పండ్లతోటల రైతుల సమస్యలపై రాష్ట్ర సదస్సు

పండ్ల తోటల రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహమూ అందించకుండా అత్యంత నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నాయని రైతు సంఘం నాయకులు అన్నారు. పండ్ల తోటల రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం రాష్ట్ర సదస్సు జరిగింది. పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్‌ ముఖ్య అతిథులుగా పాల్గని మాట్లాడారు. రాష్ట్రంలో 19 రకాల పండ్లు, 23 రకాల కూరగాయలు, తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పంటలను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో వీటి సాగు మరింత ఎక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని పండ్ల తోటల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిందని, ఆచరణలో సాగు రైతులకు అందించిన సాయం నామమాత్రమేనని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చాక పండ్ల తోటలను పూర్తిగా విస్మరించిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో ధైర్యం నింపాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాల పండ్ల తోటలకు మాత్రమే పంటల బీమా అమలు చేస్తూ.. రైతులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్ల తోటల రైతుల సమస్యలపై ప్రభుత్వాలు అవలంభిస్తోన్న నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఇందు కోసం రైతులు ఐక్యం కావాలని కోరారు. పండ్ల తోటల రైతులకు ఎపి రైతు సంఘం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం పండ్ల తోటల రైతుల సమస్యలపై 10 తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వీటి పరిష్కారం కోసం ఐక్యపోరాటాలు నిర్వహించేలా తీర్మానం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం అనంతపురం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, చంద్రశేఖర్‌ రెడ్డి, రైతు సంఘం నంద్యాల జిల్లా నాయకులు నరసింహ, కడప జిల్లా నాయకులు దస్తగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.