శ్రీయుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గారికి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
మంగళగిరి.
విషయం : సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌పై చేయిచేసుకున్న సిఐ నరేంద్ర రెడ్డిపై చర్య తీసుకోవాలని, రాంభూపాల్ తదితరులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ...
అయ్యా!
గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో ప్రభుత్వ స్థలంలో గత నాలుగు సంవత్సరాల క్రితం 150 మంది పేదలు గుడిసెలు వేసుకున్న గుడిసెలను నేడు తెల్లవారుజామున పోలీసులు కూల్చివేశారు. ఈ కూలీలు దళిత, గిరిజన తెగలకు చెందినవారు. ఈ భూమినుండి పేదలను ఖాళీ చేయించకుండా హైకోర్టు నందు డబ్ల్యూపి నెంబర్ 39328 /2022 రిజిస్ట్రేషన్ నెంబర్ 29532/ 2022 రిట్ వేయడమైనది. ఆ స్థలాల్లో పేదలను తొలగించరాదని కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చినది. అయినప్పటికీ ఈరోజు (1.11.2023న) అనంతపురం రూరల్ డిఎస్పి ఆధ్వర్యంలో ఐదు మంది సీఐలు, ఎనిమిది మంది ఎస్.ఐలు, పదుల సంఖ్యలో పోలీసులు నాలుగు జెసిబిలతో స్థానిక అధికార పార్టీ అనుచరులను వెంటబెట్టుకుని తెల్లవారుజామున ఇంటిలో నిద్రిస్తున్న వారిని భయపెట్టి కనీసం వారు సామాన్లు కూడా తీసుకొననియ్యకుండా దౌర్జన్యం చేసి ఇళ్ళను కూల్చివేశారు. ఈ గుడిసెలపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూల్చివేశారు.
గుడిసెలు తొలగిస్తున్న చోటికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ వెల్లగానే ఇటుకలపల్లి సిఐ వై.నరేంద్ర రెడ్డి ఆయనను కొట్టి, షర్ట్ కాలర్ పట్టి లాగుతూ ‘‘ముందు ఈ నాకొడుకును లోపలెయ్యండి’’ అన్నారు. ఆయన దౌర్జన్యానికి మహిళలు అడ్డురాగా లక్ష్మీదేవి అనే మహిళను జుట్టు పట్టి లాగేశాడు. పేదలని నానా దుర్భాషలాడుతూ ‘‘మాదిగ నా కొడుకులు ఎక్కడ స్థలం ఉంటే అక్కడేసుకుంటారు’’ కులం పేరుతో దూషించారు.
ప్రజలు, సిపిఎం జిల్లా కార్యదర్శితోపాటు జిల్లా కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, తరిమెల నాగరాజు మండల కార్యదర్శి చెన్నారెడ్డి మండల నాయకులు నల్లప్పలపై దాడిచేసి దౌర్జన్యం చేశారు. ఆయన దౌర్జన్యాన్ని ప్రశ్నించిన వారిపై డ్రస్ విప్పుతూ ‘‘రండిరా చూసుకుందాం నా కొడుకులారా’’ అంటూ అసభ్యంగా ప్రవర్తించారు. కానిస్టేబుల్స్ ఆయనను అడ్డుకున్నా రెచ్చిపోయి సిపిఐ(యం) పార్టీని, వి.రాంభూపాల్‌ను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు.
కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ గుడిసెలను కూల్చివేయడం, మా పార్టీ నాయకులపై అసభ్యకరంగా దూషిస్తూ, ఈ రకమైన దౌర్జన్యానికి పాల్పడడం దారుణం. కాబట్టి మీరు చొరవ తీసుకొని ఈ ఘటనకు కారణమైన సిఐ నరేంద్ర రెడ్డిపై చర్య తీసుకోవాలని, అరెస్టు చేసిన రాంభూపాల్‌ను, ఇతర నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాను. కూలగొట్టిన గుడిసెలను పునరుద్దరించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి