దళిత సమస్యల పరిష్కారానికై, ప్రత్యామ్నాయ విధానాలకై కాకినాడలో సిపిఎం రాష్ట్ర సదస్సు..

ఏళ్లు గడుస్తున్నా దళితులపై ఆగని వివక్ష
 

- పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
- మోడీ పాలనలో ప్రమాదంలో భారత రాజ్యాంగం
- రాష్ట్ర దళిత సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి :స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దళితులు కుల వివక్షను ఎదుర్కొంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. బిజెపి అధికారంలోకొచ్చిన తర్వాత అగ్రకుల దురహంకారులు, మనువాదులు మరింత పేట్రేగిపోతున్నారని, ఈ తరుణంలో దళితుల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే మార్గమని తెలిపారు. దళితుల సమస్యలపై కాకినాడలోని సూర్య కళామందిరంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన రాష్ట్ర దళిత సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కావాలని, కులవివక్ష పోవాలని, సమసమాజ స్థాపన కోసం కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లో అమలు పరచడానికి దళితులు, వామపక్షాలు చేసిన పోరాటాలే కారణమన్నారు. నేడు సబ్‌ప్లాన్‌ నిధులను జగన్‌ ప్రభుత్వం ఇతర అవసరాలకు తరలించి దళితులకు అన్యాయం చేసిందని తెలిపారు. జగనన్న కాలనీలు ఆధునిక మురికివాడలుగా మారాయని విమర్శించారు. బీహార్‌లో మాదిరిగా రాష్ట్రంలోనూ కేంద్రంతో సంబంధం లేకుండా కుల గణన నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. రాష్ట్రంలో అధికార పార్టీతో పాటు టిడిపి, జనసేన పార్టీ కూడా బిజెపి వెంటే ఉన్నాయన్నారు. కుల వివక్షను పెంచి పోషిస్తోన్న బిజెపికి సమాధి కట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు. 2024లో బిజెపి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, అసమానతలు లేని అభివఅద్ధి కోసం, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టం అమలు కోసం సిపిఎం ప్రజా రక్షణ బేరి కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు బస్సు యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ అసమానతలు లేని అభివఅద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వివిధ సమస్యలపై సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే దళితుల స్థితిగతులను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు సిపిఎం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించిందన్నారు. దళిత యువకుడిని హత్య చేసి నేరుగా డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు వంటి వ్యక్తులను ప్రభుత్వం వెనకేసుకుని రావడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుల నిర్మూలన కోసం దళిత సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ దళిత నాయకులు అయితాబత్తుల రామేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి, వైసిపి పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. నేటికీ అనేక గ్రామాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సదస్సులో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు నల్లప్ప, సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు జి.బేబిరాణి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.