పట్టణాలు బాగుండాలంటే మోడీని గద్దెదించాలి

 

సరళీకరణ ఆర్థిక విధానాలను అవలంభిస్తూ, పట్టణ ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ కార్పొరేట్లకు దోచిపెడుతున్న ప్రధాని మోడీ గద్దె దిగితేనే పట్టణాలు బాగుపడతాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. బిజెపి సర్కారును రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు నమ్ముకుంటే మునిగిపోక తప్పదని హెచ్చరించారు. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, సంస్కరణలు - పట్టణ ప్రజలపై దుష్ప్రభావాలు' అనే అంశంపై విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు శుక్రవారం జరిగింది. సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో బాబూరావు ముఖ్య అతిథిగా పాల్గని మాట్లాడారు. చెత్త, ఆస్తి పన్ను, విద్యుత్‌ ఛార్జీల భారాలను మోపే మెయిన్‌ స్విచ్‌ కేంద్ర ప్రభుత్వం వద్దే ఉందని తెలిపారు. యూజర్‌ ఛార్జీలతో ప్రజల నడ్డివిరుస్తున్నా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మోడీ సంస్కరణలకు వంతపాడడం దారుణమన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు అందించే ప్రతి సేవనూ వ్యాపారమయం చేశారని, ఛార్జీల పేరుతో పేదలపై పెనుభారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు లక్షల ఇళ్లంటూ ప్రచారం చేసుకున్న జగన్‌ ప్రభుత్వం... గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభించలేదన్నారు. జగనన్న కాలనీలు ప్రచారార్భాటంగా మారాయని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ మాట్లాడుతూ పరిశ్రమలను పాలకులు మూసేసి వాటి స్థలాలను రియల్‌ ఎస్టేట్‌ సంస్థల కబంధ హస్తాల్లోకి పెట్టేస్తున్నారని విమర్శించారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎంవి.ఆంజనేయులు మాట్లాడుతూ నిధుల కుదింపే సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. సదస్సులో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లు, సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, మాజీ కార్పొరేటర్‌ బట్టా ఈశ్వరమ్మ, నాయకులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, జగన్‌, పీపుల్‌ ఫర్‌ ఇండియా నాయకులు బిఎల్‌.నారాయణ, వార్వా అధ్యక్షులు గురప్ప పాల్గొన్నారు.