మైనార్టీలపై పెరిగిన దాడులు- రాష్ట్ర మైనార్టీ సదస్సులో మధు, గఫూర్‌

 

- రాజకీయ పార్టీలు బిజెపి వైపా? ప్రజాస్వామ్యం వైపో తేల్చుకోవాల

బిజెపి తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో, రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు ఎక్కువయ్యాయని ఈ దాడులను కాంగ్రెస్‌, వైసిపి, టిడిపి, జనసేన రాజకీయ పార్టీలు ఖండించలేదని, మైనార్టీలకు అండగా, వారి హక్కుల సాధనకు సిపిఎం కట్టుబడి పనిచేస్తోందని మాజీ పార్లమెంట్‌ సభ్యులు, సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్ర ప్రాంగణంలో మైనార్టీ రాష్ట్ర సదస్సును గురువారం నిర్వహించారు. మైనార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్‌ చిష్టి అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. మైనార్టీల జోలికి వస్తే బిజెపి పతనం తప్పదన్నారు. టిడిపి, బిజెపి, జనసేనలు తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. స్కిల్‌ స్కామ్‌ కేసులో జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును ఎల్లకాలం జైలులోనే ఉంచరని తెలిపారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బిజెపికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. ఉత్తరాంచ్‌ల్లో 350 మసీదులు కూలగొట్టారన్నారు. పౌరస్మృతి, మతోన్మాదంతో రెచ్చిపోతున్న బిజెపిపై పోరాటం సాగించేది సిపిఎం మాత్రమేనని చెప్పారు. బిజెపితో వద్దు లౌకికవాదంతో ముద్దు అనే నినాదంతో కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలు ఏకం కావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ.గఫూర్‌ మాట్లాడుతూ.. బిజెపితో అంటకాగుతున్న ప్రభుత్వాలు ప్రజాగ్రహాలకు గురై పతనం కాక తప్పదని హెచ్చరించారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి, వారి అభివృద్ధి కోసం ఎటువంటి విధానాలు కావాలనే అంశంపై చర్చించి సిపిఎం ఆధ్వర్యంలో ఆయా అంశాలపై తీర్మానం చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజాపక్షమా? బిజెపి పక్షమా? అనేది తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు. సిపిఎం రాష్ట్ర నాయకులు ముజఫర్‌ అహ్మద్‌, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌, సిపిఎం పట్టణ కార్యదర్శి షేక్‌ సిలార్‌ మసూద్‌ ప్రసంగించారు. పలు జిల్లాల మైనార్టీ నాయకులు,ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.