సమగ్రాభివృద్ధికై నవంబర్‌ 7న భారీ బహిరంగసభ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

సామాజిక, ప్రాంతీయ అసమానతలు లేని సమగ్రాభివృద్ధికోసం ప్రత్యామ్నాయ విధానాలతోకూడిన ప్రజా ప్రణాళికలు రూపొందిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 7న విజయవాడ నగరంలో రాష్ట్ర సమగ్రాభివృద్దికోసం భారీ బహిరంగ సభ జరుగుతుందని, దీనికి సిపిఎం అఖిలభారత ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారని తెలిపారు. విజయవాడలోని ఎంబివికెలో సిపిఎం ఆధ్వర్యంలో అసమానతలు లేని అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ది, ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. . వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, సాగునీటి ప్రాజెక్టులు, విద్య,వైద్యరంగాలు, సామాజిక న్యాయం, ప్రాంతీయ అభివృద్ది-రాజధాని అంశం, స్థానిక సంస్థలు- వికేంద్రీకరణ- సచివాలయాలు, విభజన చట్టం హామీలు అమలు లాంటి ఎనిమిది కీలకాంశాలపై నిర్వహించిన సెమినార్‌ ఆదివారం సాయంత్రం ముగిసింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనంతపురంలో మొదలు పెట్టిన ప్రజారక్షణ భేరీ కార్యక్రమం ఈ నెల 20తేదీతో ముగుస్తుందన్నారు. 21 నుండి వచ్చే నెల మూడోతేదీదాకా సమగ్రాభివృద్దికోసం మూడు బస్‌జాతాలు జరుగుతాయని తెలిపారు. పార్వతీపురం జిల్లా సీతంపేట నుండి సామాజిక బస్సు జాతా, కర్నూలు జిల్లా ఆదోని నుండి కరువు, వెనుకబాటుతనం జాతా, శ్రీకాకుళం మందస నుండి పారిశ్రామిక జాతా బయలు దేరుతుందన్నారని అన్నారు. నవంబర్‌ 3వ తేదీనాటికి ఈ మూడు జాతాలు విజయవాడకు చేరుకుంటాయని తెలిపారు. అనంతరం నవంబర్‌ 7న భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ది అజెండాగా జరిగే ఈ చారిత్రాత్మకమైన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రానికి బిజెపి తీరని ద్రోహం చేసిందన్నారు. అలాంటి బిజెపితో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటకాగుతోందన్నారు. జనసేన నాయకుడు ఎన్డీయేనుండి బయటకు ఒకడుగు ముందుకేసినట్టుగా చెప్పి, ఇంతలోనే నాలుగడుగులు వెనక్కి వేశారని అన్నారు.. బిజెపితో బంధంపై తెలుగుదేశం తన వైఖరేమిటో తేల్చి చెప్పాలన్నారు.
             ఇప్పుడు జరగాల్సింది పెట్టుబడి కేంద్రీకరణ, విస్తరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో అదానీకి గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని అన్నారు. . అదాని ఇప్పటి దాకా కొత్తగా పెట్టుబడి పెట్టడం లేదని ఇప్పటికే వున్న కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కబళించారని అన్నారు. అలాగే రోడ్లు, విజయవాడ రైల్వేస్టేషన్‌, భూములను అదానీకే కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. దళితుల చేతుల్లో వున్న అసైన్డ్‌భూములను లాక్కునేందుకు ఆ చట్టాన్ని సవరణలు తీసుకొచ్చిందన్నారు. గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70, పెసా, అయిదో షెడ్యూల్‌ వంటి రక్షణలను తుంగలో తొక్కి అటవీ భూములను లాక్కొని కార్పొరేట్లకు ప్రభుత్వం కట్టబెడుతోందని ఆయన విమర్శించారు..
          పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణ్‌రావు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-05లో సెస్‌ సంస్థ సమగ్రాభివద్దిపై ఒక అద్యయనం జరిగి ఒక పుస్తకాన్ని వేశారని అన్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఏమి చేయాలనే అంశంపై ఒక సమగ్ర విధానమేదీ లేదన్నారు.. సిపిఎం ఆ ప్రయత్నం చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్దికి విజ్ఞాన కేంద్రాలు, జనవిజ్ణాన వేదిక ద్వారా జిల్లాల్లో కూడా ఇలాంటి సెమినార్‌లు నిర్వహించి నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించడదం జరుగుతుందన్నారు. ఇపుడు జరిగిన సెమినార్‌లో వచ్చిన డాక్యుమెంట్లతో ఒక పుస్తకాన్ని రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై రాము పాల్గొన్నారు.