బిజెపి అనుసరిస్తోన్న తప్పుడు విధానాల వల్ల దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధిస్తుందని, ఇదే జరిగితే దేశ ప్రజలు దివాలా తీస్తారని, ఆర్ధిక భారాలతో విలవిల్లాడుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో, దేశంలో అసమానతలు లేనటువంటి అభివృద్ధి సాధించాలన్న నినాదంతో ప్రజలను సమీకరించాలని సిపిఎం భావించిందని, ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరులోని డాక్టర్ జెట్టిశేషారెడ్డ్డి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వి.ఉమామహేశ్వరావు ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. భవన నిర్మాణ రంగం కార్మికులకు చంద్రన్న, జగనన్న ఇద్దరూ ఒక్క రూపాయి కూడా అందజేయలేదని విమర్శించారు. కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయోజనాల నిమిత్తం కాజేసిందన్నారు. దేశంలో కోట్లాది మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, జిల్లాలో రెండు లక్షల మందికి పైగా ఉన్నారని తెలిపారు. వీరికి కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత భద్రత లేదన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే , కాదు మేము పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని బిజెపి హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాని, విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరు కుమార్ మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోని ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.. ఈ సదస్సులో దాదాపుగా 16 డిమాండ్లతో అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టాన్ని ప్రభుత్వం రూపొందించాలంటూ తీర్మానం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మోహన్‌రావు, నాయకులు జి.నాగేశ్వరరావు, మహిళా నాయకులు దుగ్గిరాల అన్నపూర్ణమ్మ , తదితరులు ప్రసంగించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు టి.వి.వి ప్రసాద్, సిఐటియు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.