క్యాబినెట్ సమావేశంలో ఇది కనీసం చర్చ కూడా రాకపోవటం అన్య్యాయం. రైతుల, కూలీల సమస్యలు గ్రామీణ పేదల దుస్థితి అర్థం చేసుకోలేని ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నాం. పంట నష్టపరిహారానికి రెండోపంట వేసుకునేందుకు అవసరం అప్పులపై వడ్డీ మాఫీకి తక్షణం కనీసం పదివేలకోట్లు కేటాయించి సహాయక చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణం కేంద్ర ప్రభుత్వం బృందాలను పంపి ప్రకృతి సహాయ నిధి నుండి నిధులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి గ్రామీణ ప్రజలను ఆదుకోవాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి