
కౌలు చెక్కులివ్వాలని డిమాండ్ చేస్తూ అసైన్డ్, సీలింగ్ భూముల రైతులు తుళ్ళూరు క్రిడా కార్యాలయాన్ని ముట్టడించారు. లైబ్రరీ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి క్రిడా కార్యాలయం ఎదుట గంటకు పైగా బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పేద వ్యవసాయ కూలీలకు రూ. 2,500 పింఛన్, అసైన్డ్, సీలింగ్ భూముల రైతులకు కౌలు చెక్కులివ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్రిడా ప్రాంత సిపిఎం కన్వీనర్ సిహెచ్.బాబురావు, సిపిఎం డివిజన్ కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, నవీన్ప్రకాష్ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆందోళనకు అధికారులు స్పందించకపోవడంతో రైతులు కార్యాలయంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో ఎస్ఐ రవికుమార్, టిడిపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఎస్ఐ క్రిడా అడిషినల్ కమిషనర్ చెన్నకేశవులతో సంప్రదిం చారు. అనంతరం టిడిపి నాయకులు సుధాకర్, పట్టాభిరామయ్య, సాంబశివరావు, అనీల్, సిపిఎం నాయకులు, రైతులను అడిషినల్ కమిషనర్ వద్దకెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించారు. నాలుగు నెలలుగా సమస్యలను పరిష్కరించక పోవడానికి కారణమేమిటి, అసైన్డ్ భూములను పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందా అని నాయకులు ప్రశ్నించారు.